ఖాళీ స్థలం కనిపిస్తే కబ్జా

Dec 10,2023 20:51

ప్రజాశక్తి-బొబ్బిలి  :  మున్సిపాలిటీలో ఖాళీ స్థలం కనిపిస్తే చాలు కబ్జా చేసేస్తున్నారు. నిన్నటి వరకు ఇందిరమ్మ కాలనీ, అమ్మిగారి కోనేరుగట్టు స్థలాలను అక్రమించేసి కొంతమంది అక్రమార్కులు సొమ్ము చేసుకోగా నేడు ఐటిఐ కాలనీ సమీపంలో జగనన్న కాలనీ వద్ద స్థలంపై అక్రమార్కులు కన్నుపడింది. రూ. కోట్లు విలువ చేసే ఈ స్థలాన్ని చదును చేసి ఆక్రమణకు పాల్పడుతున్నారు. ప్రభుత్వ స్థలాలను కాపాడాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి.గతంలో అమ్మిగారి కోనేరుగట్టుపై అధికార పార్టీకి చెందిన నేతలు అండదండలతో స్థలాలను అక్రమించేసి ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు. కోనేరుగట్టుపై అక్రమ నిర్మాణాలను ఆపాలని గతంలో పని చేసిన ఆర్‌డిఒ పి.శేషశైలజ ఆదేశించినప్పటికి అధికార పార్టీ నేతల అండదండలు ఉండడంతో అక్రమ నిర్మాణాలకు అధికారులు అడ్డుకట్ట వేయలేకపోయారు. ఇందిరమ్మ కాలనీలో కూడా ఖాళీ స్థలాలు అధికార పార్టీ నేతల అండదండలతో ఆక్రమణలు జరుగుతున్నాయి. ఒక విఆర్‌ఒ సహాయంతో ఆక్రమణ స్థలాలకు నకిలీ పట్టాలు తయారు చేసి అమ్ముకుంటున్నట్లు ఆరోపణలు రావడంతో తహశీల్దార్‌ డోల రాజేశ్వరరావు నాలుగు బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేశారు. దర్యాప్తులో నకిలీ పట్టాలు, స్థలాల ఆక్రమణ బయటపడడంతో దర్యాప్తు ఆపాలని అధికారులపై అధికార పార్టీ నేతలు ఒత్తిడి చేయడంతో అర్దాంతరంగా దర్యాప్తు నిలిపివేశారు. దీంతో ఆక్రమణదారులు ప్రభుత్వ స్థలాలను అక్రమించేసి ఒకొక్క స్థలాన్ని రూ.2లక్షల నుంచి రూ.3లక్షల వరకు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారని విమర్శలు వస్తున్నాయి.నేడు జగనన్న కాలనీ వద్ద ఆక్రమణలుతాజాగా ఐటిఐ కాలనీ సమీపంలో ప్రభుత్వం నూతనంగా వేసిన జగనన్న కాలనీ లేఅవుట్‌ వద్ద ఖాళీ స్థలంపై అక్రమార్కులు కన్ను పడింది. ఉర్దూ పాఠశాల ప్రహరీ గోడకు అనుసరించి ఉన్న ఖాళీ స్థలాన్ని అధికార పార్టీకి చెందిన కొంతమంది నాయకులు చదును చేసి అక్రమించేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇక్కడ స్థలం చదరపు గజం రూ.10వేలు వరకు ధర పలుకుతుంది. సుమారు 1500 చదరపు గజాలు విస్తీర్ణం ఉన్న ఈ స్థలాన్ని కొందరు అక్రమించేందుకు స్థలాన్ని చదును చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వ స్థలాన్ని అక్రమిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు, వామపక్ష నేతలు డిమాండ్‌ చేస్తున్నారు.

➡️