కొండ నీరే తాగునీరు

Feb 18,2024 21:32

ప్రజాశక్తి -భామిని : ప్రభుత్వాలు తాగు నీటి కోసం నిధులు వెచ్చిస్తున్నా గిరిశిఖ గ్రామ గిరిజనులకు మాత్రం గుక్కెడు నీటి కోసం అనేక అవస్థలుపడుతున్నారు. వివరాల్లోకొ వెళ్తే నూతన నల్లారాయిగూడ పంచాయతీలోని డోకులగూడ, బొడ్డగూడ పంచాయతీ పరిధిలో గేదెలగూడ, నడిమిగూడ గ్రామస్తులు తాగునీటికి నానా అవస్థలు పడుతున్నారు. గుక్కెడు నీటి కోసం కొండల్లోని ఇంకుడు గుంటలపై ఆధారపడుతున్నారు. సుమారు 60 కుటుంబాలున్న ఈ మూడు గిరిజన గ్రామాల ప్రజలు తాగు నీటి కోసం, పరిసర కొండలపై 8 అడుగులు లోతులో ఇంకుడు గుంటను తవ్వి, ఆ గుంటలకు పైపును అమర్చి, ఏటావాలుగా కిందకు దించుతున్నారు. ఆ ఇంకుడు గుంట నీరు కలుషితమైనా వాటినే తాగడానికి, ఇతర అవసరాలకు వాడుకునే పరిస్థితి. ప్రస్తుతం ఆ ఇంకుడు గుంటకు ఏర్పాటు చేసిన పైప్‌ నుంచి కొద్ది పాటి నీరు వస్తుందని, ఈ నెల చివరికి అది పూర్తి స్థాయిలో ఎండిపోతుందని అన్నారు. స్థానికంగా ఉన్న చిన్న బావిపైనే అందరూ ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ చిన్న బావి కూడా 3,4 నెలల్లో నీరు దొరకని పరిస్థితి. ప్రతి ఏటా వేసవి ఈ సమస్యను ఎదుర్కొంటున్నామని, రానున్న వేసవికి అధికారులు ముందస్తుగా చర్యలు తీసుకోవాలని స్థానిక గిరిజనులు కోరుతున్నారు.

➡️