గంగవరం పోర్టు వాహనాలతో ఇబ్బందులపై వినతి

 ప్రజాశక్తి -గాజువాక : గంగవరం పోర్టు వాహనాలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరిస్తూ వార్వా, నివాస్‌, జన విజ్ఞాన్‌ వేదిక నాయకులు మంగళవారం గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డికి వినతిపత్రం అందజేశారు. గంగవరం పోర్టు, స్టీల్‌ప్లాంట్‌ నుంచి భారీ వాహనాలు వై.జంక్షన్‌, జగ్గు జంక్షన్‌ మీదుగా రాకపోకలు సాగిస్తున్నాయని తెలిపారు. ఈ భారీ వాహనాలు దుమ్ము, ధూళి, రసాయనాలను వెదజల్లుతూ ప్రాథమిక ఆరోగ్యం కేంద్రం, కోర్టుల సముదాయం, జివిఎంసి జోనల్‌ కార్యాలయం, మండల రెవెన్యూ ఆఫీసు, తదితర ప్రభుత్వ కార్యాలయాల మీదుగా నగరానికి చేరుతున్నాయని వివరించారు. దీనివల్ల 71, 72, 76 వార్డుల కాలనీల్లో ప్రజల ఆహార పదార్థాలు, మంచి నీరు కలుషితమవుతున్నాయని తెలిపారు. చిన్న వాహనదారులు, పాదచారులు అనేక ప్రమాదాలకు గురవుతున్నారని వివరించారు. అక్టోబర్‌ నెలలో 76వ వార్డు గోపాల్‌రెడ్డి నగర్‌కు చెందిన ఓ మహిళ ఈ భారీ వాహనాల ప్రమాదంతో మృతిచెందిన విషయాన్ని గుర్తుచేశారు. గతంలో కూడా ప్రమాదాల్లో పలువురు మృతి చెందారని వివరించారు. ప్రజల ఆరోగ్యం, ప్రాణాలను దృష్టిలో పెట్టుకొని ఈ భారీ వాహనాలను దారి మళ్లించాలని కోరారు. దీనిపై ఎమ్మెల్యే నాగిరెడ్డి స్పందిస్తూ భారీ వాహనాలను ప్రత్యామ్నాయ మార్గం ద్వారా మళ్లించేందుకు త్వరలో చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో వాయిస్‌ ఆఫ్‌ గాజువాక నాయకులు చిక్కా సత్యనారాయణ, బి.త్రినాధ్‌స్వామి, హేమంత్‌, వార్వా, నివాస్‌ సంఘం గౌరవాధ్యక్షులు డాక్టర్‌ రమేష్‌ కుమార్‌, నాయకులు కె.కిరీటం, జన విజ్ఞాన వేదిక విశాఖ జిల్లా అధ్యక్షులు ఎస్‌వికె.పరశురాం తదితరులు ఉన్నారు.

 

➡️