కోలుకోలేని దెబ్బ

తుపాను ప్రభావంతో కురిసిన వర్షాలు అన్నదాతలను పూర్తిగా కుంగదీశాయి. పంట చేతికొచ్చే సమయంలో కోలుకోలేని రీతిలో దెబ్బతీశాయి. మిచౌంగ్‌ తుపాను కారణంగా గడిచిన మూడు రోజుల్లో కురిసిన భారీ వర్షాలకు వరి పంటకు ఎక్కువ నష్టం వాటిల్లింది. ఖరీఫ్‌ సీజన్లో వరిపంట ప్రధానమైనది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్లో వరి రైతులు నష్టపోయే పరిస్థితి కనిపిస్తోంది. ఇంతవరకు ప్రభుత్వం ఆఫ్‌లైన్‌లో కొనుగోలు చేసిన ధాన్యం ఒక శాతం కూడా ఉండదు. 90 శాతం మంది రైతుల పంట పొలాల్లో కుప్పలు, కోత కోయకుండా ఉంది. ప్రస్తుతం ధాన్యం రంగు మారే ప్రమాదం ఉండటంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

ప్రజాశక్తి-సాలూరు : మూడు రోజులపాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా సాలూరు నియోజకవర్గ పరిధిలో సాలూరు, పాచిపెంట, మక్కువ మండలాల్లో అధిక వర్షపాతం నమోదైంది. దీంతో కుప్పలు వేసిన రైతులు కూడా నష్టపోయే అవకాశం ఉంది. తుపాను ప్రారంభానికి ముందు ఆదరాబాదరాగా రైతులు వరి మడుల్లో కుప్పలు వేశారు. భారీ వర్షాలకు ఆ కుప్పలు కూడా తడిసి ముద్దయ్యాయి. అంతే కాకుండా కుప్పలచుట్టూ వరద నీరు చేరడంతో మడులు చెరువులను తలపించే విధంగా ఉన్నాయి. కోత చేయకుండా ఉన్న భూముల్లో కూడా వరి చేలు నేలకొరిగాయి. మడుగు నీటిలో వరిచేలు మునిగి ఉన్నాయి. దీంతో ఈ సీజన్లో రైతులు పండించిన వరి పంటలో 90 శాతం రంగు మారే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ప్రభుత్వం ప్రకటనలు చేస్తున్నా ఆచరణలో అది ఎంతవరకు అమలవుతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రంగు మారిన ధాన్యానికి, తేమ శాతం ఉన్న ధాన్యానికి నిర్దేశిత మద్దతుధర లభిస్తుందా? అనేది ప్రశ్నార్థకమే. తడిసిన ధాన్యం బాగా ఎండబెట్టిన తరువాత రైతులు విక్రయించాలి. ఎంత ఆరబెట్టినా ధాన్యం రంగు మారే అవకాశాలు మెండుగా ఉన్నాయి. దీంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ఎకరానికి రూ.25 వేలకు పైగా పెట్టుబడి పెట్టి పంట చేతికొచ్చిన సమయంలో తుపాను వారి వెన్ను విరించింది. కోత కోయని పొలాల్లో వరి చేలు నీటిలో మునిగిపోవడంతో చాలావరకు గింజలు భూమిలో పడిపోతాయి. దీని వల్ల కూడా రైతులకు ఆశించిన స్థాయిలో దిగుబడి రాదు. మక్కువ మండలంలో ఎకరానికి 33 బస్తాల ధాన్యం, పాచిపెంటలో 30 బస్తాలు, సాలూరు మండలంలో 28 బస్తాల ధాన్యం దిగుబడి వస్తుందని తుపానుకు ముందు అంచనా వేశారు. తుపాను కారణంగా కురిసిన భారీ వర్షాలకు వరి పంట నీటిలో మునిగిపోవడంతో దిగుబడి బాగా తగ్గిపోయే అవకాశం కనిపిస్తోంది.కొనుగోలు కేంద్రాలేవీ? రైతు భరోసా కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియ ఇంకా మొదలు కాలేదు. తుపాను ముప్పు ముంచుకొస్తున్న తరుణంలో అధికారులు రైతుల వద్ద మట్టించి సిద్ధంగా ఉన్న ధాన్యాన్ని ఆఫ్‌లైన్‌లో కొనుగోలు చేసి మిల్లులకు తరలించారు. ఈ విధంగా ఆఫ్‌లైన్‌లో సాలూరు మండలంలో 326 మెట్రిక్‌ టన్నులు, మక్కువలో 73 మెట్రిక్‌ టన్నులు, పాచిపెంటలో 11 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. తడిసిన ధాన్యం ఆరబెట్టి అమ్మకానికి సిద్ధం చేసేసరికి రైతులకు కొంత సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో అధికారికంగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభమనేది మరింత జాప్యమయ్యే అవకాశం ఉంది.వరి రైతులకు తీవ్ర నష్టంసాలూరు : వర్షాలతో పంట నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి జి.సంధ్యారాణి డిమాండ్‌ చేశారు. గురువారం టిడిపి మండల అధ్యక్షులు ఆముదాల పరమేష్‌తో కలిసి కూర్మరాజుపేటలో మునిగిపోయిన వరి పొలాలను ఆమె పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరి పండించిన రైతులు పూర్తిగా నష్టపోయారని చెప్పారు. ముడుకు లోతు నీటిలో వరి పొలాలు కనిపిస్తున్నాయని చెప్పారు. ఆమె వెంట టిడిపి నాయకులు ఎ.వెంకటనాయుడు, కోటేశ్వరరావు, సర్పంచ్‌ ఎ.నళిని ఉన్నారు.500 ఎకరాల్లో నష్టం అంచనా నియోజకవర్గంలో మూడు మండలాల్లో గడిచిన మూడు రోజుల్లో కురిసిన భారీ వర్షాలకు సుమారు 500 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. పూర్తి స్థాయిలో క్షేత్ర స్థాయిలో సిబ్బంది పరిశీలిస్తే నష్టం ఇంకా పెరిగే అవకాశం ఉంది.క్యాబేజీ రైతు కుదేలుప్రజాశక్తి-వీరఘట్టంఆరుగాలం కష్టించి సాగుచేసి పంట చేతికి అందివచ్చే తరుణంలో తుపాను ప్రభావం వల్ల క్యాబేజీ రైతులు కుదేలయ్యారు. మండల కేంద్రం వీరఘట్టంతోపాటు బూరుగ, కొట్టుగుమ్మడ , నడుకూరు, చిదిమి తదితర గ్రామాల్లో సుమారు 350 మంది కూరగాయల రైతులు 450 ఎకరాల్లో క్యాబేజీ పంట సాగు చేశారు. విత్తనాలు, ఎరువులు, కూలీలు, తదితర ఖర్చులు ఎకరాకు రూ.30 వేల వరకు పెట్టుబడి పెట్టినట్లు రైతులు చెబుతున్నారు. ఈ ఏడాది అక్టోబర్‌ 3 నుండి వర్షాలు పడకపోవడంతో పంట దిగుబడి అధికంగా లేనప్పటికీ బహిరంగ మార్కెట్లో ధర కూడా లేదని కూరగాయల రైతులు ఆవేదన చెందుతున్నారు. గతంలో 10 కిలోల క్యాబేజీ పువ్వు రూ.300 పలికేదని, ప్రస్తుతం రూ.150 కూడా రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పండిన పంట భువనేశ్వర్‌, విశాఖపట్నం, సిరిపురం, శ్రీకాకుళం, ఆమదాలవలస, పార్వతీపురం, తదితర ప్రాంతాలకు తరలించి విక్రయాలు చేయాల్సి వస్తోందని వాపోతున్నారు. ప్రస్తుతం తుపాను ప్రభావం వల్ల క్యాబేజీ పువ్వు చెమ్మచెరి, పురుగు పట్టి కుళ్లిపోవడం వల్ల తీవ్రంగా పంట నష్టం వాటిల్లినట్లు రైతులు జామి అప్పారావు, కర్రి గురు ప్రసాద్‌, కె.సింహాచలం, వెంకటి, తిరుపతిరావు, తదితరులు గగ్గోలు పెడుతున్నారు.

➡️