గిరిజనాభివృద్ధికి పెద్దపీట

Jan 31,2024 21:26

ప్రజాశక్తి – సీతంపేట  : గిరిజన సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని పాలకొండ ఎమ్మెల్యే పి.కళావతి అన్నారు. బుధవారం స్థానిక వైటిసిలో మండల సర్వసభ్య సమావేశం ఎంపిపి బిడ్డిక ఆదినారాయణ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గిరిజన గ్రామాల అభివృద్ధికి అధికారులు సహకరించాలని కోరారు. ఆరోగ్యశ్రీ కార్డులు అందించాలని సర్పంచుల ఆదిలక్ష్మి, సుందరమ్మ సభ దృకి తీసుకువచ్చారు. మర్రిపాడు వైద్యాధికారి సాయి చరణ్‌ కొత్తవి ఇంకా రాలేదని సమాధానమిచ్చారు. దోనుబాయి సర్పంచ్‌ వెంకనాయుడు మాట్లాడుతూ జగనన్న ఆరోగ్య సురక్ష జరగడంలేదని సభ దృష్టికి తీసుకొచ్చారు. సబ్సిడీ యంత్రాలు వ్యవసాయ శాఖలో ఇవ్వడం లేదని విత్తనాలు ఆలస్యంగా వచ్చాయని గొయిది ఎంపిటిసి హరిబాబు సభ దృష్టికి తీసుకొచ్చారు. మండల వ్యవసాయాధికారి శ్రీదేవి మాట్లాడుతూ మూడేళ్లుగా సబ్సిడీ పనిముట్లు, యంత్రాలు రావడంలేదని తెలిపారు. రెవెన్యూ శాఖ ద్వారా 242 పట్టాలు ఇచ్చామని డిప్యూటీ తహశీల్దార్‌ నాగేంద్రకుమార్‌ తెలిపారు. భూములు రీసర్వే చేయాలని పెద్దూరు సర్పంచ్‌ ఆదిలక్ష్మి అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. ధారపాడు సర్పంచ్‌ సుందరమ్మ, ఎంపిటిసి సభ్యులు కోటేశ్వరరావు గ్రామాల్లో భూ ముటేషన్‌ జరగడం లేదన్నారు. ఎంపిపి ఆదినారాయణ మాట్లాడుతూ మండలంలో ఎక్కడా జరగడం లేదని చెప్పారు. డిటి మాట్లాడుతూ సిగల్‌ సమస్య ఉందని తెలిపారు. ధారపాడు సర్పంచ్‌ సుందరమ్మ మాట్లాడుతూ నాడు-నేడులో అంగన్వాడీ భవనాలు పునాదులుకే పరిమితమయ్యాయని అధికారులను నిలదీశారు. కార్యక్రమంలో మండలానికి సంబంధించిన ప్రధాన సమస్యలను వివిధ శాఖల వారీగా సమీక్షించారు. సమావేశంలో జెడ్పీటీసీ లక్ష్మి, వైస్‌ ఎంపిపి విజయలక్ష్మి, ఎఎంసి చైర్మన్‌ మోహన్‌రావు, ఎంపిటిసి చంద్రశేఖర్‌, పగడాలమ్మ సర్పంచ్‌ కళావతి, ఎంపిడిఒ గీతాంజలి, ఇఒపిఆర్‌డి సత్యం, డిఇ కృష్ణకుమార్‌, వైద్యాధికారులు భానుప్రతాప్‌, సాయిచరణ్‌, జెఇలు పాపారావు, కిరణ్‌ కుమార్‌, నాగభూషణం, సిడిపిఒ రంగలక్ష్మి, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.

➡️