కదం తొక్కిన అంగన్వాడీలు

గుంటూరు కలెక్టరేట్‌ ఎదుట పడుకుని నిరసన తెలుపుతున్న అంగన్వాడీలు
ప్రజాశక్తి-గుంటూరు : అంగన్‌వాడీల నిరవధిక సమ్మెలో భాగంగా బుధవారం కలెక్టరేట్ల వద్ద బైటాయింపు గుంటూరులో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు అడుగడుగునా అంగన్‌వాడీలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కలెక్టరేట్‌ గేటు వద్ద పెద్ద ఎత్తున బారీకేడ్లు ఏర్పాట్లు చేసి, వందల మంది పోలీసులు మోహరించారు. కలెక్టరేట్‌లో పనిచేసే ఉద్యోగుల గుర్తింపు కార్డులు తనిఖీలు చేసి లోపలికి పింపించారు. అయితే అంగన్‌వాడీలు వ్యూహాత్మకంగా వ్యవహరించి వేలాది మంది కలెక్టరేట్‌కు చేరుకొని రోడ్డుపై భైటాయించి రోజంతా నిరసన తెలిపారు. కాగా మంగళవారం రాత్రి నుండే సిఐటియు, అంగన్‌వాడీ నాయకులకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఉదయం యూనియన్‌ జిల్లా, నగర కార్యదర్శులు దీప్తి మనోజ, టి.రాధను ఇంటి వద్దే అదుపులోకి తీసుకొని పోలీసు స్టేషన్లకు తరలించారు. కలెక్టరేట్‌కు వెళ్లే దారుల్లో మెడికల్‌ క్లబ్‌, పట్టాభిపురం, మూడు బొమ్మల సెంటర్‌, నగరంపాలెం పలు చోట్ల బారీకేడ్లు ఏర్పాటు చేసి, అటుగా వెళ్లే మహిళలను విచారించారు. రైల్వే స్టేషన్‌, బస్టాండ్‌లలోనూ తనిఖీలు చేశారు. అనుమానం వచ్చిన వారిని వాహనాల్లో నుండి బయటకు దించి అక్కడే నిలిపివేశారు. ఎక్కడికక్కడ పోలీసులు అంగన్‌వాడీలను అడ్డుకున్నారు. పోలీసుల హడావుడితో కలెక్టరేట్‌ పరిసర ప్రాంతాలు ఉద్రిక్తంగా మారాయి. కాగా అంగన్‌వాడీలు తొలుత జిల్లా కోర్టు వద్ద నుండి కలెక్టరేట్‌ వరకూ ర్యాలీ చేపట్టారు. ర్యాలీని అడ్డుకొని, నాయకుల్ని అరెస్ట్‌ చేయాలని పోలీసులు ప్రయత్నం చేయగా, అంగన్‌వాడీలు అడ్డుకున్నారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వై.నేతాజిని అదుపులోకి తీసుకోవాలని ప్రయత్నించగా అంగన్‌వాడీలు, సిఐటియు నాయకులు అడ్డుకుని వేగంగా కలెక్టరేట్‌కు చేరుకున్నారు.వందల మందితో ప్రారంభమైన ఆందోళన ఒక్కొక్కరుగా చేరుకోవటంతో వేలాది మందితో జరిగింది. కలెక్టరేట్‌ వద్ద ఆందోళన ప్రారంభైన తర్వాత అక్కడికి వస్తున్న అంగన్‌వాడీలను నగరంపాలెం ఎస్‌బిఐ వద్ద అడ్డుకోవటంతో వందల మంది అక్కడే బైటాయించి నిరసన తెలిపారు. అనంతరం వారిని కూడా కలెక్టరేట్‌ వద్దకు వెళ్లటానికి పోలీసులు అనుమతించారు. ఆందోళనలో ఉద్యమ గీతాలకు ఆట, పాటలు పాడారు. కొద్దిసేపు నేలపై పడుకొని నిరసన తెలిపారు. జాయింట్‌ కలెక్టర్‌ జి.రాజకుమారి ఆందోళన వద్దకు సమస్యలు తెలుసుకున్నారు. తర్వాత ఆమె మీడియాతో మాట్లాడారు. అంగన్‌వాడీల ప్రధాన డిమాండ్లన్నీ దాదాపుగా నెరవేర్చిందని, కావున 5వ తేదీలోగా సమ్మె విరమించాలని, లేదంటే చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆందోళనలో గుంటూరు నగరానికి చెందిన అంగన్‌వాడీ బాజీబి స్పృహ తప్పి పడిపోవటంతో జిజిహెచ్‌కు తరలించారు. తర్వాత హాస్పిటల్‌లో మరో అంగన్‌వాడీ మొబీనా స్పృహ తప్పి పడిపోవటంతో ఇద్దరికీ వైద్యం అందిస్తున్నారు. బైటాయింపులో సిఐటియు రాష్ట్ర కార్యదర్శి దయా రమాదేవి మాట్లాడుతూ సమస్యలు పరిష్కరించలేని ప్రభుత్వం పెద్ద ఎత్తున నిర్భంధం ప్రయోగిస్తుందన్నారు. తాము గొంతెమ్మ కోర్కులు కోరట్లేదని, ఇచ్చిన హామీలు అమలు చేయమంటున్నామని చెప్పారు. 23 రోజులుగా సమ్మె చేస్తుంటే సమస్యలు ఎట్టా పరిష్కరించాలో ఆలోచించకుండా, సమ్మెను విచ్ఛినం చేయాలని ప్రభుత్వం చూస్తుందన్నారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వై.నేతాజి మాట్లాడుతూ ప్రభుత్వం సమ్మె పట్ల మొదటి నుండి కక్షపూరితంగా వ్యవహరిస్తూ, అడ్డుకునే ప్రయత్నం చేస్తుందన్నారు. సమ్మెలోకి వెళ్లొదని, బెదిరించటం, సెంటర్ల తాళాలు పగలగొట్టించటం, సచివాలయ ఇతర శాఖల ఉద్యోగులతో సెంటర్లు నడిపించాలని, అధికార పార్టీ నాయకులతో దుష్ప్రచారం వంటి అన్ని ప్రయత్నాలు విఫలం అయ్యాయయన్నారు. ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సిఐటియు) జిల్లా ప్రధాన కార్యదర్శి దీప్తి మనోజ మాట్లాడుతూ ప్రభుత్వం బెదిరింపులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. తాటాకు చప్పులకు భయపడే ఉద్యమ చరిత్ర తమది కాదన్నారు. గతంలో ప్రభుత్వాలను మార్చిన ఉద్యమ చరిత్ర ఉందన్నారు. ప్రధాన డిమాండ్లు అయిన వేతనాల పెంపు, గ్రాట్యుటీ అమలు నెరవేర్చే వరకూ సమ్మె ఆగదని స్పష్టం చేశారు. ఎఐటియుసి రాష్ట్ర గౌరవాధ్యక్షులు వి.రాధాకృష్ణమూర్తి మద్దతుగా ప్రసంగించారు. సిపిఎం గుంటూరు నగర కార్యదర్శి కె.నళినీకాంత్‌ ఆందోళనలో పాల్గొని మద్దతు తెలిపారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు డి.లక్ష్మీనారాయణ, నాయకులు ఎన్‌.శివాజీ, కె.శ్రీనివాస్‌, బి.లక్ష్మణరావు, ఎం.భాగ్యరాజు, వి.దుర్గారావు, ఎన్‌.రమేష్‌ పాల్గొన్నారు.

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : నరసరావుపేటలోని పల్నాడు జిల్లా కలెక్టరేట్‌కు అంగన్వాడీలు వేలాదిగా తరలిరావడంతో ఆ ప్రాంతమంతి కిక్కిరిసింది. ఎండను సైతం లెక్కచేయకుండా అంగన్వాడీలు రహదారిపైనే బైటాయించి అక్కడే భోజనాలు చేశారు. కోలాటం ఆడి నిరసన తెలిపారు. అయితే కలెక్టరేట్‌లోకి వెళ్లకుండా పోలీసులు భారీగా మొహరించి కార్యాలయం గేట్లు మూసివేయడంతో అంగన్వాడీలు 4 గంటల పాటు రోడ్డుపై కూర్చోవాల్సి వచ్చింది. అనంతరం జిల్లా రెవెన్యూ అధికారి కె. వినాయకం అంగన్వాడీల వద్దకు వచ్చి వినతిపత్రం తీసుకున్నారు. బైటాయింపులో సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ముజఫర్‌ అహ్మద్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌ ఆంజనేయ నాయక్‌, ఉపాధ్యక్షులు గుంటూరు విజరు కుమార్‌ మాట్లాడుతూ మహిళా మంత్రుల సైతం అంగన్వాడీల సమస్యల గురించి పట్టించుకోకపోవడం సిగ్గుచేటన్నారు. రైతు, కౌలురైతు, వ్యవసాయ కార్మిక సంఘాల జిల్లా కార్యదర్శులు ఎ.గోపాలరావు, వై.రాధాకృష్ణ, ఎ.లకీëశ్వరరెడ్డి మద్దతుగా మాట్లాడారు. ప్రభుత్వ కుట్రలు, నిర్బంధాలను తిప్పికొడుతూ సాగుతున్న అంగన్వాడీల సమ్మెకు తమ పూర్తి సంఘీభావం, మద్దతు ఉంటాయని ప్రకటించారు. కార్యక్రమంలో యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి జి.మల్లీశ్వరి, శ్రామిక మహిళా సమన్వయ కమిటీ జిల్లా కన్వీనర్‌ డి.శివకుమారి, సిఐటియు, అంగన్వాడీ నాయకులు సిలార్‌ మసూద్‌, ఎస్‌.వెంకటేశ్వరరాజు, ప్రసన్న, అహల్య, కవిత, జయలక్ష్మి, నిర్మల, శాంతమణి, రమణ, ఉష, ఎఐటియుసి నాయకులు హెల్డాఫ్లారిన్స్‌, శోభరాణి, విజయలక్ష్మి హసీనా పాల్గొన్నారు.

➡️