కార్మికుల్ని మళ్లీ బానిసల్ని చేసే కుట్రలు

Feb 19,2024 00:20

సిఐటియు మంగళగిరి రూరల్‌ మండలం నూతన కమిటీతో నాయకులు
ప్రజా శక్తి-మంగళగిరి రూరల్‌ :
కార్మిక ఐక్యత ద్వారానే కార్మిక హక్కులను సాధించుకోగలం సిఐటియు మాజీ నాయకులు ఈమని అప్పారావు అన్నారు. సిఐటియు మంగళగిరి రూరల్‌ కమిటీ విస్తృత సమావేశం స్థానిక సిఐటియు కార్యాలయంలో ఆదివారం జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన అప్పారావు మాట్లాడుతూ దేశంలో ఎంతోమంది ప్రాణ త్యాగాలతో సాధించుకున్న కార్మికుల హక్కులను నేడు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కాలరాస్తోందని, కార్మికులకు రక్షణగా ఉండే అనేక చట్టాలను రద్దుచేసి పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉండే నాలుగు లేబర్‌కోడ్‌లను తెచ్చిందని చెప్పారు. వీటివల్ల కార్మికులను బానిసలుగా మారే ప్రమాదముందని, ఈ పరిస్థితుల్లో కార్మికులు ఐక్యంగా ఉండి కార్మిక సంఘాలను ఏర్పరచుకొని హక్కుల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. సిఐటియు జిల్లా నాయకులు ఎస్‌ఎస్‌ చెంగయ్య మాట్లాడుతూ కార్మికులు బానిసలుగా 18 గంటల పని చేయాల్సిన దుస్థితిని అనుభవిస్తున్న రోజుల్లో కార్మికులు తిరగబడి పోరాటాల ద్వారా 8 గంటల పని విధానాన్ని సాధించుకున్నారని వివరించారు. కానీ నేటి పాలకులు మరల కార్మికులను 12 గంటలు 15 గంటలు పని రోజులకు తీసుకెళ్తున్న పరిస్థితులు మోడీ, జగన్మోహన్‌రెడ్డి పాలనలో వస్తున్నాయని విమర్శించారు. ఈ విధానాలను పోరాటాలతో తిప్పికొట్టాలన్నారు. అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్ష కార్యదర్శులుగా చీమలదండు పార్వతి, వుద్దంటి దుర్గారావు, ఉపాధ్యక్షులుగా బద్దిల ఆనంద్‌, నూతక్కి స్వర్ణ, సహాయ కార్యదర్శులుగా కుక్కమళ్ల రాజేశ్వరి, ఎం.నాగరాజు, కోశాధికారిగా వట్రం పూర్ణయ్య, కమిటీ సభ్యులుగా కత్తుల సురేష్‌, ఎన్‌.జోజిరాణి, జి.నాగేశ్వరావు, దుపాటి బుల్లిబాబు, కాజా రామయ్య, కె.కృష్ణ, శివకుమారి, నాగేంద్రబాబు, నాగయ్య ఎన్నికయ్యారు.

➡️