కిసాన్‌ రైలు పునరుద్ధరణ అయ్యేనా..!

ప్రజాశక్తి – సింహాద్రిపురంకేంద్ర ప్రభుత్వం రైతులు పండించిన ఉత్పత్తులను తక్కువ ఖర్చుతో ఢిల్లీలోని ఆజాద్‌పూర్‌ మండీకి రైలు సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. 2020లో అనంతపురం నుంచి ఢిల్లీ మార్కెట్‌కు రైల్‌ పోయే విధంగా రూపకల్పన చేశారు. ఈ రైలు అనంతపురం నుంచి ఢిల్లీకి కేవలం 36 గంటల సమయంలో వెళ్లేది. అప్పట్లో రైతులు అనంతపురం నుంచి అరటికాయలు, వేరుశనగ, చీనీ కాయలను రైల్లో తీసుకెళ్లి ఢిల్లీ మార్కెట్లో విక్రయించుకునేవారు. ఇక్కడి ధరలకు ఢిల్లీలోని ఆజాద్‌పూర్‌ మండీలో ధరలకు చాలా వ్యత్యాసం ఉందని.. ఈ మార్కెట్‌ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అప్పట్లో రైతులు భావించేవారు. అనంతరం 8 నెలల తర్వాత ప్రభుత్వం కొన్ని అనివార్య కారణాల వల్ల రైలును రద్దు చేసింది. అప్పట ినుండి నేటికీ పునరుద్ధరణకు నోచుకోలేదు. ఆరుగాలం శ్రమించి పంట పండించి.. దిగుబడి వచ్చే సమయంలో ధరలు నిలకడగా లేని కారణంగా తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కిసాన్‌ రైలు ఉంటే తక్కువ ఖర్చుతో ఢిల్లీ మార్కెట్‌కు పంట ఉత్పత్తులను తరలించి అమ్ముకుని లాభపడేవారని పేర్కొంటున్నారు. పండ్ల తోటలకు కడప, అనంతపురం జిల్లాలు ప్రసిద్ధి. కడప జిల్లాలోని పులివెందుల నియోజవర్గంలో అరటి, చీనీకాయలు ఎక్కువ రోజులు మన్నికతోపాటు, నాణ్యత సైతం బాగా ఉంటాయి. ఈ కారణంగా ఇతర రాష్ట్రాలతోపాటు దేశాల్లో కూడా వీటికి మంచి డిమాండ్‌ ఉంది.లారీల్లో రవాణాతో నష్టపోతున్న రైతులు.. పులివెందుల నియోజవర్గంలో అరటి, చీనీ కాయలను లారీల్లో ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌, జమ్ముకాశ్మీర్‌ రాష్ట్రాలకు తరలిస్తున్నారు. ముఖ్యంగా సీజన్‌లో అరటికాయలు రోజు 22 టన్నుల సామర్థ్యం కలిగిన దాదాపు 50 లారీల్లో ఢిల్లీ, ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. అరటికాయలు రవాణా చేసేందుకు టన్నుకు రూ.8 వేలు చెల్లించాల్సి ఉంది. అంతేకాక సమయం కూడా నాలుగు రోజులు పడుతుంది. అదేవిధంగా చీనీ కాయలు సైతం నియోజవర్గంలోని సింహాద్రిపురం, లింగాల, పులివెందుల, వేముల మండలాలతోపాటు కొండాపురం మండలం నుంచి ఢిల్లీ మార్కెట్‌కు వ్యాపారులు స్థానిక తోటల వద్దకు వచ్చి కొనుగోలు చేసి రవాణా చేస్తుంటారు. లారీల్లో రవాణా కారణంగా సమయం ఎక్కువ, బాడుగ అధికంగా చెల్లించాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కిసాన్‌ రైలు అందుబాటులో ఉండి ఉంటే.. తక్కువ ఖర్చుతో తమ ఉత్పత్తులను ఢిల్లీ మార్కెట్లో అమ్ముకుని అదనపు ఆదాయం పొందేవారమని రైతులు, రైతు సంఘ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రవాణా ద్వారా రైతులకు అదనపు ఆదాయం వస్తున్నందున పాలకులు, అధికారులు చర్యలు తీసుకొని కిసాన్‌ రైల్‌ పునరుద్ధరణ చేయాలని రైతు సంఘాల నాయకులు కోరుతున్నారు.లారీల్లో రవాణా వల్ల నష్టపోతున్నాం.. అరటికాయలను లారీల్లో ఢిల్లీ ప్రాంతానికి ఎగుమతి చేయడం వల్ల రవాణా ఖర్చులు పెరుగు తున్నాయి. రవాణా ఖర్చు టన్నుకు రూ8 వేలు. ఆ మేరకు తోటల వద్ద ధరలు తగ్గించి వ్యాపారస్తులు కొనుగోలు చేస్తున్నారు. అదే రైలు సౌకర్యం ఉంటే రవాణా ఖర్చు తగ్గి అదనపు ఆదాయం వచ్చేది.- బాలనాగిరెడ్డి, అరటి రైతు, గురజాలరైలు పునరుద్ధరణను సిఎం దృష్టికి తీసుకెళ్తా.. పండ్ల తోటల రైతులకు ఎంతో ఉప యోగకరంగా ఉండే కిసాన్‌ రైలు రద్దు చేయడం చాలా అన్యాయం. రైలు పునరుద్ధరణ కోసం సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తా. లారీల్లో రవాణా కార ణంగా జరిగే నష్టాన్ని సీఎంకు వివరించి పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటాం.- వి.అరవిందనాథ్‌రెడ్డి, వైసిసి రైతు విభాగ నాయకుడు, సింహాద్రిపురం

➡️