ఎస్మా.. వెనక్కి తగ్గేదే లేదమ్మా

Jan 6,2024 21:01

ప్రజాశక్తి-పార్వతీపురంరూరల్‌ : పార్వతీపురం కలెక్టరేట్‌ ఎదుట అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యాన చేపట్టిన సమ్మె శిబిరం 26వ రోజు శనివారం కొనసాగింది. ఈ సందర్భంగా రిలే నిరాహార దీక్షలను సిఐటియు జిల్లా ప్రధానకార్యదర్శి వై.మన్మథరావు ప్రారంభించారు. ప్రభుత్వం అంగన్వాడీలపై నిర్బంధం ప్రయోగిస్తూ తీసుకొచ్చిన ఎస్మా చట్టం కాపీలను దహనం చేసి, నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మన్మథరావు, అంగన్వాడీ యూనియన్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పి.సరళారాణి, గంటా జ్యోతి మాట్లాడారు. 26 రోజులుగా సమ్మె చేస్తున్న అంగన్వాడీ న్యాయమైన సమస్యల పరిష్కరించకపోగా, ప్రభుత్వం ఎస్మా చట్టం ఉపయోగించి సమ్మె విచ్ఛిన్నం చేయాలని చూడటం దారుణమన్నారు. అత్యవసర సేవలు కింద జిఒ నంబర్‌ 2 తీసుకురావడం అత్యంత దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తంచేశారు. అత్యవసర సేవలంటే నీరు, కరెంటు, వైద్యం వంటివని, కానీ అంగన్వాడీలను కూడా అత్యవసర సేవల కింద తీసుకువచ్చి ఎస్మా చట్టాన్ని ప్రయోగించడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. ఎస్మా లాంటి చట్టాలు ఉపయోగించి నిర్బంధం ప్రయోగించాలని చూస్తే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. దీక్షలకు ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా నాయకులు రమణి మద్దతు తెలిపారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా కోశాధికారి గొర్లి వెంకటరమణ, పట్టణ నాయకులు బొత్స లక్ష్మి, ఎపి స్టేట్‌ కాంట్రాక్ట్‌ అవుట్‌ సోర్సింగ్‌ యూనియన్‌ జెఎసి నాయకులు బి.వి.రమణ, పట్టణ పౌర సంక్షేమ సంఘం కార్యదర్శి పాకల సన్యాసిరావు, అంగన్వాడీ యూనియన్‌ ప్రాజెక్టు నాయకులు మర్రాపు అలివేలు, సాలూరు గౌరీమణి, తదితరులు పాల్గొన్నారు.సీతానగరం : స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం వద్ద అంగన్వాడీలు సమ్మెను కొనసాగించారు. వీరికి గర్భాపు ఉదయభాను మద్దతు తెలిపారు. కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి జి.వెంకటరమణ, అంగన్వాడీ యూనియన్‌ నాయకులు మడక సత్యవతి, రెడ్డి లక్ష్మి, ఎస్‌.శైలజ, ఎస్‌.సునీత, యశోద, తదితరులు పాల్గొన్నారు.పాలకొండ : అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో తహశీల్దార్‌ కార్యాలయం వద్ద ఓట్లేసి తప్పు చేశామంటూ అంగన్వాడీలు గుంజీలు తీస్తూ నిరసన తెలియజేశారు. వీరికి దళిత సంఘాల జెఎసి నాయకులు బత్తిని మోహన్‌ రావు మద్దతు తెలిపారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు దావాల రమణారావు, అంగన్వాడీ యూనియన్‌ జిల్లా కార్యదర్శి ఎన్‌.హిమప్రభ, జిల్లా కోశాధికారి బి.అమరవేణి, ప్రాజెక్టు అధ్యక్షులు జి. జెస్సీబాయి, ప్రతినిధులు జి.శారద, ఆర్‌.భవాని, ఎం.శ్యామల, శ్రీదేవి, సుగుణ, లలిత, దివ్య, తదితరులు పాల్గొన్నారు.సీతంపేట : సీతంపేట ఐటిడిఎ ఎదుట నిర్వహిస్తున్న సమ్మె శిబిరంలో శనివారం అంగన్వాడీలు ఉపవాసం ఉంటూ నిరసన తెలిపారు. కార్యక్రమంలో ప్రాజెక్టు కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు ఎ.పార్వతి, ఎ.దర్శమి, సిఐటియు మండల అధ్యక్ష, కార్యదర్శులు సురేష్‌, ఎం.కాంతారావు పాల్గొన్నారు.కొమరాడ : మండల కేంద్రంలో అంతర్రాష్ట్ర రహదారిపై గోతుల వద్ద అంగన్వాడీలు ఆటలాడుతూ నిరసన తెలిపారు. ‘మా బతుకు ఈ గోతుల్లా అవ్వకూడదు’ అంటూ నిరసన కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు కొల్లి సాంబమూర్తి, అంగన్వాడీ యూనియన్‌ నాయకులు జి.జయమ్మ, నాగమణి, సింహాచలం, అమ్మ భవాని, పద్మ తదితరులు పాల్గొన్నారు.కురుపాం : అంగన్వాడీల సమ్మె 26వ రోజు చేరుకున్న సందర్భంగా ప్రాజెక్టు కార్యదర్శి జె.సరోజ ఆధ్వర్యంలో దీక్షా శిబిరం వద్ద ప్రధాన రహదారిపై అంగన్వాడీలు 26 అంకె ఆకారంలో కూర్చొని నిరసన తెలియజేశారు. ఆదివారం దీక్షా శిబిరం వద్ద ఎస్మా పత్రాలను ధ్వంసం చేస్తామని ఆమె తెలిపారు.సాలూరు : అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యాన కార్యకర్తలు, హెల్పర్లు సమ్మె శిబిరం వద్ద చెవుల్లో క్యాబేజీలు పెట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు బి.రాధ, ఎ.నారాయణమ్మ, శ్యామల, వరలక్ష్మి, తిరుపతమ్మ, పార్వతి, శశికళ పాల్గొన్నారు.ఎస్మా.. అప్రజాస్వామికంసిపిఎం జిల్లా కార్యదర్శి రెడ్డి వేణుప్రజాశక్తి -పార్వతీపురంరూరల్‌ 26 రోజులుగా శాంతియుతంగా సమ్మె చేస్తున్న అంగన్వాడీలను ఎస్మా చట్ట పరిధిలోకి తీసుకువచ్చి, సమ్మెను నిషేధించాలని చూడటం అప్రజాస్వామికమని పార్వతీపురం మన్యం జిల్లా సిపిఎం జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు, శ్రామిక మహిళా జిల్లా కార్యదర్శి వి.ఇందిర ఖండించారు. శనివారం స్థానిక సుందరయ్య భవనంలో మాట్లాడుతూ సమస్యలు పరిష్కరించకుండా సమ్మె నిషేధిస్తూ, సమ్మె కాలానికి జీతాల్లో కోత విధించడం దుర్మార్గమన్నారు. న్యాయబద్ధమైన సమ్మెను నిరంకుశ చర్యల ద్వారా విచ్ఛిన్నం చేయాలనుకోవడం సిగ్గుచేటన్నారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వ అడుగుజాడల్లో రాష్ట్ర ప్రభుత్వం నడుస్తూ, ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇదే వైఖరి కొనసాగితే జరిగే పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశ చర్యను కార్మిక, ప్రజా సంఘాలు, పార్టీలు, ప్రజాతంత్ర వాదులు ఖండించాలని కోరారు.ఎస్మా ప్రయోగం.. దుర్మార్గంసిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి జీవ తమ సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీలు శాంతియుతంగా సమ్మె చేస్తే ఎస్మా ప్రయోగించడం దుర్మార్గమని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి టి.జీవన్న ఒక ప్రకటనలో ఖండించారు. అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగం పిచ్చుకపై బ్రహ్మాస్త్రం వంటిదని పేర్కొన్నారు. వెంటనే అంగన్వాడీల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం తీరు సరికాదుగిరిజన సంక్షేమ సంఘం పోరాటం చేస్తున్న మున్సిపల్‌ కార్మికుల, అంగన్వాడీలు, సమగ్ర శిక్ష ఉద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం తీరు సరిగా లేదని గిరిజన సంక్షేమ సంఘం ఉత్తరాంధ్ర ప్రధాన కార్యదర్శి పాలక రంజిత్‌ కుమార్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగించడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్మా ప్రయోగిస్తూ ఇచ్చిన జిఒను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.

➡️