గాంధీ ఆశయాల్లో నడవాలి

Jan 30,2024 21:21

ప్రజాశక్తి – బలిజిపేట: దేశానికి స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టి జాతి గౌరవాన్ని కాపాడిన బాపూజీ గాంధీజీ కన్న కలలు ఆశయాలు నెరవేరాలంటే బాలలు క్రమశిక్షణతో మెలిగి ఆయన ప్రధాన ఆయుధాలైన అహింస, సత్యాగ్రహాలను ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని రెడ్‌క్రాస్‌ రాజాం యూనిట్‌ చైర్మన్‌ కొత్తా సాయి ప్రశాంత్‌ కుమార్‌ అన్నారు. బాపూజీ వర్థంతి సందర్భంగా మండలంలోని వంతరాం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన గాంధీ విగ్రహానాన్ని ఆయన మంగళవారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎందరో స్వాతంత్ర సమరయోధులకు స్ఫూర్తినిచ్చేలా గాంధీజీ మెలిగి మహాత్మా అనే బిరుదు సాధించారన్నారు. అనునిత్యం గాంధీజీ ఆశయాలు రూపుదిద్దుకొనేలా బాలల మెలగాలని ఆకాంక్షించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు రమణారావు మాట్లాడుతూ బాల్యం నుంచే పిల్లలు మంచి అలవాట్లు నేర్చుకుని స్నేహపూర్వక వాతావరణంలో పెరగాలని విద్య పట్ల మాత్రమే పోటీ తత్వం ఉండాలని హింసను ప్రేరేపించకూడదని అన్నారు. గాంధీజీ అహింస అనే సూత్రం ద్వారా దేశానికి స్వాతంత్రం తెచ్చి పెట్టారన్నారని ఉపాధ్యాయులు కృష్ణారావు, అప్పలస్వామి తెలిపారు. గాంధీజీ విగ్రహానికి వేదిక నిర్మించేందుకు సహకరించిన పాఠశాల విద్యా కమిటీ వైస్‌ చైర్మన్‌ వారాడ అప్పలనాయుడు, జగన్నాధరావును పాఠశాల సిబ్బంది అభినందించారు. కార్యక్రమంలో రెడ్‌ క్రాస్‌ కో-కన్వీనర్‌ పెంకి చైతన్యకుమార్‌, ఉల్లాకుల నీలకంఠేశ్వరయాదవ్‌, కొల్లూరు తిరుమలేశ్వరారావు తదితరులు పాల్గొన్నారు.

➡️