కుల వ్యవస్థను ప్రోత్సహించే మనుస్మృతి దహనం

సుందరయ్య నగర్‌లో మనుస్మృతి ప్రతులను దహనం చేస్తున్న వివిధ సంఘాల నాయకులు, కార్యకర్తలు
ప్రజాశక్తి-గుంటూరు :
నిచ్చెన మెట్ల కుల వ్యవస్థను ప్రోత్సహిస్తూ నిమ్మ జాతులపై విషాన్ని చిమ్మిన మనుస్మృతిని అంబేద్కర్‌ దహనం చేసి 96 ఏళ్లయిన సందర్భంగా సోమవారం స్థానిక పుచ్చలపల్లి సుందరయ్య నగర్‌లో మనుధర్మ శాస్త్ర ప్రతులను కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్‌), సిఐటియు ఆధ్వర్యంలో దహనం చేశారు. కెవిపిఎస్‌ నాయకులు జి.లూథర్‌పాల్‌ మాట్లాడుతూ అంబేద్కర్‌ రాసిన రాజ్యాంగాన్ని పక్కనపెట్టిన వర్ణ వ్యవస్థను పెంచి పోషించిన మనుస్మృతిని అమలు చేయాలని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం యత్నిస్తోందని విమర్శించారు. లౌకిక, ప్రజాతంత్ర వాదులంతా ప్రయత్నాన్ని అడ్డుకోవాలని కోరారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు షేక్‌.ఖాసిం షహీద్‌, సిఐటియు నాయకులు మస్తాన్‌వలి, జి.శంకరరావు, పి.అశోక్‌, షేక్‌ అబ్దుల్లా, అఫ్రోజ్‌, ఐద్వా నాయకులు షేక్‌.ఖాజాబి, నాగమ్మ పాల్గొన్నారు. కెఎన్‌పిఎస్‌, పలు దళిత సంఘాల ఆధ్వర్యంలో సోమవారం స్థానిక లాడ్జి సెంటర్‌లోని అంబేద్కర్‌ విగ్రహం ఎదుట మనుస్మృతిని దహనం చేశారు. కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి కె.కృష్ణ మాట్లాడుతూ నిమ్మజాతాలు వేదాలు చదవరాదని, వినరాదని, చదివితే నాలుక తెగ్గొయ్యాలని, వింటే చెవుల్లో సీసం పొయ్యాలని శాసించిన మనుస్మృతిని 1927 డిసెంబర్‌ 25న మహద్‌లో వేలాది మంది కార్యకర్తల మధ్య డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ దహనం చేశారని గుర్తు చేశారు. కంప్యూటర్‌ యుగంలోనూ కుల అసమానతలు పెంచి పోషించాలని బిజెపి యత్నిస్తోందని, రాజ్యాంగానికి తూట్లు పొడిచి, ఆ స్థానంలో మనుస్మృతిని అమలు చేయాలని చూస్తోందని విమర్శించారు. ఆధునిక మనువాద పాలకుల్ని ఓడించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు కె.నాగేశ్వరరావు, సిహెచ్‌.రాజశేఖర్‌, ఎన్‌.పోతురాజు, ఎన్‌.నీలాంబరం, ఎన్‌.బ్రహ్మయ్య, జి.ప్రభుదాసు పాల్గొన్నారు.

➡️