కొనసాగుతున్న అంగన్‌వాడీల సమ్మె

ప్రజాశక్తి-మార్కాపురం: అంగన్‌వాడీల సమ్మె 34వ రోజుకు చేరింది. ప్రభుత్వం మాత్రం ఎలాంటి పరిష్కారం చూపకపోగా ఏకంగా ఎస్మా ప్రయోగించింది. అంగన్‌వాడీలు మాత్రం బెదరలేదు. ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకునేందుకు సమ్మె కొనసాగుతోంది. ఆదివారం నాడు భోగి పండుగ సందర్భంగా ప్రభుత్వం జారీ చేసిన ఎస్మా ప్రతులను భోగి మంటల్లో అంగన్‌వాడీలు తగలబెట్టారు. మార్కాపురంలోని సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం ఎదురుగా కొనసాగుతున్న సమ్మె శిబిరంలో ఎఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు రావులపల్లి రవీంద్రనాథ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్‌వాడీల విషయంలో ప్రభుత్వం మొండి వైఖరితో వ్యవహరిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు డి.సోమ య్య, పి.రూబెన్‌, జె.నాగరాజు, మార్కాపురం నియోజకవర్గ సిపిఐ కార్యదర్శి అందె నాసరయ్య, జిల్లా ఎఐటియుసి కార్యదర్శి షేక్‌ ఖాశిం తదితరులు నాయకత్వం వహించగా మద్దతుగా యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్షులు ఓ.వీరారెడ్డి, రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యులు బి శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. కనిగిరి: అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో అంగన్వాడీల సమస్యలకు పరిష్కారం కోరుతూ కనిగిరి పట్టణంలోని ఐసిడిఎస్‌ కార్యాలయం ఎదుట అంగన్వాడీలు చేపట్టిన సమ్మె ఆదివారం 34వ రోజుకు చేరుకుంది. భోగి పండుగ కావడంతో భోగిమంటల్లో ఎస్మా చట్టం జీవో కాపీలను దగ్ధం చేసి అంగన్వాడీలు నిరసన తెలిపారు. నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు పిసి కేశవరావు మాట్లాడుతూ ఎస్మా చట్టాన్ని ఉపయోగించిన అంగన్వాడీలను బెదిరించలేరని పోరాటం ఆగదని అన్నారు. కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ నాయకులు ఎస్‌ సుజాత, సీత, రజిని, భాగ్యలక్ష్మి, రాజేశ్వరి, సౌందర్య, రామ సుబ్బులు, డివైఎఫ్‌ఐ నాయకులు నరేంద్ర, జెవివి నాయకులు జి శ్రీనివాసులు, ఐద్వా నాయకులు ఎస్‌కే బషీర, శాంతకుమారి, ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.

➡️