కోటి సంతకాలతో ‘జగనన్నకు చెబుదాం’

Jan 12,2024 21:43

ప్రజాశక్తి – పార్వతీపురంరూరల్‌  :  ప్రతి తల్లి తన బిడ్డ కోసం శ్రమిస్తే, అంగన్వాడీలు ఆ బిడ్డల శ్రేయస్సు కోసం కృషి చేస్తున్నారని, వారు చేస్తున్న కృషి, శ్రమ వెలకట్టలేనిదని, అటువంటి అంగన్వాడీ మహిళలు రోడ్డున పడడం అన్యాయమని వక్తలు ప్రభుత్వాన్ని విమర్శించారు. అంగన్వాడీలు చేస్తున్న నిరవధిక సమ్మె పోరాటం శుక్రవారానికి 32వ రోజుకు చేరుకున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాలతో జగనన్నకు చెబుతాం కార్యక్రమం పిలుపులో భాగంగా స్థానిక కలెక్టరేట్‌ వద్ద చేపడుతున్న సమ్మె శిబిరంలో ప్రముఖ కవి రచయిత పక్కి రవీంద్ర, ప్రముఖ న్యాయవాది టి. జోగారావు, యుటిఎఫ్‌ నాయకులు ఎస్‌.మురళీమోహన్‌, తోట రమేష్‌, సిఐటియు నాయకులు జి.వెంకటరమణ, వి.ఇందిర, ఎఐటియుసి నాయకులు, అంగన్‌వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ నాయకులు గంట జ్యోతి, నాయకులు పార్వతమ్మ, గౌరీ మణి సంతకాలు పెట్టి కార్యక్రమాని ప్రారంభించారు. తొలుత పక్కి రవీంద్ర మాట్లాడుతూ పిల్లలకు అన్నం పెట్టి, ప్రాథమిక విద్యానందించే అంగన్వాడీలు రోడ్డున పడడం దౌర్భాగ్యమని మండిపడ్డారు. ఇన్నిరోజులు అంగన్వాడీలు రాత్రి, పగలు, ఎండా, చలిలో ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం అన్యాయమని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వంలో చలనంతో పాటు వినికిడి, స్ప్రహ లేదని విమర్శించారు. జోగారావు మాట్లాడుతూ అంగన్వాడీల పోరాటం న్యాయమైందని, మేధావులు న్యాయ తీర్పులను గౌరవించడంతో పాటు అమలు చేయాలని అన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన్నప్పటికి ప్రభుత్వం అమలు చేయకపోవడంతో కోర్టు ధిక్కరణకు గురవ్వడమేనని అన్నారు. వెంటనే సుప్రీం కోర్టు తీర్పును అమలుచేయాలనీ డిమాండ్‌ చేశారు. ఎస్‌.మురళీ మోహన్‌ మాట్లాడుతూ అంగన్వాడీలు చేస్తున్న పోరాటానికి దేశవ్యాప్తంగా సంఘీభావం వస్తుండండతో పోరాటం విజయవంతమైనట్టేనని తెలిపారు. ప్రతిపక్ష పార్టీలు నిర్ధిష్ట హామీలతో ముందుకురావాలని, గతంలో చంద్రబాబు, నేడు జగన్మోహన్‌ రెడ్డి అంగన్వాడీలను రోడ్డు పాలుచేయడం అన్యాయమని వాపోయారు. ప్రభుత్వం ఈ సమ్మెను అణచివేయాలని సెంటర్ల తాళాలు పగలగొట్టడం, ఇతర ప్రభుత్వ ఉద్యోగులతో సెంటర్లు నడిపించాలని ప్రయత్నించడం సరైనది కాదని అన్నారు. వెంటనే ఎస్మాను రద్దు చేయాలని, సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు జయమని, ధర్మవతి, గౌరి, రాజేశ్వరి మరియు తదితరులు పాల్గొన్నారు.

పాలకొండ : తమపై అన్యాయంగా ప్రయోగించిన ఎస్మాను తక్షణమే రద్దు చేసి అంగన్వాడీల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపలని అంగన్వాడి వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా కార్యదర్శి ఎన్‌ హిమప్రభ డిమాండ్‌ చేశారు. స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం ఆవరణలో ఉన్న శిబిరంలో మొట్టికాయలు పెడుతూ నిరసన తెలియజేశారు. కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి ప్రజలు మద్దతు కోరారు. కార్యక్రమంలో యూనియన్‌ జిల్లా కోశాధికారి బి.అమరవేణి, ప్రాజెక్ట్‌ అధ్యక్షులు జి జెస్సీబాయి, ప్రతినిధులు జి శారద, దివ్య, భవాని, లలిత, శ్రీదేవి, మణి పాల్గొన్నారు.

సాలూరు : తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యాన కార్యకర్తలు, హెల్పర్లు స్థానిక ఆర్‌టిసి కాంప్లెక్స్‌ నుంచి ర్యాలీ నిర్వహించారు. సమస్యలను పరిష్కరించాలని కోరుతూ యూనియన్‌ నాయకులు శశికళ, నారాయణమ్మ, సిఐటియు జిల్లా కార్యదర్శి ఎన్వై నాయుడు ఆధ్వర్యాన చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని యుటిఎఫ్‌ జిల్లా కార్యదర్శి కె.జానకీరావు, మండల కార్యదర్శి ఎ.గణేష్‌ ప్రారంభించారు. కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు తిరుపతమ్మ, సుభద్ర, అరుణకుమారి పాల్గొన్నారు.

కురుపాం : అంగన్వాడీల హక్కులపై చేపట్టిన దీక్ష నెల రోజులు దాటినా ప్రభుత్వం స్పందించకపోవడంతో శుక్రవారం దీక్షా శిబిరం ఎదుట అంగన్‌వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షులు పి.సరళకుమారి ఆధ్వర్యంలో కోటి సంతకాలు స్వీకరణ నిర్వహించారు. కార్యక్రమంలో ప్రాజెక్ట్‌ కార్యదర్శి జె.సరోజ, సెక్టార్‌ నాయకులు ఎం.మీనాక్షి , డివి రత్నం, బి.జయలక్ష్మి, ఎస్‌.సులోచన, డి.జ్యోతిలక్ష్మి, ఎన్‌.సుమతి తదితరులు పాల్గొన్నారు.

సీతానగరం : స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట ప్రజాసంఘాల ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. ప్రజా సంఘాల జిల్లా నాయకులు నాయకులు రెడ్డి వేణు మాట్లాడారు. అంగన్వాడీలకు తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు చెల్లిస్తానని సిఎం జగన్మోహన్‌ రెడ్డి ఇచ్చిన హామీని అమలు చేయాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం బెదిరింపు చర్యలు మానుకోవాలని, లేకుంటే ప్రజాసంఘాలు ప్రజల మద్దతు కూడగట్టి అంగన్వాడీల సమస్యలు పరిష్కారమయ్యేంత వరకు వారు చేస్తున్న సమ్మెకు అండగా ఉంటామని తెలిపారు. కార్యక్రమంలో యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి ఎస్‌.మురళీమోహనరావు, సిఐటియు నాయకులు గవర వెంకటరమణ, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు రెడ్డి ఈశ్వరరావు, రైతు సంఘం నాయకులు రెడ్డి లక్ష్మీనాయుడు, ఆటో యూనియన్‌ నాయకులు రెడ్డి సన్యాసినాయుడు తదితర ప్రజానీకం సంతకాల సేకరణలో పాల్గొన్నారు.

సీతంపేట : స్థానిక ఐటిడిఎ ఎదుట తలపెట్టిన అంగన్‌వాడీల నిరవధిక సమ్మెలో అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్‌ యూనియన్‌ జిల్లా కమిటీ సభ్యులు హిమప్రభ పాల్గొన్నారు. మాట్లాడుతూ ప్రభుత్వం యూనియన్‌ నాయకులను చర్చలకు పిలుస్తూ, మరోవైపున ఐసిడిఎస్‌ అధికారులతో అంగన్వాడీ కార్యకర్తల కుటుంబ సభ్యులకు నోటీసులివ్వడం బాధాకరమన్నారు. ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాస్తే సహించేది లేదన్నారు, అనంతరం పలు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి సంతకాలను సేకరించారు. కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు పార్వతి, దర్శమి, అంజలి, ప్రియ, అరుణకుమారి, సురేష్‌, తదితర కార్యకర్తలు పాల్గొన్నారు.

భోగీ మంటల్లో జీవో 2 కాపీలు దగ్ధం

కొమరాడ : అంగన్వాడీలు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అంగన్వాడీ యూనియన్‌ నాయకులు అనురాధ డిమాండ్‌ చేశారు. శుక్రవారం 32వ రోజు సమ్మె సందర్భంగా కొమరాడలో సమ్మె శిబిరంలో కోటి సంతకాలు సేకరణ చేపట్టారు. అనంతరం భోగిమంటలు వేసి అందులో ఇటీవల ప్రభుత్వం ప్రయోగించిన ఎస్మా చట్టం జిఒ 2 ప్రతులను వేసి దగ్ధం చేశారు. కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ కొమరాడ ప్రాజెక్టు ఉపాధ్యక్షులు సిరికి అనురాధ, సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు కొల్లి సాంబమూర్తి, నాయకులు బి.అలివేలు, మంగ, జ్యోతి, మల్లేశ్వరమ్మ, పద్మ, జయమ్మ, కె.వరలక్ష్మి, లలిత, రైతు సంఘం నాయకులు ఉపేంద్ర, వ్యవసాయ కార్మిక, ఆటో యూనియన్‌ నాయకులు పాల్గొన్నారు.

➡️