కలెక్టరేట్‌ వద్ద ఉద్యోగ, ఉపాధ్యాయుల ధర్నా

Feb 20,2024 21:13

ప్రజాశక్తి – పార్వతీపురంరూరల్‌: ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలకు బకాయి పడ్డ కోట్లాది రూపాయలు చెల్లించ లేక, ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేక, సమస్యలు పరిష్కరించడం చేతకాక ప్రభుత్వమే వారిని సమ్మె వైపు నడిపిస్తుందని జెఎసి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పింఛనుదారుల సంఘాల జెఎసి ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక ఆర్టీసీ కూడలి నుంచి కలెక్టరేట్‌ వరకు భారీ ర్యాలీ చేసి, అనంతరం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం సిపిఎస్‌ రద్దు చేసి ఒపిఎస్‌ను పునరుద్ధరించాలని, ఇతర డిమాండ్లను పరిష్కరించాలని నినాదాలు చేశారు. అనంతరం జెఎసి నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగికి ఆర్థిక, ఆర్థికేతర సమస్యలున్నాయన్నారు. 12వ పిఆర్‌సి కమిషన్‌ వేసినప్పటికీ నేటికీ ఏ మాత్రం ప్రగతి లేదన్నారు. గత జూలై నుండి 12వ పిఆర్‌సి అమలు కావాల్సి ఉందన్నారు. విపరీతంగా ధరలు పెరిగిపోయాయని, కావున తక్షణమే మధ్యంతర భృతి (ఐ.ఆర్‌) 30% ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. అలాగే ఉద్యోగులు తమ సొంత డబ్బును సబ్స్క్రిప్షన్‌గా కడుతూ పిఎఫ్‌, ఎపి జిఎల్‌ రుణాలు, పార్టీ ఫైనల్స్‌ దరఖాస్తు చేసుకున్నా నెలల తరబడి ఉద్యోగుల టిఎ, డిఎ బకాయిలతో పాటు ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్నాయని, తక్షణమే రూ.25వేల కోట్లు బకాయిలను చెల్లించాలని, కాంట్రాక్ట్‌ ఉద్యోగులను క్రమబద్ధీకరించే విషయంలో నేటికీ ఒక స్పష్టత రాలేదని అన్నారు. ఉద్యోగ నియామకాల్లో ఎన్‌ఎంఆర్‌, పార్ట్‌ టైం, ఫుల్‌ టైం ఔట్సోర్సింగ్‌, ఎంటిఎస్‌ ఉద్యోగ, ఉపాధ్యాయులుగా నియామకమైన వారందర్నీ క్రమబద్ధీకరించాలని, డిపార్ట్మెంటల్‌ వారీగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని అన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షనర్ల ఉమ్మడి సమస్యలను ఈ నెలాఖరులోగా పరిష్కరించకపోతే సమ్మె అనివార్యంగా భావించి సిద్ధమవుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో జెఎసి చైర్మన్‌ కో చైర్మన్లు జివిఆర్‌ కిషోర్‌, ఎస్‌.మురళీమోహనరావు, వివిధ శాఖలకు చెందిన ఉద్యోగ సంఘాల నాయకులు వైవి సత్యనారాయణ, టి.రమేష్‌, డి.గణపతి, జగన్నాథనాయుడు, ఎస్‌.పుష్ప, వెంకట నాయుడు, జి.పద్మావతి, కె.కిషోర్‌, సిహెచ్‌ శంకర్రావు, ఎన్‌.నారాయణరావు, సూర్యనారాయణ, సింహాచలం, కె.విజరుకుమార్‌, జయకుమార్‌, పి.నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.

➡️