క్రీడా రంగానికి పెద్ద పీట : డిప్యూటీ సిఎం

ప్రజాశక్తి – కడప ముఖ్యమంత్రి వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వంలో క్రీడా రంగానికి పెద్ద పీట వేసి ప్రతిభావంతులైన క్రీడాకారులను వెలుగులోకి తీసుకురావడమే లక్ష్యంగా ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలను నిర్వహిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి ఎస్‌ బి అంజాద్‌ బాషా, నగర మేయర్‌ కే. సురేష్‌ బాబు సంయుక్తంగా పేర్కొన్నారు. మంగళవారం స్థానిక క్రీడా ప్రాధికారత మైదానం (మున్సిపల్‌ స్టేడియం)లో ఆడుదాం ఆంధ్ర టోర్నమెంట్‌ను ప్రారంభించారు. ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేనివిధంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో గ్రామీణ క్రీడాకారులను వెలుగులోకి తీసుకురావడానికి వారి ప్రతిభను చూపడానికి ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ క్రీడా పోటీలు ఈనెల 26 నుంచి ఫిబ్రవరి 10 వరకు నిర్వహిస్తారని తెలిపారు. ముఖ్యమంత్రి వై.ఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వంలో అన్ని రంగాలకు ప్రాధాన్యతనిస్తూ రాష్ట్రంలో అభివద్ధి, సంక్షేమం సమపాళ్లలో చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలు దేశంలో ఎక్కడా లేనివిధంగా 47 రోజులపాటు సచివా లయ పరిధి నుంచి రాష్ట్రస్థాయి వరకు క్రీడా సంబరాలను నిర్వహి స్తారన్నారు. ఈ క్రీడా పోటీలు ఐదు అంశాలలో క్రికెట్‌, బాడ్మింటన్‌, వాలీబాల్‌, కబ్బడి, ఖోఖో విభాగాల్లో నిర్వహిస్తారని చెప్పారు. కడప నగరాన్ని క్రీడా హబ్‌ గా తీర్చిదిద్దుతామని అన్నారు. మున్సిపల్‌ కమిషనర్‌ సూర్య సాయి ప్రవీణ్‌ చంద్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు. తొలుత జ్యోతి ప్రజ్వలన గావించి ప్రార్థన గీతంతో కార్యక్రమాన్ని ప్రారం భించారు. అనంతరం జాతీయ పతాకావిష్కరణను, క్రీడల పతాక ఆవిష్కరణను చేశారు. అలాగే క్రీడాజ్యోతిని వెలిగించారు. కార్యక్రమంలో రాష్ట్ర సోషల్‌ వెల్ఫేర్‌ బోర్డు చైర్మన్‌ పులి సునీల్‌ కుమార్‌, డిప్యూటీ మేయర్‌ నిత్యానందరెడ్డి, ముంతాజ్‌ బేగం, స్థానిక కార్పొరేటర్‌ సూర్యనారాయణ రావు, ఇతర కార్పొరేటర్లు, మార్కెట్‌ యార్డు చైర్మన్‌ బంగారు నాగయ్య యాదవ్‌, వైస్‌ చైర్మన్‌ సయ్యద్‌ ఇబ్రహీం మియా, నాయకులు అఫ్జల్‌ ఖాన్‌, నారపురెడ్డి సుబ్బారెడ్డి ఇతర నాయకులు వివిధ క్రీడాల అసోసియేషన్‌ అధ్యక్షులు, కోచులు, క్రీడాకారులు పాల్గొన్నారు.

➡️