కోడి పందేలపై కఠిన చర్యలు తప్పవు

Jan 14,2024 00:06
సంక్రాంతి పండుగ

ప్రజాశక్తి – సామర్లకోట రూరల్‌

సంక్రాంతి పండుగ సందర్భంగా కోడిపందాలు నిర్వహణపై హైకోర్టు నుంచి స్పష్టమైన నిషేధ ఆదేశాలు ఉన్నందున పందాలు నిర్వహిస్తే చట్ట పరమైన చర్యలు తప్పవని ఎస్‌పి సతీష్‌ కుమార్‌ హెచ్చరించారు. శనివారం సామర్లకోట పోలీస ్‌స్టేషన్‌లో సిఐ ఛాంబర్‌ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన రిబ్బను కత్తిరించి సిఐ ఛాంబర్‌ను ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సంక్రాంతి పండుగ సందర్భంగా కోడి పందాలు, గుండాటలకు అనుమతి లేదన్నారు. ఇప్పటికే గత రెండు రోజులుగా ఎక్కడైతే కోడి పందాలు నిర్వహిస్తున్నట్టు తెలిస్తే అక్కడకు తమ సిబ్బంది వెళ్లి ఏర్పాట్లను ధ్వంసం చేయడం, ఆ ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా పందాలు నిర్వహిస్తే చట్టపరంగా తమ పని తాము చేస్తామని ఎస్‌పి హెచ్చరించారు. స్థానిక స్టేషన్‌లో సిఐ, ఎస్‌ఐ క్యాబిన్ల మధ్య పార్టేషన్‌ లేనికారణంగా ఇబ్బంది ఉందన్నారు. మొదట స్టేషన్‌కు వచ్చిన ఫిర్యాదులు పరిష్కారం ఎస్‌ఐ పరిధిలో జరగాల్సి ఉందన్నారు. ఆయన పరిధిలో పరిష్కారం కానీ సమస్యలు సిఐ వద్దకు తీసుకెళ్లాల్సి ఉంటుందన్నారు. అయితే ఈ ప్రక్రియకు సంబంధించి సిఐ క్యాబిన్‌ వేరుగా లేనందున దానిని వేరు చేయడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా స్టేషన్లో కేసులు వాటి ఫిర్యాదులు, లా అండ్‌ ఆర్డర్‌ తదితర విషయాలపై సిబ్బందికి ఎస్‌పి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం డిఎస్‌పి లతాకుమారి, స్థానిక సిఐ సురేష్‌, ఎస్‌ఐ, సిబ్బంది పాల్గొన్నారు.

➡️