కౌలు రైతుకు మొండిచేయి!

పెదకాకాని మండలం నంబూరులో తుపాను కారణంగా పొలంలో నిలిచిన నీటిని బయటకు పంపే ప్రయత్నంలో సాగుదారు (ఫైల్‌)
ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : గుంటూరు, పల్నాడు జిల్లాల్లో మిచౌంగ్‌ తుపాను ప్రభావంతో దెబ్బతిన్న పంటలను గుర్తించి సంబంధిత రైతులకు ఉదారంగా సాయం అందించాలనే ప్రభుత్వం పెద్దల మాటలు కార్యరూపం దాల్చడం లేదు. పంట నష్టం పరిశీలన, నివేదికలు రూపొందించిన అధికారులు వీటిని మంగళవారం నుంచి శుక్రవారం వరకు సచివాలయాల్లో రైతుల వివరాలను సోషల్‌ఆడిట్‌ పేరుతో ప్రచురించారు. అయితే వీటిలో ఎక్కువ మంది కౌలురైతుల పేర్లు కన్పించడం లేదు. గుంటూరు జిల్లాలో 38,283 మంది, పల్నాడు జిల్లాలో 52,819 మంది కౌలు రైతులకు సిసిఆర్‌సి కార్డులు ఇచ్చారు. సిసిఆర్‌సి పొందని రైతులు రెండు జిల్లాల్లో కలిపి మరో 80 వేల మంది వరకున్నారు. పంట నష్టం జరిగిన పంటలనుఈ-క్రాప్‌లో నమోదు చేసుకున్న రైతులనే అధికారులు పరిగణలోకి తీసుకున్నారు. దీంతో కొన్నిచోట్ల కౌలురైతులకు బదులు భూ యజమానులు పరిహారం పొందటానికి అర్హులయ్యారు. పెదనందిపాడు, కాకుమాను, మేడికొండూరు, ఫిరంగిపురం తదితర మండలాల్లో సిసిఆర్‌సి కార్డులు లేక ఎక్కువ మంది కౌలురైతులు పరిహారం పొందలేకపోయారని తెలిసింది. సిసిఆర్‌సికి అంగీకరించని భూ యజమానులు సంబంధిత పొలంలో సాగు చేసిన పంట వివరాలను తమ పేరుతో ఈ-క్రాప్‌ నమోదు చేయించుకున్నారు. పంట నష్ట పరిహారం రైతుల ఖాతాలలో జమ అయితే వారు కౌలు రైతుకు ఈ సొమ్ము ఇవ్వడం ధర్మం అని అధికారులు చెబుతున్నారు. సిసిఆర్‌సిలు లేని వారి పేర్లును నమోదు చేయలేమని అధికారులు ఖరాఖండిగా చెప్పారు. కొంత మంది రైతులకు సంబంధించి కౌలు కొంత భూమి, సొంతంగా కొంత భూమి సాగు చేశారు. పూర్తిగా కౌలుకు భూమి తీసుకుని సాగు చేసిన వారు ఉన్నారు. వీరిలో ఎక్కువ మందికి సిసిఆర్‌సి కార్డులు లేవు. వాస్తవంగా పొలంలో ఏ రైతుంటే ఈ రైతును సర్వే నంబరు, ఆధార్‌ కార్డు ప్రకారం నమోదు చేయాలని ప్రభుత్వం చెబుతోంది. భూ యజయాని కంటే కౌలు రైతులకు పెట్టుబడి ఎక్కువ అవుతోంది. కౌలు, ఇతర పెట్టుబడి కలిపి వరికి ఎకరానికి రూ.50 వేలకు పైగా పెట్టుబడి పెట్టారు. మిర్చికి లక్ష వరకు పెట్టుబడి పెట్టారు. రెండు జిల్లాల పరిధిలో 1.40 లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం జరిగినట్టు అధికారులు నిర్ధారించారు. శనగ పంట ప్రాథమిక దశలో ఉన్నందున పరిహారం వచ్చే అవకాశం లేదని అధికారులు తెలిపారు. రెండు జిల్లాల పరిధిలో 30 వేల ఎకరాల్లో శనగ సాగు చేయగా తిరిగి వారికి విత్తనాలు 80 శాతం సబ్సిడీతో అందిస్తామని చెబుతున్నారు. ఎకరాకు రూ.10 వేల వరకు పెట్టుబడి పెట్టిన శనగ రైతులకు నిరాశ మిగిలింది. పత్తిపంటకు భారీ నష్టం జరిగినా అతి తక్కువగా చూపారు. పల్నాడు జిల్లాతోపాటు గుంటూరు జిల్లాలోని మేడికొండూరు, ఫిరంగిపురం, ప్రత్తిపాడు, వట్టిచెరుకూరు, పెదనందిపాడు, చేబ్రోలు, పెదకాకాని, తాడికొండ తదితర ప్రాంతాల్లో అధిక వర్షం వల్ల పత్తికి నష్టం జరిగింది. కేవలం ఐదు వేల ఎకారల్లోనే నష్టం జరిగినట్టు అంచనా వేశారు. ప్రధానంగా నష్టం అచనాల నమోదులో జాప్యం కారణంగా పత్తికి జరిగిన నష్టాన్ని అధికారులు గుర్తించలేకపోయారు. కాయ, పూత రాలింది. నేలావాలడంతోపాటు నాణ్యతా తగ్గింది. అయినా నష్టం నమోదు కాలేదు.

➡️