కేరింతల మధ్య ముగిసిన బాలోత్సవం

నృత్య ప్రదర్శనలో విద్యార్థులు
ప్రజాశక్తి – మంగళగిరి రూరల్‌ :
మంగళగిరి కార్పొరేషన్‌ పరిధిలోని ఎర్రబాలెం డాన్‌బాస్కో హైస్కూల్‌ ఆవరణలో ఎంఎస్‌ స్వామినాథన్‌ వేదికగా రెండ్రోజులుగా నిర్వహిస్తున్న మంగళగిరి – తాడేపల్లి బాలోత్సవం రెండవ పిల్లల పండగ విద్యార్థుల కేరింతల మధ్య ఉత్సాహపూరిత వాతావరణంలో శుక్రవారం ముగిసింది. బహుమతి ప్రదానోత్సవ సభకు బాలోత్సవం మంగళగిరి అధ్యక్షులు వివి ప్రసాద్‌ అధ్యక్షత వహించారు. రోటరీ క్లబ్‌ ఆఫ్‌ మంగళగిరి ప్రాజెక్ట్‌ చైర్మన్‌ అనిల్‌ చక్రవర్తి ముఖ్యఅతిథిగా హాజరై విద్యార్థులను, నిర్వాహకులను అభినందించాచారు.పోటీల్లో భాగంగా జరిగిన వివిధ పోటీల్లో విద్యార్థులు అబ్బురపరిచే ప్రదర్శనలు, నైపుణ్యాలను కనబర్చారు. లఘు నాటికల రూపంలో రైతుల తరఫున సాధక బాధకాలను తెలిపేలా వారి ఇబ్బందులను కళ్లకు కట్టినట్లు ప్రదర్శించారు. దేశభక్తిని పెంపొందించే విధంగా కొన్ని నాటికలను, గౌరవప్రవృత్తిని ఎలా పెంపొందించుకోవాలో తెలియచెప్పేలా ప్రదర్శనలలో తెలియజేశారు. సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబిమించేలా కోలాట ప్రదర్శనలను అందించారు. జానపద నృత్యాలతో పాటు శాస్త్రీయ నృత్యాలను చేస్తూ పల్లెటూరు వాతావరణాన్ని తెచ్చిపెట్టారు. సంక్రాంతి పండుగ ముందే వచ్చినంత సందడిని చేశారు. దేశభక్తి అభ్యుదయ గీతాలను ఆలపిస్తూ సమాజంలో ప్రజలు ఉండాల్సిన తీరును అణగారిపోతున్న విలువలను గురించి తెలియజెప్పారు. క్లే మోడలింగ్‌లో చిన్నారులు తమ చిట్టి చేతులతో మట్టి కళాఖండాలను రూపొందించారు. ఉపన్యాసాలు చేయడంలోనూ పద్యభావం తెలియజెప్పడంలోనూ క్విజ్‌ పోటీల్లోనూ ఎవరికి వారే అన్న తీరుగా తమ ప్రతిభను ప్రదర్శించారు. విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన అతిథులు.. రాబోయే కాలంలో మరింతగా రాణించాలని వెన్ను తట్టి ప్రోత్సహించారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్‌ ఆఫ్‌ మంగళగిరి ప్రెసిడెంట్‌ అందే రేవంత్‌, రోటరీ క్లబ్‌ మంగళగిరి ప్రాజెక్టు డైరెక్టర్‌ అందే మురళి అమరావతి బాలోత్సవం ప్రధాన కార్యదర్శి కొండలరావు మాట్లాడుతూ బాలోత్సవం ద్వారా విద్యార్థుల్లోని సృజన, వికాసాన్ని వెలికి తీయొచ్చని చెప్పారు. ప్రతి వీధిలో బాలోత్సవాలు జరగాల్సిన ఆవసరం ఉందన్నారు. ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్‌ కెవిఎస్‌సాయి ప్రసాద్‌, అమరావతి బాలోత్సవం వ్యవస్థాపకులు పిన్నమనేని మురళీకృష్ణ మాట్లాడుతూ పిల్లలు ఎలక్ట్రానిక్‌ పరికరాలకు బానిసలుగా మారిపోతున్న తరుణంలో క్రీడా ప్రాంగణాల్లో, సాంస్కృతిక వేదికల్లో తమ ప్రతిభను బయటకు ప్రదర్శించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ఇలాంటి కార్యక్రమాలవైపు పిల్లల్ని తల్లిదండ్రులు ప్రోత్సహించాలని సూచించారు. కార్యక్రమంలో బాలోత్సవం గౌరవ అధ్యక్షులు నన్నపనేని నాగేశ్వరరావు, విజె డిగ్రీ కళాశాల కరస్పాండెంట్‌ పి.రాజశేఖర్‌, డాన్‌ బాస్కో హైస్కూల్‌ ప్రతినిధులు ఫాదర్‌ పీకే జోష్‌, హెచ్‌ఎం ఫాతిమారాణి, బాలోత్సవం కార్యదర్శులు పి శ్రీలక్ష్మి, సింహాద్రి సుమ, కోశాధికారి గాదె సుబ్బారెడ్డి, బాలకృష్ణ పాల్గొన్నారు.

➡️