కోటదుర్గమ్మ ఆలయ బోర్డు పదవికి పోటీ

Feb 9,2024 20:55

ప్రజాశక్తి-పాలకొండ : పట్టణంలోని ఎంతో ప్రఖ్యాత దేవాలయంగా గుర్తింపు పొందిన కోటదుర్గమ్మ ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్ష పీఠానికి గట్టి పోటీ నే కనిపిస్తుంది. అధ్యక్ష పీఠం కోసం పట్టణానికి చెందిన పలువురు అధికార పార్టీ నాయకులు తీవ్రంగా పోటీ పడుతున్నారు. ఏడాదికి సుమారు అరవై లక్షలకు మించి ఆదాయం రావడంతో పాటు ఎంతో ప్రాముఖ్యత కలిగిన దేవాలయం కావటంతో నేతల మధ్య పోటీ తీవ్రంగా ఉంది. వైసిపి అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు అయినప్పటికీ ఇంతవరకు కమిటీని నియమించుకోలేని పరిస్థితి ఉంది. దీంతో ప్రజల్లో కూడా తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. ఏటా జరుగుతున్న దసరా ఉత్సవాలు కూడా కమిటీ లేకుండా జరుగుతున్నాయి. ఆలయ అభివృద్ధికి స్థానిక కమిటీ అవసరమైనప్పటీకీ అధికార పార్టీలో వర్గ పోరు కారణంగా కమిటీ నియామకం జరగలేదని పట్టణ వాసులు అంటున్నారు.నోటిఫికేషన్‌ విడుదలతో ప్రయత్నాల జోరుఆలయ కమిటీ కి ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేయటంతో అధికార పార్టీ నాయకుల ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి. చైర్మన్‌ పదవి ఆశిస్తున్న వారంతా తమ ప్రయత్నాలు తీవ్రం చేస్తున్నారు. ప్రస్తుతం శాసనసభ సమావేశాలు జరుగుతున్న కారణంగా ఆశవాహులు అమరావతిలో తిష్ట వేసి తమ ప్రయత్నాలను చేస్తున్నట్లు తెలిసింది. 15వ వార్డు కౌన్సిలర్‌ ప్రతినిధి తుమ్మగుంట శంకరరావు ఈ పదవికి పోటీ పడుతున్నట్లు తెలిసింది. ఇప్పటీవరకు ఈయన మేజర్‌ పంచాయతీలో వార్డు సభ్యునిగా ఉన్నారు. పాలకొండ నగరపంచాయతీ గా మారిన తరువాత రెండుసార్లు ఆయన సతీమణి అనూష కౌన్సిలర్‌ గా గెలుపొందారు. బలమైన సామాజిక వర్గానికి చెందిన నాయకుడిగా ఉండడం ఆయనకుు అనుకూలమైన అంశంగా ఉంది. ప్రభుత్వ విప్‌ విక్రాంత్‌ ఆశీస్సులు ఈయనకు ఉన్నాయన్న చర్చ జరుగుతోంది. మరో కౌన్సిలర్‌ ప్రతినిధి నీలాపు శ్రీను కూడా ఈ పదవికోసం పోటీ పడుతున్నారు. ఎన్‌ కె రాజపురానికి చెందిన కౌన్సిలర్‌గా ఈయన సతీమణి శారద గత రెండు పర్యాయాలుగా గెలుపొందారు. ఎమ్మెల్యే మద్దతు కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఎవరి వైపు మొగ్గు చూపిస్తారో తెలియాల్సి ఉంది.

➡️