ఓటరు మార్పు, చేర్పులపై రీసర్వే: కలెక్టర్‌

Feb 7,2024 21:58

ఓటరు మార్పు, చేర్పులపై రీసర్వే: కలెక్టర్‌
ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్‌:
ఫారం- 8 ద్వారా వచ్చిన మార్పులు, చేర్పులు, మరణించిన వాటికీ సంబంధించి బిఎల్‌ఓల ద్వారా మళ్ళీ ఒక్కసారి సర్వే చేయించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్‌ ఎస్‌.షన్మోహన్‌ పేర్కొన్నారు. బుధవారం జిల్లా కలెక్టరేట్‌లోని సమావేశం హల్‌లో డిఆర్‌ఓ ఎన్‌.రాజశేఖర్‌తో కలసి ఓటర్‌ జాబితా, ఫారం 6,7 8 ద్వారా వచ్చిన వాటిపై, పోలింగ్‌ కేంద్రాలకు సంబంధించి గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీల నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాకు ఆర్డీఓలు, తహశీల్దార్లు కొత్త వారు రావడం జరిగిందని, ఫారం-8 ద్వారా వచ్చిన మార్పులు, చేర్పుల తోపాటుగా మరణించిన వాటికీ సంబంధించి బిఎల్‌ఓల ద్వారా మళ్ళీ ఒక్కసారి ఇంటింటికీ వెళ్లి సర్వే చేయించడం జరుగుతుందని తెలిపారు. డబ్బుల్‌ ఎంట్రీ ఓటర్లు లేరని బిఎల్‌ఓలు లెటర్లు కూడా ఇవ్వడం జరిగిందని తెలిపారు. జిల్లాలో 93 శాతం ఓటర్‌ కార్డుకు ఆధార్‌ లింక్‌ చేయడం జరిగిందన్నారు. నామినేషన్లు వేసే వరకు ఫారం 6 ద్వారా కొత్త ఓటరుగా నమోదు చేసుకోవచ్చని తెలిపారు. 18 నుండి 22 సంవత్సరాల యువత కొత్తగా ఫారం 6 ద్వారా ఓటర్‌గా నమోదుకు సంబంధించి ఆధార్‌కార్డుతో పాటు స్కూల్‌ సర్టిఫికేట్‌ను తప్పనిసరిగా అందజేయాలన్నారు. పోలింగ్‌ బూత్‌ నుండి వేరే పోలింగ్‌ బూత్‌కు, నియోజకవర్గం నుండి వేరే నియోజకవర్గానికి మార్పులు చేసుకున్న వాటికి సంబంధించి రిపోర్టును బిఎల్‌ఓలు ఈఆర్‌ఓలకు రిపోర్టును పంపించాలన్నారు. నేటి నుండి జిల్లా కలెక్టరేట్‌లో డిప్యూటీ కలెక్టర్‌ అధ్యక్షతన ఒక్క టీం పనిచేస్తుందని ఈ టీం అనుమానం ఉన్న 6,7,8 ఫారంలకు సంబంధించి వచ్చిన వాటిని పరిశీలించడం జరుగుతుందన్నారు. ఇప్పటికే జిల్లాలోని అన్ని పోలింగ్‌ కేంద్రాలలో తాగునీరు, విద్యుత్‌, మరుగుదొడ్లు వంటి మౌలిక సదుపాయాలు కల్పించడం జరిగిందని, ఇంకా ఎక్కడైనా పోలింగ్‌ కేంద్రాల్లో ఏమైనా సమస్యలు ఉంటే రాజకీయ పార్టీల నాయకులు వాటికి సంబంధించి వివరాలను డీఈఓ, జిల్లా కలెక్టర్‌ దష్టికి తీసుకురావాలని వారికి సూచించారు. సమావేశంలో జిల్లా కలెక్టరేట్‌ ఎన్నికల విభాగం డిప్యూటీ తహశీల్దార్‌ త్యాగరాజులు, జూనియర్‌ సహాయకులు త్యాగరాజులు, కాంగ్రెస్‌ పార్టీ నుండి డిసిసి అధ్యక్షుడు భాస్కర్‌, పరదేసి, బిజేపి జిల్లా ప్రధాన కార్యదర్శి అట్లూరి శ్రీనివాసులు, సిపిఎం జిల్లా కార్యదర్శి వి.గంగరాజు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర సెక్రెటరీ వి.సురేంద్ర కుమార్‌, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రతినిధి ఎన్‌.ఉదరు కుమార్‌, బహుజన సమాజపార్టీ జిల్లా వైస్‌ ప్రెసిడెంట్‌ పి.భాస్కర్‌, తదితరులు పాల్గొన్నారు.

➡️