కంటికి రెప్పలా కాపాడేవారిపై చిన్నచూపా?

నరసరావుపేటలో మాట్లాడుతున్న అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్ప్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సుబ్బరావమ్మ
ప్రజాశక్తి-పల్నాడు జిల్లా :
అంగన్వాడీ కేంద్రాల మా ఇళ్లు లాంటివని, ఇంటి తాళాన్ని ఇతరులు పగలగొటితే ఎలా కేసు పెడతామో అంగన్వాడీ కేంద్రాల తాళలు పగలుగొట్టిన ఘటనపైనా అంతే కేసు పెడతామని అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సిఐటియు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సుబ్బరామ్మ అన్నారు. సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీలు నాలుగు రోజులుగా సమ్మె చేస్తున్న నేపథ్యంలో పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోని ధర్నా చౌక్‌ వద్ద సమ్మె శిబిరాన్ని, చిలకలూరిపేట ఎన్‌ఆర్‌టి సెంటర్‌ వద్ద సమ్మె శిబిరాన్ని ఆమె ఆమె శుక్రవారం సందర్శించి మాట్లాడారు. ఎన్నో దశాబ్ధాలుగా చాలీచాలని వేతనాలతో పని చేస్తున్న అంగన్వాడీలకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని అప్పటి వరకు జగన్మోహన్‌ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ కంటే అదనంగా ఇస్తానన్న రూ రూ. వెయ్యి తక్షణమే అమలు చేయాలని కోరారు. గర్భిణులు, బాలింతలను కంటికి రెప్పలా కాపాడుతూ పోషకాహారం అందించడంతోపాటు ఆరోగ్య అవగాహన కల్పిస్తున్న నేపథ్యంలోనే మాత శిశువు ఆరోగ్యకరంగా ఉన్నారనే విషయాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాలన్నారు. ప్రస్తుతం ఇస్తున్న పోషకాహారం కంటే మెరుగైన పోషకాహారం ఇవ్వాల్సి ఉన్నా ఐసిడిఎస్‌కు నిధులు కుదించి పథకాన్ని నీరుగార్చాలని చూస్తున్నారని మండిపడ్డారు. 50 మంది ఉన్న సెంటర్లను కూడా మినీ సెంటర్లు గానే కొనసాగిస్తున్నారని, చిన్నారులకు ఆహారం పెట్టడం, వారి మలమూత్రాలు శుభ్రం చేయడం, యాప్‌, రికార్డు వర్క్‌ వీటన్నింటితో అంగన్వాడీలు పని భారంతో కంగిపోతున్నా రన్నారు. ఇటీవల నాలుగుసార్లు ప్రభుత్వ పెద్దలతో చర్చించగా ప్రధాన సమస్యలైన వేతనాల పెంపు, గ్రాట్యుటీపై హామీ ఇవ్వడం లేదని చెప్పారు. వేతనాలు పెంచకుండా, గ్రాట్యుటీ ఇవ్వకుండా సమ్మె విరమించేది లేదని స్పష్టం చేశారు. అధికారం పదవులను అనుభవిస్తూ రూ.2 లక్షల వేతనం, పదవి అనంతరం పెన్షన్‌ పొందే బొబ్బిలి ఎమ్మెల్యే అంగన్వాడీల పట్ల అధికారం మదంతో చేసిన అనుచిత వ్యాఖ్యలను తక్షణమే ఉససంహరి ంచుకుని బహిరంగ క్షమాపణలు చెప్పాలని, లేకుంటే బుద్ధి చెబుతామని హెచ్చరించారు. యుటిఎఫ్‌ పల్నాడు జిల్లా అధ్యక్షులు పి.ప్రేమ్‌కుమార్‌ మాట్లాడుతూ ఉద్యోగులు, ఉపాధ్యాయులతోపాటు స్కీమ్‌ వర్కర్లనూ సిఎం జగన్‌ మోసం చేశారని, వచ్చే ఎన్నికల్లో వైసిపికి బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. కార్పొరేట్ల సేవలతో తరిస్తున్న కేంద్ర ప్రభుత్వం ప్రజలకు విశేష సేవలు చేస్తున్న స్కీం వర్కర్ల పట్ల మాత్రం వివక్ష చూపుతోందన్నారు. ఈ విధానాలపై ప్రజలు చైతన్యవంతం కాకుండా ఉండేందుకు విద్యా వ్యవస్థనూ నాశనం చేస్తున్నారని, అంగన్వాడీ వ్యవస్థ నిర్వీర్యమూ ఇందులో భాగమని చెప్పారు. 3, 4, 5 తరగతులను హైస్కూల్లో కలపటం వల్ల రాష్ట్రవ్యాప్తంగా 9 లక్షల మంది పిల్లలు చదువుకు దూరమయ్యారని తెలిపారు. ఈ విధానాలపై అన్ని రంగాల వారు ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. యూనియన్‌ జిల్లా అధ్యక్షురాలు కెపి.మెటిల్డా దేవి మాట్లాడుతూ గ్రామ వాలంటీర్లు, రెవెన్యూ అధికారులు, పోలీసులు అంగన్వాడీ సెంటర్‌ తాళాలు బలవంతంగా లాక్కునే ప్రయత్నం విరమించుకోవాలన్నారు. ప్రభుత్వం దిగొచ్చి సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగుతుందన్నారు. రైతు సంఘం పల్నాడు జిల్లా కార్యదర్శి ఏపూరి గోపాలరావు, కౌలురైతు సంఘం జిల్లా అధ్యక్షులు కె.రామారావు ఎఐటియుసి జిల్లా నాయకులు కె.రాంబాబు, డి.వరహాలు, జనసేన నాయకులు సయ్యద్‌ జిలాని తదితరులు మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీలు చేస్తున్న సమ్మె స్కీమ్‌ వర్కర్లందరికీ ఆదర్శనీయమన్నారు. ఒక్క ఛాన్స్‌ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్‌మోహన్‌రెడ్డి అందరి జీవితాలతో ఆడుకుంటున్నారని మండిపడ్డారు. కార్యక్ర మంలో యూనియన్‌ పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి జి.మల్లీశ్వరి, సిఐటియు నాయకులు ఎం.కవిత, ఇంద్ర, నిర్మల, మాధవి, ఎఐటియుసి నాయకురాలు శోభారాణి ఫ్లోరిస్‌, నిర్మల, రాజకుమారి, నాజర్‌ బి, భారీగా అంగన్వాడీలు పాల్గొన్నారు.

ప్రజాశక్తి-చిలకలూరిపేట : స్థానిక ఎన్‌ఆర్‌టి సెంటర్‌లో సమ్మె శిబిరాన్ని యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సుబ్బరావమ్మ సందర్శించారు. యూనియన్‌ జిల్లా కార్యదర్శి జి.మల్లీశ్వరి మాట్లాడుతూ ఇప్పుడు వచ్చే జీతంతో కుటుంబాలు గడవక అప్పులు చేయాల్సి వస్తోందన్నారు. కేంద్రాల తాళాలు పగలగొట్టి ఇతరులతో నడిపించాలని చూస్తుండగా వారు రోజుకు రూ.500 కూలి అడుగుతున్నట్లు తెలిసిందని, అదే డబ్బులు తమకివ్వాలని అంగన్వాడీలు కోరుతున్నారని చెప్పారు. కౌలురైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వై.రాధాకృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వ, అంగన్వాడీ బెదిరింపులకు భయపడాల్సిన పనిలేదని, ఐక్యంగా ఉద్యమిస్తే విజయం సాధిస్తామని చెప్పారు. పోరాటాని తమ అండ ఉంటుందన్నారు. యూనియన్‌ సెక్టార్‌ అధ్యక్షులు జి.సావిత్రి మాట్లాడుతూ పట్టణంలోని పలు ప్రాంతాల్లో కేంద్రాల తాళాలు పగలగొట్టేందుకు సచివాలయ సిబ్బంది సిద్ధమవగా స్థానికులు అడ్డుకున్నారని చెప్పారు. అయితే ఆదిఆంధ్ర కాలనీలో వార్డు సచివాలయల ఉద్యోగులు తాళాలు పగలగొట్టి లోపకలికెళ్లారని, పోతావరం గ్రామంలో సిడిపిఒ శాంతకుమారి ఆధ్వర్యంలో ఇదే పని చేశారని విమర్శించారు. వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఎన్‌ఆర్‌టి సెంటర్‌లోని సమ్మె శిబిరం నుండి కళామందిర్‌ సెంటర్‌ మీదుగా ఎంపిడిఒ కార్యాలయం వరకు నిరసన ప్రదర్శన చేసి ఎంపిడిఒకు శ్రీనివాసరావుకు వినతిపత్రం ఇచ్చారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జికి ఈ సందర్భంగా సంతాపం తెలిపారు. సమ్మెకు యుటిఎఫ్‌ జిల్లా గౌరవాధ్యక్షులు కె.శ్రీనివాసులురెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శి ఎ.చెన్నకేశ, నాయకులు తిరుపతిస్వామి, పార్థసారధి, ఎస్‌టియు నాదెండ్ల మండల కార్యదర్శి డి.దుర్గాప్రసాద్‌, ప్రజానాట్య మండలి జిల్లా కార్యదర్శి టి.పెద్దిరాజు, సిఐటియు నాయకులు ఎం.విల్సన్‌, పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు ఎస్‌.బాబు మద్దతు తెలిపి మాట్లాడారు. యూనియన్‌ సెక్టార్‌ అధ్యక్ష కార్యదర్శులు జి.సావిత్రి, కె.రమాదేవి, గౌరవాధ్యక్షులు పి.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

ప్రజాశక్తి – మాచర్ల : స్థానిక పార్క్‌ సెంటర్‌లో ఏర్పాటు చేసిన సమ్మె శిబిరాన్ని నాలుగోరోజైన శుక్రవారం సిఐటియు పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌.ఆంజనేయ నాయక్‌ ప్రారంభించి మాట్లా డారు. అతి తక్కువ వేతనాలతో దశాబ్ధాల తరబడి మాతా, శిశు సంక్షేమం కోసం పాటుప డుతున్న అంగన్వాడీల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య ంగా ఉండడం న్యాయం కాదన్నారు. అంగన్వా డీలకు పోరాటాలు కొత్తకాదని, గతంలో అనేక సమస్యలను పోరాటాల ద్వారానే పరిష్కరించు కున్నారని, ఈ విషయాన్ని ప్రభు త్వం గుర్తించా లని కోరారు. అనంతరం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జికి నివాళులర్పించారు. ఇదిలా ఉండగా సెంటర్‌లో స్థలం కొద్దిగా ఉండటం, అంగన్‌ వాడీలు ఎక్కువ మంది హజరు కావటంతో చాల మంది ఎండలో కూర్చోని నిరసనలో పాలుపంచు కున్నారు. నాయకులు ఉషారాణి, ఇందిరా, కె.పద్మావతి, కోటేశ్వరి, సుందరలీల, రుక్మిణి, మహలక్ష్మీ, శివపార్వతీ, జిజి భారు, సిఐటియు నాయకులు బి.మహేష్‌, వెంకటరత్నం, ఎస్‌ ఎఫ్‌ఐ నాయకులు రాజు, సాయి పాల్గొన్నారు.

ప్రజాశక్తి – సత్తెనపల్లి రూరల్‌ : అంగన్వాడీ కార్యకర్తల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్‌ చేశారు. స్థానిక తాలూకా సెంటర్లో సమ్మె శిబిరాన్ని ఆయన సందర్శించి సంఘీభావం తెలిపారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అడుగుతున్న అంగన్వాడీలను వేధింపులకు గురి చేయడం తగదన్నారు. అంగన్వాడి కేంద్రాల తాళాలు పగలగొట్టడం దుర్మార్గమని, అంగన్వాడీల పోరాటానికి టిడిపి అండగా ఉంటుందని చెప్పారు. రాష్ట్రంలో అందర్నీ మోసం చేసినట్లే అంగన్వాడీలనూ జగన్‌ మోసం చేశారని, టిడిపి అధికారంలోకి వస్తే అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించేందుకు ప్రయత్ని స్తామని చెప్పారు. ఆయనతోపాటు పలువురు టిడిపి నాయకులు సమ్మెకు మద్దతు తెలిపారు. ఇదిలా ఉండగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జి చిత్రపటానికి అంగన్వాడీలు పూలమాలలేసి నివాళులర్పించారు. సిఐటియు మండల కార్యదర్శి పి.మహేష్‌, ఐద్వా పల్నాడు జిల్లా కార్యదర్శి జి.రజిని, పట్టణ అధ్యక్ష కార్యదర్శులు ఎం.జ్యోతి, జి.ఉమశ్రీ, డి.విమల, డివైఎఫ్‌ఐ నాయకులు జె.రాజకుమార్‌, ఎస్‌ఎఫ్‌ఐ మండల కార్యదర్శి అమూల్య సమ్మె శిబిరాన్ని సందర్శించి మద్దతు తెలిపారు.

ప్రజాశక్తి – వినుకొండ : నాలుగు రోజులుగా కొనసాగుతున్న సమ్మె శిబిరాన్ని సిఐటియు పట్టణ కార్యదర్శి ఎ.ఆంజనే యులు, నాయకులు శివరామకృష్ణ, బి.కోటయ్య, నాసర్‌బి సందర్శించి మద్దతుగా మాట్లాడారు. సమ్మెకు యుటిఎఫ్‌ పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రేమ్‌కుమార్‌, విశ్రాంత ఉపాధ్యాయ సంఘం నాయకులు అప్పరాజు నాగేశ్వరరావు, పోలయ్య, టిడిపి నాయకులు షమీంఖాన్‌, టీవీ సురేష్‌ బాబు సంఘీభావం తెలిపారు.

ప్రజాశక్తి-పిడుగురాళ్ల : స్థానిక బంగ్లా సెంటర్‌లో నిర్వహిస్తున్న సమ్మె శిబిరం కొనసాగింది. సిఐటియు మండల కార్యదర్శి టి.శ్రీనివాసరావు మాట్లాడారు. కేంద్రాల తాళాలు పగలగొట్టడాన్ని నిరసిస్తూ శిబిరం నుండి తహశీల్దార్‌ కార్యాలయం వరకు ప్రదర్శన చేసి తహశీల్దార్‌ కార్యాలయంతోపాటు ఎంపిడిఒకు వినతిపత్రం ఇచ్చారు. సమ్మె శిబిరాన్ని మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు మార్తమ్మ, పరమేశ్వరరావు, గోవిం దమ్మ, హద్దులు, అరుణకుమారి సందర్శించి సంఘీభావం తెలిపారు. పోరాటానికి తమ పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించారు. మద్దతు తెలిపిన వారిలో ఎంఆర్‌పిఎస్‌ నాయ కులు ఎం.బాబు, ఇస్రాయిల్‌, ఎం.నాగేశ్వరరావు, సుశీల, పిడిఎం రాష్ట్ర అధ్యక్షులు కె.శ్రీనివాసరావు ఉన్నారు. సమ్మె శిబిరంలో అంగన్వాడి ప్రాజెక్టు అధ్యక్ష కార్యదర్శులు షేక్‌ హజ్ర, శాంతమణి, శివరంజిని, ఆనందకుమారి, గంగాభవాని, కవిత, వెంకటరమణ, బుజ్జి, జయశ్రీ, మాధవి, పద్మ పాల్గొన్నారు.

ప్రజాశక్తి – అమరావతి : తహశీల్దార్‌ కార్యాలయం వద్ద ధర్నా అనంతరం గాంధీబొమ్మ సెంటర్‌ వరకు ప్రదర్శన చేసి మానవహారంగా ఏర్పడ్డారు. యూనియన్‌ జిల్లా కార్యదర్శి జి.మల్లేశ్వరి మాట్లాడుతూ తెలంగాణలో కంటే అదనంగా జీతం ఇస్తామనే హామీని సిఎం జగన్‌మోహన్‌రెడ్డి నిలబెట్టుకోవాలని కోరారు. ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. సిఐటియు మండల కార్యదర్శి బి.సూరిబాబు మాట్లాడుతూ అక్క, చెల్లెమ్మలకు నేనున్నాను అంటున్న సిఎంకు అంగన్వాడి చెల్లెమ్మలు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. సమస్యలపై పోరాడుతుంటే బెదిరింపులకు పూనుకోవడం దారుణమన్నారు.

➡️