ఐదో రోజుకు మున్సిపల్‌ కార్మికుల సమ్మె

Dec 30,2023 21:20

ప్రజాశక్తి-బొబ్బిలి  : మున్సిపల్‌ కార్యాలయాన్ని మున్సిపల్‌ కాంట్రాక్టు కార్మికులు ముట్టడించారు. మున్సిపల్‌ కాంట్రాక్టు కార్మికులు చేపట్టిన సమ్మె ఐదోరోజు శనివారం కొనసాగింది. కౌన్సిల్‌ సమావేశం నిర్వహించడంతో కాంట్రాక్టు కార్మికులు మున్సిపల్‌ కార్యాలయాన్ని ముట్టడించి, గేట్లకు తాళం వేసి, సమావేశానికి వచ్చిన చైర్మన్‌ సావు వెంకట మురళీకృష్ణను అడ్డుకున్నారు. కాంట్రాక్టు కార్మికులను రెగ్యులర్‌ చేయాలని కౌన్సిల్‌ తీర్మానించాలని చైర్మన్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. సమస్య పరిష్కారానికి చొరవ తీసుకుంటామని హామీ ఇవ్వడంతో కార్మికులు గేట్లు తీసి లోపలికి విడిచిపెట్టారు. కాంట్రాక్టు కార్మికులను రెగ్యులర్‌ చేసే వరకూ పోరాటం చేస్తామని సిఐటియు జిల్లా అధ్యక్షులు పి.శంకరరావు, మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ నాయకులు గౌరీష్‌ హెచ్చరించారు. కార్యక్రమంలో కార్మికులు పాల్గొన్నారు.మున్సిపల్‌ చెత్త వాహనం అడ్డగింతప్రయివేట్‌ డ్రైవర్‌తో నడుపుతున్న మున్సిపల్‌ చెత్త వాహనాన్ని పట్టణంలోని బజారువీధిలో కాంట్రాక్టు కార్మికులు అడ్డుకున్నారు. మున్సిపల్‌ కాంట్రాక్టు కార్మికులు సమ్మెలో ఉండడంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రయివేట్‌ డ్రైవర్‌తో చెత్త వాహనాన్ని అధికారులు నడపడంతో కాంట్రాక్టు కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా ప్రయివేట్‌ వ్యక్తులను పనిలో పెట్టుకుంటే అడ్డుకుంటామని సిఐటియు జిల్లా అధ్యక్షులు పి.శంకరరావు, మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ పట్టణ అధ్యక్షులు గౌరీష్‌ హెచ్చరించారు.

రాజాం : పట్టణంలో సిఐటియు జిల్లా కార్యదర్శి సిహెచ్‌.రామ్మూర్తి నాయుడు ఆధ్వర్యాన నల్ల జెండాలు, దుస్తులతో కార్మికులు పట్టణంలో ర్యాలీ చేపట్టారు. కార్యక్రమంలో ఫెడరేషన్‌ పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు శ్రీనివాసరావు, అనిల్‌కుమార్‌, లక్ష్మి, గురువులు, రాంబాబు, వెంకటి, గోపి, తదితరులు పాల్గొన్నారు.

నెల్లిమర్ల : స్థానిక నగర పంచాయతీ కార్యాలయం వద్ద చేపడుతున్న సమ్మె శిబిరాన్ని టిడిపి నాయకులు సందర్శించి, మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటి సభ్యులు కిల్లంపల్లి రామారావు, టిడిపి కౌన్సిలర్లు అవనాపు సత్యనారాయణ, లెంక హైమావతి, కింతాడ కళావతి, ముడిమంచి లక్ష్మి, నరవ రామలక్ష్మి, మజ్జి అన్నపూర్ణ, టిడిపి నాయకులు పొడుగు కృష్ణ వేణి, ముడుమంచి లక్ష్మణ, మజ్జి ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.

విజయనగరం టౌన్‌ : ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ మున్సిపల్‌ కార్మికులు చేపట్టిన సమ్మె ఐదో రోజుకు చేరుకుంది. సమ్మెను విచ్ఛిన్నం చేసేందుకు పోటీ కార్మికులు తీసుకొచ్చి అడ్డుకున్న నాయకత్వాన్ని అరెస్టులు చేసి నిర్బంధించడాన్ని ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ (సిఐటియు) వ్యతిరేకిస్తుందని యూనియన్‌ రాష్ట్ర కమిటీ సభ్యులు ఎ.జగన్మోహన్‌రావు తెలిపారు. శనివారం విజయనగరం కార్పొరేషన్‌ కార్యాలయం వద్ద కళ్లకు గంతలు కట్టుకుని ఒంటి కాళ్లపై నిల్చొని నిరసన తెలిపారు. మున్సిపాలిటీల్లో పని చేస్తున్న పారిశుధ్య, వాటర్‌ వర్క్స్‌, విలీన ప్రాంత, పంప్‌ హౌస్‌ , ఎలక్ట్రికల్‌ కార్మికులు, క్లాప్‌ డ్రైవర్లలో అత్యధికులైన దళితులు, వెనుకబడిన తరగతులపై యుద్ధం ప్రకటించడమేనా ఈ ప్రభుత్వ సామాజిక సాధికారత అని ప్రశ్నించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి సమస్యలు పరిష్కరించకపోతే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నిరసన కార్యక్రమంలో రామచందర్రావు, రాఘవ, రామారావు, వంశీ, శ్రీను, బాబురావు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

➡️