గాంధీ స్ఫూర్తితో రాజ్యాంగాన్ని రక్షించుకుందాం

Jan 30,2024 21:05

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌  :   గాంధీ స్ఫూర్తితో రాజ్యాంగ రక్షణకు ప్రజంతా ఐక్యంగా ఉద్యమించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ పిలుపునిచ్చారు. గాంధీ వర్ధంతి సందర్భంగా మంగళవారం స్థానిక ఎల్‌బిజి భవనంలో జరిగిన కార్యక్రమంలో ముందుగా గాంధీ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 77ఏళ్ల స్వాతంత్య్ర భారతావని మతస్వేచ్చ, వాక్‌ స్వాతంత్య్రం, లౌకిక, ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా అవతరించిందని తెలిపారు. కానీ వీటన్నింటినీ కల్పించిన రాజ్యాంగానికి ప్రమాదం వచ్చిందని, రాజ్యాంగంలో లౌకిక తత్వం అనే పదాన్ని తొలగించాలని ఎన్‌డిఎ ప్రభుత్వం చేసిన నిర్ణయం వెనుక కుట్ర దాగుందని అన్నారు. రాజకీయాల్లోకి మతాన్ని తీసుకురావడం సరైనది కాదని అన్నారు. ఇప్పటికే పౌర సత్వం చట్ట సవరణ చేసి సిఎఎ చట్టాలు తెచ్చిన ఎన్‌డిఎ, బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ మనువాద సిద్ధాంతాన్ని తిప్పికొట్టాలన్నారు. అప్పుడే రాజ్యాంగాన్ని రక్షించుకోగలమని అన్నారు. రాజ్యాంగ రక్షణ కోసం గాంధీ గారి స్ఫూర్తి తో దేశ ప్రజలంతా ఐక్యంగాఉద్యమించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో. సిపిఎం నగర కార్యదర్శి రెడ్డి శంకర్రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పి.రమణమ్మ, కెవిపిఎస్‌ జిల్లా కార్యదర్శి అర్‌.ఆనంద్‌, ఐద్వా జిల్లా అధ్యక్షులు పుణ్యవతి, కార్యదర్శి లక్ష్మి, డివైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు హరీష్‌, నాయకులు సతీష్‌ పాల్గొన్నారు.

 

 

➡️