కౌలు చెల్లింపులో ఎడతెగని జాప్యం!

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : రాజధాని రైతులకు వార్షిక కౌలు చెల్లింపుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. తమకు కౌలు చెల్లింపులు చేయాలని పలువురు రైతులు దాఖలు చేసిన పిటీషన్‌పై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. ప్రభుత్వాన్ని కౌంటర్‌ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించినా ఇప్పటి వరకు దాఖలు చేయలేదు. మరో మూడు వారాలు సమయం కావాలని ప్రభుత్వ న్యాయవాది కోరగా హైకోర్టు నిరాకరించింది. వచ్చే సోమవారం కల్లా వివరాలతో రావాలని ఆదేశించింది. ఈ ఏడాది మేనెలలో కౌలు చెల్లించాల్సి ఉండగా ఇంతవరకు ఇవ్వలేదు. ఈ మేరకు రైతులు గత నెలలోనే హైకోర్టును ఆశ్రయించారు. భూములన్నీ రాజధాని నిర్మాణం నిమిత్తం సిఆర్‌డిఎకు ఇచ్చామని, తమకు కౌలు ఆదాయం తప్ప మరో ఆధారం లేకపోవడం వల్ల ఆర్ధికంగా ఇబ్బంది పడుతున్నామని రైతులు తమ పిటీషన్‌లో పేర్కొన్నారు. గతంలో కొద్దిమంది రైతులు పిటీషన్‌ వేస్తే సంబంధిత రైతులకే కౌలు ఇచ్చి పిటీషన్‌ను మూసివేయించారని రైతులు గతనెలలో దాఖలు చేసిన పిటీషన్‌లో తెలిపారు. ఒకవైపు విశాఖలో ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తూ మరోవైపు తమకు రావాల్సిన కౌలు చెల్లింపులో ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగానే ఇబ్బందికి గురిచేస్తున్నట్టు రాజధాని రైతులు వాపోతున్నారు. అయితే ఈ ఏడాది మేనెలలో కౌలు ఇస్తున్నట్టు ఉత్తర్వులు ఇచ్చినా ఇప్పటి వరకు అమలుకు నోచుకోలేదు. 29 గ్రామాల పరిధిలో 22,948 మంది రైతులకు 28,128 ఎకరాల భూమికి రూ.183.17 కోట్లు కౌలు పరిహారం విడుదల చేస్తూ మే నెలలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మీ ఉత్తర్వులు జారీ చేశారు. కానీ ఇంత వరకుఈ నిధులను రైతుల ఖాతాల్లో జమచేయలేదు. ఆరు నెలలుగా సిఆర్‌డిఎ అధికారులను కలుస్తున్నా సానుకూల ఫలితం లేదని రైతులు వాపోతున్నారు. రైతుల నుంచి 33 వేల ఎకరాల భూమిని సిఆర్‌డిఎ 2015 జనవరి నుంచి డిసెంబరు వరకు భూ సమీకరణ ద్వారా రాజధాని నిర్మాణం నిమిత్తం తీసుకుంది. 2016 నుంచి కౌలు చెల్లింపులు ప్రారంభించింది. వార్షిక కౌలు అందచేయడంలో మూడేళ్లుగా తీవ్ర జాప్యం జరుగుతోంది. 2016 నుంచి 2019 వరకు ప్రతి ఏటా ఏప్రిల్‌ నుంచి మే చివరిలోగా వార్షిక కౌలు సొమ్ము రైతుల ఖాతాల్లో జమయ్యేది. వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత 2020 నుంచి ప్రతి ఏటా జూన్‌ నుంచి ఆగస్టులోగా జమ చేస్తూ వచ్చారు. ఈ ఏడాది మే నెలలోనే ఉత్తర్వులు ఇచ్చినా ఇంత వరకు రైతుల ఖాతాల్లో వార్షిక కౌలు జమకాలేదు. సిఆర్‌డిఎకు భూములు అప్పగించిన రైతులకు పదేళ్లపాటు ఏటా 10 శాతం పెంచేలా అప్పటి టిడిపి ప్రభుత్వం రాజధాని రైతులకు కౌలు సాయం ప్రకటించింది. మెట్ట భూములకు ఎకరాకు రూ.30 వేలు, మూడు పంటలు పండే జరీబు భూముల రైతులకు ఎకరాకు రూ.50 వేలు కౌలు అప్పటి టిడిపి ప్రభుత్వం నిర్ధారించింది. ఈ మొత్తంపై ప్రతిఏటా 10 శాతం సొమ్ము పెంచి రైతుల ఖాతాల్లో జవయ్యేలా గత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ విధానాన్ని ప్రస్తుత ప్రభుత్వం కొనసాగిస్తున్నా చెల్లింపుల్లో జాప్యం చేస్తోంది. 2021 నుంచి ప్రతిఏటా కోర్టులో పిటీషన్‌ దాఖలు చేసిన తరువాతనే రైతులకు కౌలుసాయం అందిస్తున్నారు. గత రెండేళ్లుగా అసైన్డు రైతులకు కూడా కౌలు పరిహారం నిలిచిపోయింది. 29 గ్రామాల్లో 3వేల మంది అసైన్డు రైతులు ఉన్నారు. వీరి భూములు కూడా రాజధానికి తీసుకున్నారు. అయితే అసైన్డు భూముల అప్పగింతలో అక్రమాలు జరిగాయని సిఐడి అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ దర్యాప్తు పెండింగ్‌లో ఉండటం వల్ల 3 వేలమంది అసైన్డు రైతులకు కౌలు పరిహారం నిలిపివేశారు.

➡️