కబ్జాకు కావేవీ అనర్హం

ప్రజాశక్తి – కొండాపురం కావేవీ కబ్జాకు అనర్హం అన్నట్లుంది ఆక్రమణదారుల నిర్వాహం. కబ్జాదారులు రోజురోజుకూ రెచ్చిపోతున్నారు. ఇప్పటికే వాగులు, వంకలు, కొండలు కబ్జాకు గురై పునరావాస కాలనీలకు స్థలం కేటాయింపులకే కరువైపోయింది. పునరావాస స్థలాలు ఎక్కడాలేవంటూ అధికారులు అంటుండగా కబ్జాదారులు మాత్రం ఇప్పటికీ ఆక్రమిస్తూనే ఉన్నారు. కొండల నుంచి వచ్చే నీటి ప్రవాహానికి ఉన్న పెద్దపెద్ద వంకలు సైతం ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారు. వీటిపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదనే విమర్శలున్నాయి. ప్రస్తుతం ఇవేవీ చాలవన్నట్లు పాఠశాల ప్రాంగణాన్ని కూడా కబ్జాదారులు వదలడంలేదు. పాఠశాల ప్రాంగణాన్ని ఆక్రమించేందుకు కొందరు ప్రయత్నిస్తుండడంతో విద్యాశాఖాధికారులు తలలు పట్టుకుంటుఆన్నరు. రామచంద్ర నగర్‌ కాలనీలోని ప్రాథమిక పాఠ శాల భవనం ఎదురుగా ఉన్న కొంత ఖాళీ స్థలాన్ని పిల్లలకు ఆటస్థలం, ప్రార్థనా స్థలంగా ఉపయోగించుకుంటున్నారు. ఈ స్థలాన్ని కూడా కబ్జా చేయాలని ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. రోడ్లు కావాలని కొందరు, వ్యాపారాలకు కావాలని మరికొందరు ముమ్మర ప్రయ త్నాలు చేస్తున్నట్లు సమాచారం. పాఠశాలలో స్థలం కబ్జా కాకుండా విద్యా ర్థులకే ఉపయోగపడేలా చూడాలని, పరిష్కారం చూపాలని ఇప్పటికే విద్యా ర్థులు, వారి తల్లిదండ్రులు అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఉన్నారు. అధికారులు పాఠశాల ప్రాంగణానికి స్థలాన్ని అధికార పూర్వకంగా కేటాయిం చకపోవడంతో.. ఇదే అదనుగా భావించిన కబ్జాదారులు రెచ్చిపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ స్థలాలు, వాగులు, వంకలు కబ్జాకు గురికాకుండా అధికారులు కాపాడాలని ప్రజలు, విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

➡️