కమిటీపై మాట తప్పిన అధికారులు

Jan 29,2024 00:10

సమావేశంలో మాట్లాడుతున్న రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు వి.కృష్ణయ్య, కె.ప్రభాకర్‌రెడ్డి
ప్రజాశక్తి – దుగ్గిరాల :
కోల్డ్‌ స్టోరేజీ దగ్ధమైన ఘటనలో పంటను కోల్పోయిన రైతులకు పరిహారం విషయమై జెసి ఆధ్వర్యంలో కమిటీ వేస్తామనే కలెక్టర్‌ హామీ నెరవేరలేదని రైతు సంఘం నాయకులు, బాధిత రైతులు ఆవేదన వెలిబుచ్చారు. స్థానిక శుభం మహేశ్వరి కోల్డ్‌ స్టోరేజ్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో నష్టపోయిన రైతుల సమావేశం టర్మరిక్‌ అసోసియేషన్‌ హాలులో రైతు సంఘం ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించారు. తొలుత రైతులు ప్రదర్శనగా సమావేశానికి వచ్చారు. సమావేవంలో రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు వి.కృష్ణయ్య, కె.ప్రభాకర్‌రెడ్డి, జిల్లా అధ్యక్షులు జె.శివశంకరరావు మాట్లాడారు. ప్రతి సంవత్సరం ప్రభుత్వం బడ్జెట్లో ప్రకృతి విపత్తుల నిధి కింద ప్రకృతి వైపరీత్యాలు, వివిధ రకాల కారణాల వల్ల పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు రూ.3500 కోట్లు కేటాయిస్తుందని హామీనిచ్చినా ఎక్కడా ఒక్క రూపాయి కూడా చెల్లించలేదన్నారు. ఎంతో కష్టపడి పసుపును పండించిన రైతులు పంటకు మంచి ధర వస్తుందని నిల్వ చేసుకున్నారని, అయితే అదికాస్త బూడిదైందని ఆవేదన వెలిబుచ్చారు. బాధిత రైతులకు పరిహారం కోసం రైతు సంఘం పోరాడుతుందన్నారు. బాధిత రైతులకు ప్రస్తుత మార్కెట్‌ ధరల ప్రకారం నష్టపరిహారంతోపాటు వారి రుణాలపై వడ్డీ కూడా రద్దు చేయాలని కోరారు. బాధితులకు పరిహారం విషయమై జిల్లా కలెక్టర్‌ను ఇటీవల రైతులతో వెళ్లి కలిశామని, జాయింట్‌ కలెక్టర్‌ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేస్తామని వారు చెప్పినా ఇంతవరకు ఏ కమిటీనీ ఏర్పాటు చేయలేదుని అన్నారు. వివరాలు బయట పెట్టాలని అడిగినా అంగీకరించలేదన్నారు. బీమా ప్రీమియం చెల్లించిందీ లేనిదీ తెలియటం లేదని, ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు ఆదుకోవాలని కోరారు. సమావేశంలో కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి బి.శ్రీనివాసరావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు జె.బాలరాజు, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఎం.శివసాంబిరెడ్డి, మండల అధ్యక్షులు ఎన్‌.యోగేశ్వరరావు, నాయకులు కె.వెంకటేశ్వరరావు, వై.బ్రహ్మేశ్వరరావు, బి.మ్మిరెడ్డి, న్యాయవాది వై.స్టాలిన్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేములపల్లి వెంకటరామయ్య కన్వీనర్‌గా, కాజా వెంకటేశ్వరరావు కో-కన్వీనర్‌ గా 25 మంది రైతులతో కమిటీ ఏర్పాటైంది. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించే గ్రీవెన్స్‌లో నష్టపరిహారం కోసం అర్జీలు ఇవ్వాలని నిర్ణయించారు.ఈ సందర్భంగా పలువురు బాధిత రైతులు మాట్లాడుతూ తమ ఆవేదనను వ్యక్తం చేశారు. తాడేపల్లికి చెందిన రైతు ఆళ్ల వెంకటప్పరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ చర్యలపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. జిల్లాలో ఇంత పెద్ద విపత్తు సంభవించినా సిఎం స్పందించలేదని, కనీసం మంత్రిని కూడా పంపలేదని అన్నారు. కొల్లూరు మండలం కిష్కిందపాలేనికి చెందిన కొల్లి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కోల్డ్‌ స్టోరేజీ తగులబడినప్పటి నుండి బాండు తీసుకుని తిరుగుతున్నామని, ఇంతవరకు బీమా చేసినది లేనిది తెలియలేదని అన్నారు. 200 బస్తాలు నిల్వ చేశామని, ప్రస్తుత ధరల ప్రకారం రూ.20 లక్షలు నష్టమని చెప్పారు. కొల్లిపర మండలం వల్లభాపురానికి చెందిన మహిళా రైతు లంకిరెడ్డి సీతామహాలక్ష్మి మాట్లాడుతూ ప్రతిఏటా పంటను కోల్డ్‌ స్టోరేజ్‌లో నిల్వ చేస్తామని, ధర వచ్చిన తర్వాత అమ్ముకుంటామని చెప్పారు. ఈసారి 10 బస్తాలు నిల్వ చేయగా మొత్తం కాలిపోయిందని, దాదాపు రూ.లక్ష నష్టమని వాపోయారు. సత్తెనపల్లి మండలం కొమెరపూడికి చెందిన రైతు లక్కిరెడ్డి భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రమాదం సంభవించిన తర్వాత రాజ్యసభ సభ్యులు అయోధ్య రామిరెడ్డిని కలిశామని, సమస్య పరిష్కారం కాకపోతే పదిమంది రైతులతో కలిసి రండి కేంద్రమంత్రి బీమా మొత్తం త్వరగా అందచేట్లు చూస్తామని చెప్పారని అన్నారు. పెదకాకాని మండలం నంబూరుకు చెందిన రైతు మందాల ప్రదీప్‌ రెడ్డి మాట్లాడుతూ 2020లో 750 బస్తాలు నిల్వ ఉంచామని, ప్రతి నాలుగేళ్లకోసారి ధర పెరుగుతుందని, అందుకే ఈ ఏడాదీ భావించి నిల్వ చేయగా ప్రమాదం జరిగిందని, రూ.65 లక్షల వరకూ నష్టం వచ్చిందని తీవ్ర ఆవేదనకు గురవుయ్యారు.

➡️