కలుషిత నీటి నివారణకు శాశ్వత చర్యలు చేపట్టాలి

Feb 24,2024 00:18

కార్పొరేషన్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న సిపిఎం నాయకులు, కార్యకర్తలు
ప్రజాశక్తి-గుంటూరు :
కలుషిత తాగునీటి సరఫరా పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో శుక్రవారం గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. సిపిఎం నగర కార్యదర్శి కె.నళినీకాంత్‌ మాట్లాడుతూ మూడు వారాలుగా జిఎంసి ద్వారా సరఫరా అవుతున్న కలుషిత నీరు తాగి వందల మంది వాంతులు, విరోచనాలు, డయేరియాతో ఆసుపత్రుల పాలయ్యారని, ముగ్గురు చనిపోయారని అన్నారు. 2018లో కూడా ఇంతకంటే పెద్ద స్థాయిలో కలుషిత నీటి సరఫరా కారణంగా వేల మంది డయేరియా బారిన పడ్డారని, 24 మంది చనిపోయారన్నారు. ఇవే కాకుండా అడపా దడపా అక్కడక్కడా డయేరియా సమస్య వస్తూనే ఉందన్నారు. పాతకాలం నాటి పైపు లైన్ల వల్ల, మురుగు కాల్వల్లో తాగునీటి పైపులైను ఉండటం వల్ల లీకులు ఏర్పడినప్పుడు త్రాగునీరు కలుషితం అవుతుందన్నారు. సమస్య వచ్చిన ప్రాంతాల్లో తాత్కాలికంగా నివారణ చర్యలు చేపట్టటంతో నగరంలో అన్ని ప్రాంతాల్లో శాశ్వతమైన నివారణ చర్యలు తీసుకోవాలని కోరారు. గుంటూరు నగరంలో పెరిగిపోతున్న స్ట్రీట్‌ఫుడ్‌ నాణ్యతా ప్రమాణాలను పర్యవేక్షించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు స్పందించి నగర ప్రజలకు శాశ్వత ప్రాతిపదికన సురక్షితమైన తాగునీరు అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం జిఎంసి ఎస్‌ఇ సుందరరామిరెడ్డికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎంఎ చిష్టీ, నగర కార్యదర్శివర్గ సభ్యులు బి.ముత్యాలరావు, నాయకులు ఎల్‌.అరుణ, కార్తీక్‌, ఖాసింవలి, ఆది నికల్సన్‌, ఖాసిం షహీద్‌, జి.వెంకట్రావు, సాంబశివరావు, టి.రాధ పాల్గొన్నారు.

➡️