కోళ్లకే టిక్కెట్‌

Mar 22,2024 20:35

ఎ ట్టకేలకు ఎస్‌.కోట టిడిపి అభ్యర్థి ప్రకటన

కంగుతిన్న గొంప క్రిష్ట

రాష్ట్ర కార్యదర్శి పదవికి రాజీనామా

ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి/శృంగవరపుకోట  : ఎస్‌.కోట టిడిపి అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారికి అవకాశం దక్కింది. అధిష్టానం ఎట్టకేలకు శుక్రవారం ఆమె పేరును ప్రకటించింది. దీంతో, చాలా కాలంగా సీటు ఆశించి, కోళ్లకు పోటీగా పార్టీ కార్యక్రమాలు, సామాజిక కార్యక్రమాలు చేపట్టిన గొంప క్రిష్ట కంగుతిన్నారు. తీవ్ర మనస్థాపానికి గురైన ఆయన టిడిపి రాష్ట్ర కార్యదర్శి పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఇదే నియోజకవర్గం నుంచి స్వతంత్రంగా పోటీచేయనున్నట్టుగా కూడా ప్రకటించారు. భవిష్యత్తు పరిణామాలు ఎలా ఉంటాయో వేచి చూడాల్సివుంది. అభ్యర్థి లలిత కుమారి గతంలో 2 సార్లు ఎమ్మెల్యేగాను, ఒకసారి టిటిడి బోర్డు మెంబర్‌గాను పనిచేశారు. తాత కీర్తిశేషులు కోళ్ల అప్పలనాయుడు ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందగా, టిడిపి నుంచి రెండుసార్లు ఎన్నికయ్యారు. దేవాదాయ శాఖ మంత్రిగా సేవలందించారు. అదే వారసత్వంతో రాజకీయాల్లోకి లలితకుమారి వచ్చారు. ఈనేపథ్యంలో మరోసారి టిడిపి అధిష్టానం పోటీకి అవకాశం కల్పించింది. వాస్తవానికి రెండేళ్ల క్రితం వరకు గొంప క్రిష్ట విదేశాల నుంచి టిడిపి సహకరించారు. ఆ తరువాత టిడిపి రాష్ట్రనేతలే జిల్లాకు తీసుకొచ్చి ఎస్‌.కోట ఎమ్మెల్యే సీటుపై ఆశలు కల్పించారు. దీంతో, లలిత కుమారితో సమాంతరంగా కార్యక్రమాలు చేయడంతో చంద్రబాబు, లోకేష్‌ నియోజకవర్గ పర్యటనలతో లలిత కుమారితో సమానంగా ప్రాధాన్యతనిచ్చి స్టేజిలు కూడా ఎక్కించారు. దీంతో, క్రిష్ణతోపాటు ఆయన ఆనుయాయుల్లో ఆశలు పెరిగాయి. చివరకు టిక్కెట్‌ రాకపోవడంతో ఆయన అభిమానులు శుక్రవారం సాయంత్రం నిరసన తెలిపారు. ముఖ్యంగా వేపాడ మండలంలో నిరసనలు పెల్లుబికాయి. లలితకుమారి నేపథ్యం కోళ్ల లలితకుమారి కుటుంబం 50 ఏళ్లగా రాజకీయాల్లో ఉన్నారు. ఆమె తాత కోళ్ల అప్పలనాయుడు టిడిపి ఆవిర్భావం నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అంతకుముందు స్వతంత్రంగా రెండుసార్లు గెలిచారు. ఆయన వారసత్వాన్ని అందిపుచ్చుకున్న లలితకుమారి ఎస్‌.కోట నియోజకవర్గం నుంచి 2009, 2014లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. తాజా ఎన్నికలతో టిడిపి ఆధ్వర్యాన పదో సారి ఆ కుటుంబానికి ప్రాధాన్యత కల్పించినట్లు అయ్యింది.

➡️