కోలుకోలేని దెబ్బ

Dec 7,2023 21:37

  రైతు ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి :  మిచౌంగ్‌ తుపాను రూపంలో రైతులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. నాలుగు రోజులుగా కురిసిన వర్షాలకు జిల్లాలో అపార పంటనష్టం వాటిల్లింది. ముఖ్యంగా వరి, మొక్కజొన్న తదితర పంటలు నీట మునిగాయి. పత్తిచేలు దెబ్బతిన్నాయి. మినుములు, పెసలు వంటి అపరాలు కూడా నీటిలో ఊరిపోతున్నాయి. గాలులకు జిల్లాలో అక్కడక్కడ ఉన్న బొప్పాయి చెట్లు నేలకొరిగాయి. వందలాది ఎకరాల్లో వరి పొలాల్లోనే ఉండిపోయింది. ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో అన్ని పంటలూ కలుపుకుని 2,83,912 ఎకరాల్లో సాగవ్వగా, అత్యధికంగా వరి 2,34,437 ఎకరాల్లో సాగైంది. ఇందులో సుమారు 1.53లక్షల ఎకరాల్లో వరికోతలు పూర్తైయినట్టు అధికారిక లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ఇందులో చాలా వరకు ఇంకా పొలాల్లోనే ఉంది. పంటపొలాలు జలమయం కావడంతో కొన్ని చోట్ల వరి దిబ్బలు, వోవులు కూడా జలదిగ్భందంలోనే ఉన్నాయి. కల్లాలకు చేరిన పంటలో కొంత నూర్పుకాగా, మరికొంత నూర్పుచేసేందుకు రైతులు ఎదురు చూస్తున్నారు. ఇటువంటి సమయంలో వచ్చిన తుపాను నాలుగు రోజులుగా రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేసింది. భోగాపురం మండలంలో 386 ఎకరాలు వరి నీటముగింది. మరో 224 ఎకరాల్లో వరి గాలి, ఎన్ను బరువెక్కడంతో పూర్తిగా నేలకొరిగింది. చీపురుపల్లి మండలంలో 125 ఎకరాలు నీట మునిగి పోయింది. గుర్ల మండలంలో 600 ఎకరాల్లో పంటనష్టం ఉంటుందని అంచనా. రేగిడి మండల వ్యాప్తంగా సుమారు 2,700 ఎకరాలు, నెల్లిమర్లలో 450 ఎకరాల మేర అతివృష్టి వెంటాడింది. మెరకముడిదాం, తెర్లాం మండల్లాల్లో 20 ఎకరాల చొప్పున, బాడంగిలో 14 ఎకరాలు చొప్పున నష్టం జరిగినట్టు ఇప్పటి వరకు ఉన్న అంచనా. ఇది పెరిగే అవకాశం ఉంది. ఇతర మండలాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. దీంతో, చేతికి అందినపంట వర్షార్పణ అయిపోతోందంటూ రైతులు కంటతడి పెడుతున్నారు. ముఖ్యంగా వరి దిబ్బలు, గట్లపై వేసిన ఓవులు ఇప్పటికీ జలదిగ్భందంలోనే ఉన్నాయి. కలాల్లోని ధాన్యం కూడా తడిసి ముద్దవ్వడంతో మొలకెత్తడం, రంగు మారిపోవడం వంటి పరిస్థితులు నెలకొంటు న్నాయి. ఇటువంటి వాటిని ప్రభుత్వం కొనుగోలు చేయకపోతే అప్పుల్లో కూరుకుపోవడమేనంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొక్కజొన్న సుమారు 5,271 ఎకకరాల్లో సాగైంది. అంతా 30 నుంచి 40రోజుల ఏపు దశలోవుంది.ఈ సమయంలో చేనులో నీరు నిల్వవుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. నీరు బయటకు పోయేందుకు అవకాశం లేనిచోట ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడనున్నాయి. వర్షాలు కొనసాగితే ఆ పంట కూడా తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని ఇటు రైతులు, అటు అధికారులు చెబుతున్నారు. పత్తి జిల్లా వ్యాప్తంగా 4364 ఎకరాల్లో సాగవ్వగా సుమారు 2వేల ఎకరాల్లో ఇంకా మూడో దశ ఏరివేత చేపట్టాల్సివుంది. ఏరివేతకు సిద్ధంగావున్న పత్తి అంతా నాలుగు రోజులుగా వర్షపునీటికి నానుతూ బరువెక్కింది. వర్షాలు కొనసాగితే మొక్కలు నేలకొరిగే ప్రమాదం కనిపిస్తోంది. మినుములు, పెసలు వంటి అపరాలు వేసిన మడుల్లోనూ నాలుగు రోజులుగా నీరు నిల్వవుండిపోవడంతో మొలకొత్తే పరిస్థితి లేదు. ఇప్పటికే నాటిన మెలకలు, మొక్కలు నీటిలో ఊరిపోతున్నాయి. మెరకముడిదాం మండలంలో 45 ఎకరాల్లోనూ, చీపురుపల్లిలో 75ఎకరాల్లోనూ నష్టం వాటిల్లింది. మరోవైపు పంట నష్టాలపై అధికారుల లెక్కలు కొలిక్కిరాలేదు. పంటనష్టం నాలుగు రోజులుగా జరుగుతున్నా క్షేత్ర స్థాయి పరిస్థితులపై ప్రాథమిక అంచనా కూడా రూపొందించక పోవడం గమనార్హం. దీన్నిబట్టి ఆర్‌బికె, సచివాలయ వ్యవస్థ ఎంత బలహీనంగా ఉందో చెప్పుకోవచ్చని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. పంటనష్టాన్ని 9వ తేదీ నుంచి అంచనా వేస్తామంటూ జిల్లా కలెక్టర్‌ ప్రకటించడంతో వ్యవసాయ, ఉద్యానశాఖ క్షేత్ర స్థాయి సిబ్బంది ప్రాథమిక అంచనాలు పంపడంలోనూ ఆలసత్వం ప్రదర్శిస్తున్నట్టుగా స్పష్టమౌతోంది. అంచనాలు వేస్తున్నాంఇంకా ప్రాథమిక అంచనాలు కొనసాగుతున్నాయి. శుక్రవారం అంచనాలు కొలిక్కివచ్చే అవకాశం ఉంది. వ్యవసాయ శాఖ సిబ్బంది అంతా ఇదే పనిలోవున్నాం. వరి పంట నష్టమే ఎక్కువగా జరిగింది. మిగిలిన పంటలు కొంతమేర పర్వాలేదు. విటి రామారావు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి

➡️