కాలాన్ని శాసించగల శక్తి కవులకే ఉంది

ప్రజాశక్తి-గుంటూరు : కాలాన్ని సైతం శాసించగల శక్తి కవులకే వుందని, కాలం కవుల చేతిలో మాత్రమే బందీగా వుంటుందని మాజీమంత్రి, జాషువా కళాపీఠం అధ్యక్షులు డొక్కా మాణిక్యవరప్రసాద్‌ అన్నారు. స్థానిక బ్రాడీపేటలోని జాషువా విజ్ఞాన కేంద్రంలో ఆదివారం బాపు రమణ బాలు కళాపీఠం, నవ్యాంధ్ర రచయితల సంఘం గుంటూరు జిల్లాశాఖ ఆధ్వర్యంలో డాక్టర్‌ రమణ యశస్వి రచించిన ‘యశస్వీయ సప్తపదులు’ పుస్తకావిష్కరణ, కవిమిత్రుల సంగమం-కవి సమ్మేళనం కార్యక్రమం జరిగింది. డొక్కా మాణిక్యవరప్రసాద్‌ మాట్లాడుతూ కాలాన్ని తన గుప్పిటలోకి తెచ్చుకుని వైద్యుడిగా, సాహితీవేత్తగా రెండు పాత్రల్నీ ఏకకాలంలో పోషిస్తున్న విశిష్టవ్యక్తి డాక్టర్‌ రమణ యశస్వి అని అన్నారు. లఘు కవితా ప్రక్రియల ఉద్యమకారుడు, ప్రసిద్ధ సాహితీవేత్త డాక్టర్‌ రావి రంగారావు ‘సప్తపదులు’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆధునిక సాహిత్యంలో మినీ కవితా ప్రక్రియలపాత్ర కీలకమైందన్నారు. సభకు అధ్యక్షత వహించిన ప్రొఫెసర్‌ యల్లాప్రగడ మల్లికార్జునరావు మాట్లాడుతూ నేడు తెలుగు సాహిత్యంలో అనేక ప్రక్రియలు, పరిణామాలు వస్తున్నాయని, ఇవి చాలా అవసరం అన్నారు. సాహిత్యంలో మార్పు అనివార్యం అని, మంచి మార్పు సాహిత్యాన్ని పదికాలాలు సజీవంగా వుంచుతుందన్నారు. ప్రసిద్ధ కవి కోసూరి రవికుమార్‌ పుస్తకాన్ని సమీక్షించారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ అధికార భాషాసంఘం సభ్యులు డాక్టర్‌ కత్తి వెంకటేశ్వర్లు, సాహితీవేత్తలు డాక్టర్‌ పీ.వీ.సుబ్బారావు, వైహెచ్‌కె.మోహనరావు, నవ్యాంధ్ర రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి కలిమిశ్రీ, గుంటూరు జిల్లా శాఖ అధ్యక్షులు డాక్టర్‌ తూములూరి రాజేంద్రప్రసాద్‌ మాట్లాడారు. పుస్తక రచయిత డాక్టర్‌ రమణ యశస్వి నూతన కవితా ప్రక్రియ ఉద్దేశాన్ని తెలిపారు. అనంతరం బి.జనార్థనరెడ్డి నిర్వహించిన కవి సమ్మేళనంలో మూడు జిల్లాలకు చెందిన కవులు తమ కవితల్ని వినిపించారు. చిలకలూరిపేటకు చెందిన పివి రమణకుమార్‌ చదివిన కవితను ఉత్తమ కవితగా ఎంపిక చేసి నగదు బహుమతి, సర్టిఫికెట్‌ ప్రదానం చేశారు. విజేతను అరసం జాతీయ అధ్యక్షులు పెనుగొండ లక్ష్మీనారాయణ సత్కరించారు. కార్యక్రమాన్ని సయ్యద్‌ జానీబాషా, బండికల్లు జమదగ్ని నిర్వహించారు.

➡️