ఓట్‌ ఫర్‌ ఒపిఎస్‌ను జయప్రదం చేయండి

Feb 6,2024 21:25

ప్రజాశక్తి – సీతానగరం : ఉద్యోగ, ఉపాధ్యాయులకు పాత పెన్షన్‌ సాధనకు యుటిఎఫ్‌ రాష్ట్ర శాఖ తలపెట్టిన ప్రత్యేక కార్యాచరణను జయప్రదం చేయాలని యుటిఎఫ్‌ నేతలు కోరారు. ఈ మేరకు మంగళవారం స్థానిక ఎమ్మార్సీ ఆవరణలో యుటిఎఫ్‌ ఆధ్వర్యంలో ఓట్‌ ఫర్‌ ఒపిఎస్‌ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా యూనియన్‌ మండల శాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పల్లి శ్రీనివాసరావు, బొత్స ప్రసాదరావు మాట్లాడుతూ పాత పెన్షన్‌ పథకం సాధనకు యుటిఎఫ్‌ చేపట్టిన ప్రత్యేక కార్యాచరణలో భాగంగా ఈనెల 6 నుంచి 12 వరకు పోస్టు కార్డు ఉద్యమం, అన్ని రాజకీయ పార్టీల రాష్ట్ర అధ్యక్షులకు లేఖలు రాస్తామన్నారు. ఈనెల 13 నుంచి 29 వరకు గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అన్ని రాజకీయ పార్టీల నాయకులకు సిపిఎస్‌, జిపిఎస్‌ విధానాలను రద్దుచేసి ఒపిఎస్‌ను పునరుద్ధరించాలని కోరనున్నట్టు తెలిపారు. ఈ కార్యచరణలో ఉపాధ్యాయులంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పోస్టర్‌ ఆవిష్కరణలో యుటిఎఫ్‌ జిల్లా కౌన్సిల్‌ సభ్యులు ఎం.గోవిందరావు, మండల కౌన్సిల్‌ సభ్యులు బి.ఆదినారాయణ, బి.రమేష్‌, ఉపాధ్యాయులు కృష్ణ, గౌరమ్మ పాల్గొన్నారు.

➡️