కార్మికునికి వైద్యం కోసం ధర్నా

Feb 22,2024 17:49

మున్సిపల్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న పారిశుధ్య కార్మికులు
ప్రజాశక్తి – పల్నాడు జిల్లా :
మున్సిపల్‌ కార్మికుడు డేరంగి కోటయ్య విధుల్లో ఉండగా మున్సిపల్‌ చెత్త తరలింపు ట్రాక్టర్‌ ఢకొీని తీవ్రంగా గాయపడ్డాడని, అతనికి మెరుగైన వైద్యం కోసం మున్సిపాల్టీ బాధ్యత తీసుకోవాలని కార్మికులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఏపీ మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (సిఐటియు) ఆధ్వర్యంలో మున్సిపల్‌ కార్యాలయం ఎదుట గురువారం బైటాయించారు. యూనియన్‌ జిల్లా కార్యదర్శి ఎ.సాల్మన్‌ మాట్లాడుతూ ఈ నెల 17న ప్రమాదానికి గురైన కార్మికుడు కోటయ్య పరిస్థితి విషమంగా ఉండడంతో గుంటూరుకు తరలించారని, మంగళవారం వరకూ హాస్పిటల్‌ ఖర్చులు భరించిన మున్సిపల్‌ అధికారులు చేతులెత్తయడంతో బుధవారం చికిత్స అందలేదని, మరో హాస్పిటల్‌కు తరలించారని అన్నారు. కార్మికుని వైద్యం పట్ల మున్సిపల్‌ అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. ధర్నా నేపథ్యంలో మున్సిపల్‌ కమిషనర్‌ ఆదేశాల మేరకు శానిటరీ సూపర్వైజర్‌ వెంకటేశ్వర్లు స్పందించి ఆందోళనకార్లతో మాట్లాడారు. చికిత్సకు మున్సిపల్‌ నిధుల నుండి ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పారు. క్షతగాత్రునికి భార్య, ఇద్దరు కుమారులున్నారని, కోటయ్యే ఆ కుటుంబానికి ఆధారమని, ఆయన పూర్తిగా కోలుకునే వరకూ మున్సిపాల్టీ బాధ్యత తీసుకోవాలని కార్మికులు కోరారు. కార్యక్రమంలో కార్మికులు మల్లయ్య, పి.ఏసు, ఏసురత్నం పాల్గొన్నారు.

➡️