కష్టపడితేనే ఉన్నత శిఖరాలకు

Feb 2,2024 23:04

ప్రజాశక్తి – వినుకొండ : కష్టపడి చదువుకొని ఇష్టంతో ఆటలాడితే ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చని జాతీయ స్థాయి హాకీ క్రీడాకారిణి రజిని అన్నారు. బొల్లాపల్లి మండలం వెల్లటూరులో ఆమెకు శుక్రవారం అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా రజిని మాట్లాడుతూ 17 ఏళ్లు కష్టపడినందువలన నేడు ఈ స్థాయికి ఎదిగానని, ఎన్నో ఆటుపోటులను ఎదుర్కొన్నానని చెప్పారు. మారుమూల ప్రాంతంలోని చిన్న గ్రామంలో పుట్టి, ఒక ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించి 2008 నుండి కష్టపడుతూ ఉపాధ్యాయులు, కోచ్‌లు చెప్పినవి పాటించడం ద్వారా దేశ హాకీ టీమ్‌కు కెప్టెన్‌గా ఉంటూ దేశం తరఫున ఇతర దేశాలతో తలపడుతున్నానని చెప్పారు. ఎన్ని సన్మానాలు, సత్కారాలు అందుకున్న అవి సంతృప్తినివ్వలేదని, సొంతూరైన వెల్లటూరులో అది దక్కిందని అన్నారు. 33 ఏళ్ల వయసులో నా చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసిన వెల్లటూరు జెడ్పీ ఉన్నత పాఠశాల, ఉపాధ్యాయులు, అప్పటి విద్యార్థులను ఎన్నటికీ మరువలేనని చెప్పారు. పాఠశాలలో పలువురు ప్రముఖులు ప్రసంగిస్తూ వెల్లటూరు గ్రామవాసిగా ఎల్లప్పుడూ తమ మనసులో నిలిచిపోతారని, చిన్నారుల్లో ఉత్తేజం వారి ఎదుగుదలకు బాటలేసేందుకు ఉపయోగకరంగా ఉంటా యని అన్నారు. ముందుగా గ్రామంలో ర్యాలీ చేశారు.

➡️