గుంటూరు ఛానల్‌ను ఆధునీకరిస్తాం

మాట్లాడుతున్న చంద్రబాబునాయుడు
ప్రజాశక్తి – గుంటూరు జిల్లాప్రతినిధి/పెదనందిపాడు : నల్లమడ డ్రెయిను, గుంటూరు ఛానల్‌ను ఆధునీకరించి ముంపు నుంచి కాపాడతామని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. శనివారం రాత్రి ఆయన పెదనందిపాడు ప్రాంతంలో పర్యటించారు. తుపాను వల్ల నష్టపోయిన పొలాలను పరిశీలించారు. మధ్యాహ్నం 3 గంటలకు పెదనందిపాడు రావాల్సి ఉండగా రాత్రి 10 గంటల ప్రాంతంలో వచ్చారు. పెదనందిపాడులో ప్రజలు పెద్దసంఖ్యలో తరలి వచ్చారు. ప్రత్యేక వాహనంపై చంద్రబాబు పెదనందిపాడులో పర్యటించారు. ప్రజలకు అభివాదం చేసుకుంటూ ముందుకు సాగారు. వాహనం వద్ద రైతులు తుపాను వల్ల దెబ్బతిన్న మిర్చి పైరును తీసుకువచ్చి చంద్రబాబుకు చూపారు. నాలుగున్నర ఏళ్లుగా డ్రైనేజి వ్యవస్థను పట్టించుకోకపోవడం వల్ల పంటలకు అపారనష్టం జరిగిందని రైతులు చంద్రబాబు దృష్టికి తీసుకు వచ్చారు. వైసిపి హయంలోరైతులకు న్యాయం జరగడం లేదని తెలిపారు. ప్రత్తిపాడుకు చెందిన సాంబశివరావు మాట్లాడుతూ టిడిపి వచ్చిన తరువాత రైతులకు న్యాయం చేయాలని కోరారు. కాకుమానుకు చెందిన మహిళ పద్మజ మాట్లాడుతూ తమను ఇంతవరకు ఎవ్వరూ పట్టించుకోలేదన్నారు. కాల్వలకు గండ్లు పడినా పట్టించుకోలేదన్నారు. పొలాల్లో మోకాలిలోతు నీరు ఉందన్నారు. కాకుమాను మండలం మొత్తం పొలాలన్నీ నీట మునిగాయన్నారు. ఎకరాకు రూ.70 వేలు పెట్టుబడి పెట్టామని పెదనందిపాడుకు చెందిన రైతు విన్నవించారు. నష్టం అంచనాలను ఇంకా రూపొందించలేదన్నారు. రాజకీయాలకు అతీతంగా నష్టపరిహారం అందేలా చూడాలన్నారు. పాలపర్రుకు చెందిన మహిళ మాట్లాడుతూ 15 ఎకరాల పొగాకు సాగు చేశామని వర్షాలకు పంటమొత్తం మునిగిపోయిందని అన్నారు. తమ గ్రామంలో రైతులు పూర్తిగా నష్టపోయారన్నారు. గుంటూరు ఛానల్‌ పొడిగిస్తామని చెప్పిన సిఎం ఇంత వరకుపట్టించుకోలేదన్నారు. కాకుమాను మండలం బికె పాలేనికి చెందిన మహిళ మాట్లాడుతూ వరి 10 ఎకరాల్లో సాగు చేశామని మొత్తం మునిగిపోయిందన్నారు. పెదనందిపాడు ప్రధాన కూడలిలో జరిగిన సభలో చంద్రబాబు ప్రసంగిస్తూ రైతులను రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందన్నారు. టిడిపి హయాంలో గుంటూరు ఛానల్‌ ఆధునీకీకరణకు ఇచ్చిన ఆదేశాలను వైసిపి ప్రభుత్వం పట్టించుకోకుండా ఈ పనులను గాలికి వదిలేసిందన్నారు. రైతులను ఆదుకునేందుకు టిడిపి కృషి చేస్తుందన్నారు. ప్రభుత్వంపై వత్తిడి తెస్తామన్నారు. పులిచింతల, పట్టిసీమ ద్వారా సకాలంలోనీరు ఇచ్చి టిడిపి హయాంలో నీటి యాజమాన్య పద్దతులను సమర్ధవంతంగా చేయడం వల్ల పంటలను తుపాను బారిన పడకుండా కృషి చేశామన్నారు. పట్టిసీమ ద్వారా డెల్టాను సస్యశ్యామలం చేశామన్నారు. గోదావరి నీటిని పెన్నా నదితో అనుసంధానం చేసేందుకు ప్రణాళిక రూపొందించామన్నారు. సాగర్‌ కాల్వలకు గోదావరినీటిని తెచ్చేరదుకు ఐదుఎత్తిపోతల ద్వారా పనులకు టిడిపి హయంలో శ్రీకారంచుట్టామన్నారు. వీటిని వైసిపి ప్రభుత్వం గాలికి వొదిలేసిందన్నారు. టిడిపిహయంలో గుంటూరు ఛానల్‌ పొడిగింపు,విస్తరణకురూ.350కోట్లతో పనులకు శంఖుస్థాపన చేయగా వైసిపి ప్రభుత్వంనిర్లక్ష్యం చేయడం వల్ల ఈ ప్రాంతం ముంపునకు గురైందన్నారు. రాత్రి 11 గంటల వరకు చంద్రబాబుసభ కొనసాగింది. టిడిపి నియోజకవర్గం ఇన్‌ఛార్జి బూర్ల రామాంజనే యులు, జిల్లా అధ్యక్షులు తెనాలి శ్రావణ్‌ కుమార్‌, మాజీమంత్రి మాకినేనిపెద రత్తయ్య, జనసేన జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యేలు దూళిపాళ్ల నరేంద్ర, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్‌ పాల్గొన్నారు.

➡️