క్రమశిక్షణతోనే బంగారు భవిష్యత్‌

Feb 11,2024 20:10

 ప్రజాశక్తి-గజపతినగరం :  విద్యార్థులు క్రమశిక్షణతోనే బంగారు భవిష్యత్‌కు బాటలు వేసుకోవాలని ప్రముఖ జీవన నైపుణ్యాల నిపుణులు జట్లీ అన్నారు. మరుపల్లిలోని బాలాజీ పాలిటెక్నిక్‌ కళాశాలలో ఆదివారం మోడల్‌ పాలిసెట్‌ పరీక్ష జరిగింది. దీనికి పదోతరగతి చదువుతున్న సుమారు వెయ్యి మంది విద్యార్థులు హాజరయ్యారు. పరీక్ష అనంతరం నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి జట్టి ముఖ్యఅతిథిగా విచ్చేసి విద్యార్థులకు ఆత్మవిశ్వాసం పెంపొందించుకుని విజయాలు సాధించే ప్రక్రియ నేర్పించారు. ఉన్నత లక్ష్యాలు సాధించాలంటే ఉత్తమ క్రమ శిక్షణ కలిగి ఉండాలన్నారు. పబ్లిక్‌ పరీక్షల పట్ల ఆందోళన విడిచి సాధన చేయాలన్నారు. తల్లి తండ్రుల విలువ తెలుసుకుని , వారిని భక్తితో చూసుకోవాలని జట్లి పిలుపు నిచ్చారు. రిటైల్‌ మేనేజ్మెంట్‌ ఆఫీసర్‌ మొహమ్మద్‌ షరీఫ్‌ మాట్లాడుతూ అత్యంత కింది స్థాయి నుంచి తాను పైకి వచ్చినట్లు పేర్కొన్నారు. అలాగే ఇప్పటి వరకు పట్టుదలతో 15 దేశాలు వరల్డ్‌ టూర్‌ బైక్‌ పై చేసినట్లు విద్యార్థులకు స్ఫూర్తి నింపారు.ఎవరెస్ట్‌ పర్వత రోహన కు చేసిన సాధన జీవితంలో ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు. బాలాజీ విద్యాసంస్థలు డైరెక్టర్‌ రెడ్డి చంద్ర శేఖర్‌, రెడ్డి పావని మాట్లాడుతూ ఇప్పటివరకు 10 ప్రముఖ కంపెనీలతో ఎంఒయు కుదుర్చుకుని రెండు వేలకు పైగా ఉద్యోగాలు కల్పించినట్లు పేర్కొన్నారు. కాలేజి ప్రిన్సిపల్‌ , ఫ్యాకల్టీ తదితరులు పాల్గొన్నారు

➡️