కొండవీడు కోటపై పండగ

Feb 11,2024 00:32

ప్రజాశక్తి – పల్నాడు జిల్లా, చిలకలూరిపేట : యడ్లపాడు మండలంలోని కొండవీడు కోటపై రెండ్రోజులపాటు నిర్వహించే కొండవీడు ఫెస్ట్‌-2024 శనివారం ప్రారంభమైంది. వసంతరాజీయం వేదికగా జరిగిన ఫెస్ట్‌ను జిల్లా కలెక్టర్‌ ఎల్‌.శివశంకర్‌, జాయింట్‌ కలెక్టర్‌ ఎ.శ్యాంప్రసాద్‌, ట్రైనీ కలెక్టర్‌ కల్పశ్రీ ప్రారంభించారు. పర్యాటకులను ఆకట్టుకునేలా హెలికాప్టర్‌ రైడ్‌తోపాటు పలు ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. పాఠశాలలు, కళాశాలలు విద్యార్థులు, కళాకారులు, జబర్దస్త్‌ టీం, పలువురు నాటకాల రచయితలు, ఉద్యోగుల ప్రత్యేక ప్రదర్శనలు, పాటలు, నృత్యాలు ఆలరించాయి. నిర్విరామంగా సాగుతున్న సాంస్కృతిక కార్యక్రమాలతో పర్యాటకులు సందడిగా గడిపారు. లేజర్‌ షో, పల్నాడు జిల్లా ఉత్సవ గీతం ఆకట్టుకుంది. ఇదిలా ఉండగా హేలి రైడ్‌కు సంబంధించి టికెట్టు ధర పెద్దవారికి రూ.3,800, పిల్లలకు రూ.3500 నిర్ణయించారు. ఫెస్ట్‌కు పల్నాడు జిల్లాతోపాటు గుంటూరు, బాపట్ల, ఎన్‌టిఆర్‌, కృష్ణా, ప్రకాశం జిల్లాల నుండి పర్యాటకులు తరలివచ్చారు. విద్యార్థులు ఎక్కువగా వచ్చే అవకాశం నేపథ్యంలో చిన్నపిల్లల కోసం ప్లే ఏరియాను ఏర్పాటు చేశారు. పూల తోటలతో పాటు ఇసుకను ఏర్పాటు చేయించి అందులో సైతక శిల్పం తరహాలో ఆర్ట్‌ గీసేలా ఏర్పాటు చేవారు. ప్రత్యేక వేదికలపై క్లాసికల్‌, వెస్ట్రన్‌ నృత్య ప్రదర్శన పోటీలు పెడుతున్నారు. ప్రథమ బహుమతి రూ.10,116, ద్వితీయ బహుమతి రూ.5,116, తృతీయ బహుమతులు రూ.2.500 ఇవ్వన్నుట్లు కలెక్టర్‌ ప్రకటించారు.

➡️