ఏజెన్సీల అభివృద్ధికి రోడ్లు, వంతెనలు

Jan 30,2024 20:39

ప్రజాశక్తి – పాచిపెంట: మండలంలోని మోదిగ, కేసలి పంచాయతీల్లో 9 గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యం కోసం కుంతాం నుండి కాట్రగుడ్డి వరకు రూ.5 కోట్ల 40లక్షలతో 6.7 కిలోమీటర్లు నిర్మించిన బీటీ రోడ్డును, అలాగే రెండు కోట్లతో నిర్మించిన వంతెనను మంగళవారం డిప్యూటీ సిఎం పి.రాజన్నదొర ప్రారంభించారు. అలాగే కాట్రగుడ్డి వద్ద రూ.5 కోట్ల 75 లక్షలతో వంతెన పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం అడారిపాడు వద్ద ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. ఈ రహదారి వంతెనల నిర్మాణంతో గిరిజన గ్రామాలకు రవాణా సౌకర్యం కలుగుతుందన్నారు. అలాగే మారుమూల గ్రామాల రోడ్డు నిర్మాణాలకు నిధులు మంజూరు చేస్తానన్నారు. మండలంలోని ఏజెన్సీ ప్రాంతాల్లో రహదార్లు, వంతెనలు మంజూరైనప్పటికీ అటవీ శాఖ అభ్యంతరాలు వల్ల అభివృద్ధి పనులు నిలిచిపోయాయని, వాటి అనుమతుల కోసం మూడేళ్లు కేంద్ర, రాష్ట్ర కార్యాలయాల చుట్టూ తిరిగి అనుమతులు తెచ్చి కాంట్రాక్టర్‌ను బతిమాలి రోడ్డు వంతెనలు పనులు పూర్తి చేయించానని తెలిపారు. పూర్తయిన రోడ్డు మీద నుండి నడిచి వస్తుంటే తనకు ఎంతో ఆనందాన్ని కలిగిందన్నారు. రోడ్డు నిర్మాణంతో అరకుకు ప్రయాణం సులభం అవుతుందని ఒడిశా, చత్తీష్‌గడ్‌ రాష్ట్ర వాసుల రాకపోకలతో ఈ ప్రాంతమంతా పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. అలాగే పెద్దగెడ్డ రిజర్వాయర్‌ను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తానన్నారు. మండలంలో పది రోజుల వ్యవధిలో సుమారు రూ.50 కోట్లతో వంతెనలు, రోడ్లు ప్రారంభాలు, శంకుస్థాపనలు చేశామని తెలిపారు. అలాగే ప్రతి గిరిజన గ్రామాల్లో తాగునీరు సౌకర్యం కల్పించామన్నారు. గతంలో రేషన్‌ తీసుకునేందుకు సుమారు 15 కిలోమీటర్లు వెళ్లే వారిని, కిలోమీటర్లోపు రేషన్‌ డిపోను ఏర్పాటు చేశామని తెలిపారు. టిడిపి నాయకులు గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి పనులను పట్టించుకోలేదన్నారు. ఐదేళ్లకొకసారి ఎన్నికల సమయంలో గ్రామాల్లోకి వచ్చి కల్లబొల్లి అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేసి ఓట్లు అడుగుతారని అటువంటి వారి మాటలు నమ్మి మోసపోవద్దని అన్నారు. కార్యక్రమంలో ఎంపిపి బి.ప్రమీల సర్పంచులు మజ్జి సావిత్రి, ఎస్‌.నిర్మల, వైస్‌ ఎంపిపిలు ఎం.నారాయణ, కె.రవీంద్ర, ఎంపిటిసి సభ్యులు, వైసిపి మండల అధ్యక్షులు గొట్టాపు ముత్యాలునాయుడు, నాయకులు డి.బాబ్జీ, పి.వీరంనాయుడు, టి.గౌరీశ్వ రరావు, ఇంజనీరింగ్‌ అధికారులు పాల్గొన్నారు.

➡️