కౌలు కోసం 8 నెలలుగా

Jan 31,2024 00:35

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : రాజధాని రైతులకు వార్షిక కౌలు చెల్లింపుల్లో ఏడునెలలుగా జాప్యం జరుగుతోంది. తమకు కౌలు చెల్లింపులు చేయాలని పలువురు రైతులు దాఖలు చేసిన పిటీషన్‌పై ఇటీవల హైకోర్టులో విచారణ జరిగింది. కౌలు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ గత నెలలో హైకోర్టు కేసును ఫిబ్రవరి నెలకు వాయిదా వేసింది. 2015లో భూ సమీకరణలో రాజధాని నిర్మాణం నిమిత్తం తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాల పరిధిలోని 29 గ్రామాలకు చెందిన 22,948 మంది రైతులు 33 వేల ఎకరాల భూమిని అప్పగించారు. వీరిలో కౌలు చెల్లింపునకు అర్హత కలిగిన భూముల్లో 28,128 ఎకరాలకు ఏటా రూ.183.17 కోట్లు కౌలు పరిహారం చెల్లించాల్సి ఉంది. 2019 వరకు ప్రతి ఏటా మేనెలలోనే కౌలు చెల్లించారు. 2020 నుంచి జాప్యం జరుగుతూ వస్తుంది. 2021, 2022లో కొంత జాప్యంజరిగినా ఎట్టకేలకు చెల్లించారు. 2023 మే నెలలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మీ కౌలు చెల్లింపునకు ఉత్తర్వులు జారీ చేశారు. కానీ ఇంత వరకుఈ నిధులను రైతుల ఖాతాల్లో జమచేయలేదు. ఎనిమిది నెలలుగా సిఆర్‌డిఎ అధికారులను కలుస్తున్నా సానుకూల ఫలితం లేదని రైతులువాపోతున్నారు. 2016 నుంచి 2019 వరకు మే నెలలో ప్రభుత్వం కౌలు చెల్లించింది. వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత 2020 నుంచి ప్రతి ఏటా జూన్‌ నుంచి ఆగస్టులోగా జమ చేస్తూ వచ్చారు. గత ఏడాది మే నెలలోనే ఉత్తర్వులు ఇచ్చినా ఇంత వరకు రైతుల ఖాతాల్లో వార్షిక కౌలు జమకాలేదు. సిఆర్‌డిఎకి భూములు అప్పగించిన రైతులకు 10 ఏళ్లపాటు ఏటా 10 శాతం పెంచేలా అప్పటి టిడిపి ప్రభుత్వం రాజధాని రైతులకు కౌలు సాయం ప్రకటించింది. మెట్ట భూములకు ఎకరాకు రూ.30 వేలు, మూడు పంటలు పండే జరీబు భూముల రైతులకు ఎకరాకు రూ.50వేలు కౌలు అప్పటి టిడిపి ప్రభుత్వం నిర్ధారించింది. ఈ మొత్తంపై ప్రతిఏటా 10 శాతం సొమ్ము పెంచి రైతుల ఖాతాల్లో జమ అయ్యేలా గత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ విధానాన్ని ప్రస్తుత ప్రభుత్వం కొనసాగిస్తున్నా చెల్లింపుల్లో తీవ్ర జాప్యం చేస్తోంది. 2021 నుంచి ప్రతి ఏటా కోర్టులో పిటీషన్‌ దాఖలు చేసిన తరువాతనే రైతులకు కౌలుసాయం అందిస్తున్నారు. రెండేళ్లుగా అసైన్డు రైతులకు కూడా కౌలు పరిహారం నిలిచిపోయింది. 29 గ్రామాల్లో 3వేల మంది అసైన్డు రైతులు ఉన్నారు. వీరి భూములు కూడా రాజధానికి తీసుకున్నారు. అయితే అసైన్డు భూముల అప్పగింతలో అక్రమాలు జరిగాయని సిఐడి అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ దర్యాప్తు పెండింగ్‌లో ఉండటం వల్ల 3 వేల మంది అసైన్డు రైతులకు కౌలు పరిహారం నిలిపివేశారు. భూములన్నీ రాజధాని నిర్మాణం నిమిత్తం సిఆర్‌డిఎకు ఇచ్చామని, తమకు కౌలు ఆదాయం తప్ప మరో ఆధారం లేకపోవడం వల్ల ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నామని రైతులు హైకోర్టులో దాఖలు చేసిన పిటీషన్‌లో పేర్కొన్నారు. పలుమార్లు విచారించిన హైకోర్టు కౌలు వెంటనే చెల్లించాలని ఇచ్చిన ఉత్తర్వులు ఇంతవరకు అమలుకు నోచలేదు.

➡️