కళ్లెదుటే నీటి పాలైన వరి

కళ్లెదుటే నీటి పాలైన వరి

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధికర్షకులకు నిత్యం కష్టాలు తప్పడం లేదు. ఒకపక్క ప్రభుత్వ నిర్లక్ష్యం, మరోవైపు పెరుగుతున్న పెట్టుబడులతో అన్నదాతలు నిరంతరం ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఇంకోవైపు ప్రకృతి వైపరీత్యాలతో నష్టాలకు గురవుతున్నారు. ఈ సమయంలో ఆదుకోవాల్సిన ప్రభుత్వం అలక్ష్యం ప్రదర్శిస్తోంది. దీంతో వారికి కన్నీరే మిగులుతోంది. పెట్టిన పెట్టుబడులు కోల్పోయి గగ్గోలు పెడుతున్నారు. తుపాను కారణంగా జిల్లావ్యాప్తంగా అన్ని మండలాల్లోని రైతాంగం తీవ్రస్థాయిలో నష్టపోయింది. అధికారులు పంట నష్టం అంచనాలను తయారు చేసే పనిలో ఉన్నారు. తమ కళ్లెదుటే పంట కుళ్లిపోతుండగా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో రైతాంగం కొట్టుమిట్టాడుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అనుసరిస్తున్న నిబంధనల కారణంగా పరిహారానికి నోచుకోకుండా పోయే పరిస్థితులు నెలకొన్నాయి. పంట కోయకుండా ఉండి 33 శాతానికి పైగా నష్టం జరిగితేనే పరిహారం అందించేలా నిబంధనలు ఉన్నాయి. కానీ జిల్లావ్యాప్తంగా వేలాదిమంది రైతులు యంత్రాల సాయంతో కోసి ధాన్యాన్ని కల్లాల్లో రాశులపై ఉంచారు. ఇవి పలు ప్రాంతాల్లో తడిసి ముద్దవడంతో 50 శాతానికి పైగా నష్టం వాటిల్లింది. వీటికి పరిహారం ఇచ్చే పరిస్థితి లేదు. దీంతో అన్నదాతలంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కళ్లాల్లో ఉన్న నీటిని, పొలాల్లో ఉన్న వర్షపు నీటిని బయటకు తీసేందుకు నానా తంటాలు పడుతున్నారు. మిగిలి ఉన్న పంటను దక్కించుకునేందుకు ఆపసోపాలు ఎదుర్కొంటున్నారు. రైతులకు అదనపు ఖర్చు మిగిలి ఉన్న పంటను కాపాడుకోవడానికి రైతులపై అదనపు ఖర్చు తప్పడం లేదు. పొలాల్లో నీటిని బయటకు తీసుకురావడానికి కూలీలకు ఎకరాకు రూ.2 వేల వరకూ ఖర్చు చేయాల్సి వస్తుంది. కళ్లాల్లో ధాన్యాన్ని ఆరబెట్టేందుకు సైతం అదనపు ఖర్చు ఎక్కువ అవుతోందని రైతులు వాపోతున్నారు. జిల్లాలో 2.6 లక్షల ఎకరాల్లో ఈ ఏడాది ఖరీఫ్‌లో వరిని వేయగా ఇప్పటి వరకు 1.34 లక్షల ఎకరాల్లో కోతలు పూర్తి చేసిన రైతులు పంట ఒబ్బిడి చేసుకున్నారు. జిల్లాలో దాదాపుగా అన్ని మండలాల్లో పంటకు నష్టం వాటిల్లింది. వ్యవసాయ శాఖ అధికారుల ప్రాథమిక అంచనా లెక్కల ప్రకారం కోయకుండా ఉన్న 30,287 ఎకరాల్లో పంట నెలకొరిగింది. 17 వేల ఎకరాల్లో పంట పూర్తిగా ముంపునకు గురైంది. సుమారు 2 వేల ఎకరాల్లో పంట పనలపై ఉండిపోయింది. సుమారు 50 వేల ఎకరాల్లో వరి పంట తుపాను ప్రభావానికి గురై 50 నష్టం వాటిల్లింది. ఇందులో ప్రభుత్వ నిబంధనల ప్రకారం 33 శాతానికి పైగా నష్టం ఉంటేనే పరిహారం అందుతోంది. దీనిలో భాగంగా 41,702 ఎకరాలకు పరిహారం ఇచ్చేలా వ్యవసాయ శాఖ అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. మెట్ట మండలాల్లో 450 ఎకరాల్లో అపరాలకు నష్టం జరిగింది. 1,260 ఎకరాల్లో పత్తికి, 5,157 ఎకరాల్లో శనగ పంటకు, 67 ఎకరాల్లో మొక్కజొన్న పంటకు నష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు.

➡️