రోగ నిర్ధారణ పరీక్షలు క్షేత్రస్థాయిలో జరపాలి

Jun 20,2024 20:53

ప్రజాశక్తి – కొమరాడ :  గ్రామాల్లో జ్వర లక్షణాలు గుర్తించిన ప్రతి ఒక్కరికీ సత్వరమే నిర్దారణ పరీక్షలు క్షేత్ర స్థాయిలోనే జరపాలని జిల్లా మలేరియా అధికారి (డిఎంఒ) డాక్టర్‌ టి.జగన్‌మోహన్‌ రావు ఆదేశించారు. మండలంలోని చినఖేర్జలను గురువారం ఆయన ఆకస్మికంగా సందర్శించి అక్కడ ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని తనిఖీ చేశారు. జ్వర లక్షణాలతో ఉన్న వారికి నిర్వహించిన మలేరియా ఆర్‌డిటి నిర్దారణ పరీక్షలు, ఫలితాలను పరిశీలించారు. ఫలితాలు నెగెటివ్‌గా నిర్దారణ అయిన వారికి ఆరోగ్య సమస్యలకు తగు మందులు అందజేయాలన్నారు. రోగులతో మాట్లాడి వారి ఆరోగ్య సమస్యలను డిఎంఒ తెలుసుకున్నారు. ప్రస్తుతం సీజనల్‌ జ్వరాలు ప్రబలే అవకాశం ఉన్నందున కాచి చల్లార్చిన నీటిని తాగాలని, ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలన్నారు. వైద్యాధికారి, వైద్య సిబ్బంది సూచనలు పాటించాలని, సరైన గుర్తింపు లేని వైద్యాన్ని ఆశ్రయించొద్దని స్థానికులకు సూచించారు. జ్వర లక్షణాలున్న వారికి సేకరించిన రక్త పూతలు(స్లైడ్స్‌) సకాలంలో ల్యాబ్‌లో పరీక్షలు జరగాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. మలేరియాగా గుర్తిస్తే వెంటనే తెలియజేయాలన్నారు. గ్రామంలో తాగునీరు స్వచ్చత పరీక్షలు ఎప్పటికప్పుడు జరపాలన్నారు. దోమల లార్వా స్థావరాలు ఎక్కడైనా ఉన్నాయా అని పరిశీలించారు. సీజనల్‌ వ్యాధులు, జాగ్రత్తల పట్ల స్థానికులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పిహెచ్‌ఎన్‌ విజయకుమారి, సూపర్వైజర్‌ జయగౌడ్‌, వైద్య సిబ్బంది అనిల్‌, మంగమ్మ, రమేష్‌, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️