‘గురజాడ’లో మాక్‌ పార్లమెంట్‌

Mar 8,2024 19:45

ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి  : నగరంలోని గురజాడ పాఠశాలలో శుక్రవారం మాక్‌ పార్లమెంట్‌ నిర్వహించారు. విద్యార్థులు రాజకీయ పరిభాష, వాక్చాతుర్యంతో సభికులను అబ్బురపర్చారు. తమ ప్రాంతాల్లోని ప్రజా సమస్యల ప్రస్తావన, వాటికి సమాధానాలు, పరిష్కారాలు చూపడం, సభలో వారు వ్యవహరించిన తీరు విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను ఔరా..! అనిపించింది. ప్రజాస్వామ్య దేశాల్లో అతిపెద్దది భారత పార్లమెంటరీ వ్యవస్థ. కానీ, దేశంలో చాలా మందికి పార్లమెంట్‌ తీరుతెన్నులపై అవగాహనే లేదనడం అతిశయోక్తి కాదు. చరిత్ర, రాజనీతి పౌరశాస్త్రం, సైన్స్‌ వంటి అంశాలకు ప్రాధాన్యత తగ్గిస్తూ, వాటి స్థానాల్లో మూఢత్వాన్ని పెంచే పురాణాలు, సమాజ పరిణామ క్రమాన్ని విస్మరింపజేసే పాఠ్యాంశాలు రుద్దుతున్న క్రమంలో విద్యార్థులకు పార్లమెంట్‌ అంటేనే తెలియని పరిస్థితి దాపురించింది. ఇటువంటి పరిస్థితుల్లో విద్యార్థిదశలోనే పార్లమెంట్‌పైనా అవగాహన కల్పించాలని గురజాడ పాఠశాల యాజమాన్యం సంకల్పించింది. పాఠశాల ఆవరణలో శుక్రవారం నిర్వహించిన ఈ మాక్‌ పార్లమెంట్‌లో పాల్గొన్న విద్యార్థులంతా అచ్చంగా ఎంపీలు, కేంద్ర మంత్రుల పాత్రధారణలో పలు అంశాలపై చర్చలు, సంభాషణలతో ఆలోచింపజేశారు. ప్రజాసమస్యపై ఎంపీలు అడిగిన ప్రశ్నలకు సభాపతి ఆదేశాల మేరకు సంబంధిత మంత్రులు సమాధానం చెప్పారు. కార్యక్రమంలో విద్యార్థులంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్‌ డాక్టర్‌ ఎంవిఆర్‌ కృష్ణాజీ, కరస్పాండెంట్‌ ఎంవి స్వరూప మాట్లాడుతూ చట్టసభలు, రాజకీయాలపట్ల అవగాహన, రాజ్యాంగం హక్కులు, విలువలు, విశిష్టిత విద్యార్థి దశనుంచే తెలియజేయాలన్న లక్ష్యంతో మాక్‌ పార్లమెంట్‌ నిర్వహిస్తున్నామన్నారు. ప్రధానోపాధ్యాయులు బూడి శేఖర్‌ సారధ్యంలో ఈ మాక్‌ పార్లమెంట్‌ నిర్వహణ, ఏర్పాట్లు సిబ్బంది చేశారు. కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

➡️