గడ్డితిని బతకాలా!

Jan 5,2024 20:07

  ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ :  వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత ధరలు 300 శాతం పెరిగితే, మున్సిపల్‌ కార్మికుల జీతం 24 శాతం మాత్రమే పెరిగిందని, ప్రస్తుత ధరల్లో కార్మికుల గడ్డితిని బతకాలా అంటూ మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ (సిఐటియు) రాష్ట్ర కమిటీ సభ్యులు ఎ.జగన్మోహన్‌రావు, సిఐటియు నగర కార్యదర్శి బి.రమణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మున్సిపల్‌ పారిశుధ్య కాంట్రాక్టు కార్మికులు చేపట్టిన సమ్మె శుక్రవారం నాటికి 11వ రోజుకు చేరుకుంది. నగర పాలక సంస్థ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన సమ్మె శిబిరంలో కార్మికులంతా గడ్డితింటూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నెల్లిమర్ల, రామతీర్థాలు, ముషిడిపల్లి మాస్టర్‌ పంప్‌ హౌస్‌ కార్మికులకు నెల జీతం రూ.11వేలు ఇచ్చి శ్రమదోపిడీ చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. జీవో నెంబర్‌ 7 ప్రకారం 18వేలు జీతం చెల్లించాలని, మెన్‌, మెటీరియల్‌ వేరు చేస్తూ కౌన్సిల్‌లో తీర్మానం చేయాలని డిమాండ్‌ చేశారు. అధికారులకు, ప్రజాప్రతినిధులకు, కార్పొరేటర్లకు వినతి పత్రాలు ఇస్తామని, స్పందించకపోతే జనవరి 6 తర్వాత ఏ రోజు నుంచైనా మంచినీటి పంపింగ్‌ బంద్‌ చేసి సమ్మెలోకి వెళ్తామని ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం సమ్మెను విచ్ఛిన్నం చేస్తున్న కుట్రలను ఖండిస్తూ జనవరి 6న మున్సిపల్‌ కార్యాలయాల వద్ద, జనవరి 8న కలెక్టరేట్‌ వద్ద జరిగే ధర్నాలకు ఎఐటియుసి (అనుబంధ కార్మిక సంఘం) కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. సమ్మెకు సిపిఎం నగర కార్యదర్శి రెడ్డి శంకరరావు, రెల్లి కులస్తుల సంక్షేమ సంఘం నాయకులు సోము మురళి విజరు మద్దతు ప్రకటించారు. మున్సిపల్‌ యూనియన్‌ నాయకులు భాస్కరరావు, రజిని, రామచంద్రరావు, కుమారి ,రాఘవ ,మురళి , అరుణు గౌరీ అర్జున్‌ మజ్ను కష్ణమ్మ లక్ష్మి, అప్పయమ్మ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.మోకాళ్లపై నిల్చొని నిరసనఎఐటియుసి అనుబంధ సంఘం కార్మికులు నగర పాలక సంస్థ కార్యాలయం ఎదుట నిరసన శిబిరంలో మోకాళ్ళపై నిలబడి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆసంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రంగరాజు,బుగత అశోక్‌ మాట్లాడారు.

➡️