కోడ్‌ వచ్చేవరకు ఓటర్ల జాబితాలో మార్పులు

Feb 7,2024 20:33

ప్రజాశక్తి-విజయనగరం : ఎన్నికల ప్రకటన వెలువడే వరకూ ఓటర్ల జాబితాలో చేర్పులు, మార్పులకు అవకాశం ఉందని జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి చెప్పారు. అయితే పేర్ల తొలగింపునకు సంబంధించి నియోజకవర్గంలో 0.1 శాతం దాటితే ఎన్నికల కమిషన్‌ అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. ఎన్నికల కోడ్‌ వచ్చిన తరువాత జాబితాలో మార్పులకు, తొలగింపునకు అవకాశం ఉండదని, నామినేషన్ల గడువు వరకు చేర్పులు మాత్రమే ఉంటాయని స్పష్టం చేశారు. వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో తన ఛాంబర్‌లో బుధవారం సమావేశం నిర్వహించారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ, మార్పులు, చేర్పులు, తొలగింపుల పట్ల ఆయా పార్టీల అభిప్రాయాన్ని తెలుసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 4,400 ధరఖాస్తులు వచ్చాయని, వాటిని త్వరగా పరిశీలించి, తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అలాగే తమకు అందిన ఫిర్యాదులపైనా చర్యలు తీసుకొని, వాటి వివరాలను తెలియజేస్తామని అన్నారు. సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ కె.కార్తీక్‌, అసిస్టెంట్‌ కలెక్టర్‌ వెంకట త్రివినాగ్‌, నియోజకవర్గాల ఇఆర్‌ఒలు ఎల్‌.జోసెఫ్‌, పి.మురళీకృష్ణ, నూకరాజు, ఎన్నికల సూపరింటెండెంట్‌ ప్రభాకర్‌, రాజకీయ ప్రతినిధులు పాల్గొన్నారు.

ఎన్నికల యాప్‌ల విషయంలో గోప్యత ముఖ్యం

వివిధ రకాల ఎన్నికల యాప్‌లు, ఆన్‌లైన్‌ అప్లికేషన్ల వినియోగంలో తప్పనిసరిగా భద్రత, గోప్యతను పాటించాలని జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి ఆదేశించారు. ఐటికి సంబంధించిన అంశాల్లో సమయపాలన, భద్రతతోపాటు, ఖచ్చితమైన సమాచారం అందించాలని సూచించారు. జిల్లా స్థాయి ఎన్నికల శిక్షణా కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్‌లో ఐటి అప్లికేషన్లకు సంబంధించిన కార్యకలాపాలపె పవర్‌ పాయింట్‌ ద్వారా శిక్షణ ఇచ్చారు. సిపిఒ పి.బాలాజీ, డిఐఒ ఆర్‌.నరేంద్ర మాష్టర్‌ ట్రైనీలుగా వ్యవహరించి శిక్షణ ఇచ్చారు. వెబ్‌ కాస్టింగ్‌, ఇవిఎంల ర్యాండమైజేషన్‌, ఇటిపిబిఎస్‌, ఎన్నికల సిబ్బంది ర్యాండమైజేషన్‌, ఐటి స్టాఫ్‌ గురించి వివరించారు. యాప్‌ల వినియోగాన్ని వివరించారు. ఎన్నికల ముందు, ఎన్నికల సమయంలో, ఎన్నికలు పూర్తి అయ్యాక చేయాల్సిన కార్యకలాపాలు, వినియోగించాల్సిన యాప్స్‌పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, ఐటి అప్లికేషన్స్‌, యాప్స్‌లకు సంబంధించిన పాస్‌ వర్డ్స్‌ విషయంలో గోప్యత పాటించాలని, అనధికార వ్యక్తులు వినియోగించే అవకాశం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎన్నికలకోసం నియమించే కంప్యూటర్‌ ఆపరేటర్లతోపాటు, కార్యాలయాల్లో ఉన్న ఆపరేటర్లను కూడా దీనికి వినియోగించాలన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్‌ కలెక్టర్‌ వెంకట త్రివినాగ్‌, డిఆర్‌ఒ ఎస్‌డి అనిత, మెప్మా పీడీ సుధాకరరావు, ఎన్నికల సూపరింటిండెంట్‌ ప్రభాకర్‌, ఎన్‌ఐసి నుంచి బాలు, వివిధ నియోజకవర్గాల ప్రతినిధులు పాల్గొన్నారు.

➡️