ఓటు వేయడం మన బాధ్యత

Mar 26,2024 21:38

ప్రజాశక్తి- విజయనగరం : ఓటు వేయడం ప్రతి ఒక్కరి బాధ్యతని అసిస్టెంట్‌ కలెక్టర్‌ సహాదిత్‌ వెంకట త్రివినాగ్‌ అన్నారు. స్వీప్‌ కార్యక్రమంలో భాగంగా హిజ్రాలకు మంగళవారం ఓటుపై అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అసిస్టెంట్‌ కలెక్టర్‌ మాట్లాడుతూ మన పాలకులను మనమే ఎంచుకొనే గొప్ప అవకాశాన్ని ఎన్నికలు కల్పిస్తాయని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సుమారు 97 కోట్లమంది ఓటర్లు ఉన్న దేశంలో ఎన్నికలు గొప్ప ప్రజాస్వామ్య క్రతువుగా పేర్కొన్నారు. భారత పౌరులంతా తప్పనిసరిగా ఓటుహక్కును వినియోగించుకోవాలని, ఒక్క ఓటు కూడా వృధా కాకూడదని కోరారు. ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు పోలింగ్‌ కేంద్రాల్లో వివిధ సదుపాయాలను కల్పిస్తున్నామన్నారు. ఫిర్యాదులు, వినతుల కోసం వివిధ రకాల యాప్‌లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఫిర్యాదు ఇచ్చిన 100 నిమిషాల్లోనే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. విభిన్న ప్రతిభావంతుల సంక్షేమశాఖ సహాయ సంచాలకులు డాక్టర్‌ జగదీష్‌, మున్సిపల్‌ సహాయ కమిషనర్‌ తిరుమలరావు, స్వీప్‌ జిల్లా నోడల్‌ అధికారి పి.శ్రీనివాసరావు, స్వీప్‌ రిసోర్సు పర్సన్‌ పద్మనాభం, హెల్పింగ్‌ హేండ్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు కొండబాబు తదితరులు మాట్లాడారు. అనంతరం ఓటర్లతో ప్రజాస్వామ్యాన్ని కాపాడుతామంటూ పతిజ్ఞ చేయించారు.

➡️