ఓటమి భయంతోనే అక్రమ అరెస్ట్‌లు

ఓటమి భయంతోనే అక్రమ అరెస్ట్‌లు

ప్రజాశక్తి- అనకాపల్లి : లోకేష్‌ యువగళం పాదయాత్ర ముగింపు సభకు ఐదు లక్షల పైబడి ప్రజలు రాకతో సిఎం జగన్‌ రెడ్డికి భయం పట్టుకుందని టిడిపి జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీశ్వరరావు ఆరోపించారు. ఆదివారం స్థానిక పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ,. జగన్‌రెడ్డి సంతోషానికి అక్రమ కేసులో లోకేష్‌ను ఇరికించి అరెస్టు చేయాలన్న సిఐడి ప్రయత్నాలను హైకోర్టు బ్రేకులు వేసిందన్నారు. సోషల్‌ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టిన వారిపై ఎటువంటి చర్యలు తీసుకోకూడదని, అరెస్టులు చేయొద్దని సుప్రీం కోర్ట్‌ చెప్పినప్పటికీ జగన్‌ రెడ్డి ఆదేశాలతో ఎన్‌ఆర్‌ఐ యాష్‌కు లుక్‌ యట్‌ నోటీసులు ఇచ్చి శంషాబాద్‌ విమానాశ్రయములో అక్రమంగా అరెస్టు చేసి గుంటూరుకు తరలించడంపై కోర్టు మొట్టికాయలు వేసిందన్నారు. 41 నోటీస్‌ ఇచ్చి విచారణ చేయాలని కోర్టు ఆదేశించిందన్నారు. హైకోర్టు న్యాయమూర్తులపై సోషల్‌ మీడియాలో పత్రికల్లో విమర్శలు చేసిన వారిపై కేసులు నమోదు చేయాలని కోర్టు ఆదేశించినా బేఖాతరు చేసిన సిఐడి, ఇపుడు జగన్‌ ఆదేశాలతో విపక్షాలపై చిన్నకేసుల్లోనూ అరెస్ట్‌ చేసి వేధింపులకు పాల్పడడం శోచనీయమన్నారు. అవినీతి కేసుల్లో 16 నెలలు జైలులో ఉన్న జగన్‌ రెడ్డి, ప్రత్యర్థులను జైల్లో ఉంచాలని కక్షపూరిత చర్యలకు సిఐడి, అధికారులు అండగా ఉండడం విచారకరమన్నారు.ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులు, అన్ని వర్గాలు ఉద్యమబాట పట్టాయని, ఎన్నికల్లో ఎన్ని పార్టీలు కలిసొచ్చినా తమకు భయం లేదని గొప్పలకు పోతున్న వైసిపి నేతలు, తెలుగుదేశం జనసేన కూటమి చూసి భయపడుతున్నారని వ్యాఖ్యానించారు. నియంత జగన్‌కు బుద్ధి చెప్పే రోజుల దగ్గర పడ్డాయని నాగ జగదీష్‌ అన్నారు. సమావేశంలో పార్లమెంట్‌ బీసీ సెల్‌ అధ్యక్షులు గింజల లక్ష్మణరావు జిల్లా బీసీ సెల్‌ ఉపాధ్యక్షులు గుర్రం నూకరాజు జిల్లా బీసీ సెల్‌ ప్రధాన కార్యదర్శి రేసుపూడి రమణ జిల్లా బీసీ సెల్‌ అధికార ప్రతినిధి విల్లూరి రమణబాబు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న నాగ జగదీష్‌

➡️