క్రీడా స్ఫూర్తితో పోటీలను కొనసాగించాలి

Dec 17,2023 00:19
కాకినాడ జెఎన్‌టియుకె

ప్రజాశక్తి – గండేపల్లి

గెలుపు, ఓటమిలతో సంబంధం లేకుండా ప్రతీ ఒక్క క్రీడాకారుడు క్రీడా స్ఫూర్తితో పోటీల్లో పాల్గొనాలని జెఎన్‌టియుకె ఇంటర్‌ కాలేజ్‌ సెక్రటరీ డాక్టర్‌ జిపి.రాజు పిలుపునిచ్చారు. సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్‌ ప్రాంగణంలో కాకినాడ జెఎన్‌టియుకె సెంట్రల్‌ జోన్‌ పరిధిలోని కళాశాలల ”అథ్లెటిక్‌ ఛాంపియన్‌ షిప్‌ -2023-2024” పోటీలు శనివారం ఘనంగా ప్రారంభ మయ్యాయి. జాతీయ పతాకం ఆవిష్కరణతో ప్రారంభమైన ఈ కార్యక్రమం ఆదిత్య క్యాంపస్‌ డైరెక్టర్‌, ఆదిత్య ఇంజనీరింగ్‌ కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ ఎమ్‌.శ్రీనివాస్‌ రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిబంధనలకు లోబడి నిష్ణాతులైన న్యాయనిర్ణేతల సమక్షంలో రెండు రోజులపాటు ఈ క్రీడాకారులు జరుగుతున్నాయని, తమ ప్రతిభకు పదును పెట్టి మంచి ఫలితాలు సాధించాలన్నారు. టోర్నమెంట్‌ పరిశీలకులు, అథ్లెటిక్‌ కోచ్‌ పిపివి.ప్రసాద్‌ రెడ్డి మాట్లాడుతూ జెఎన్‌టియుకె పరిధిలో అన్ని రకాల సదుపాయాలు ఆదిత్య కళాశాలలో ఉన్నాయని, ఎటువంటి ఖర్చుకు యాజమాన్యం వెనకాడకుండా అన్ని వసతులు సమకూర్చడమే కాకుండా చక్కటి భోజన వసతులు ఏర్పాటు చేసిందని అన్నారు. అధ్యక్షత వహించిన డాక్టర్‌ ఎమ్‌.శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ జెఎన్‌టియుకె పరిధిలో నిర్వహించిన 11 ఛాంపియన్‌ షిప్‌ పోటీల్లో 10 సార్లు ఆదిత్య ఆతిథ్యం ఇవ్వడం గర్వకారణంగా ఉందన్నారు. డాక్టర్‌ ఎం.శ్రీనివాస రెడ్డి క్రీడా జ్యోతిని వెలిగించి పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రతినిధులు డాక్టర్‌ డోలా సంజరు ఎస్‌, డాక్టర్‌ ఆదిరెడ్డి రమేష్‌, జివి.ప్రతాప్‌ రెడ్డి, డీన్‌ జెడి.వెంకటేష్‌, ఆదిత్య ఇంజనీరింగ్‌ కళాశాల గ్రంథాలయ అధికారి కె.అశోక్‌కుమార్‌ పాల్గొన్నారు.

➡️