గెలిస్తే ఇక్కడే ఇల్లు కట్టుకుంటా : అనిల్‌కుమార్‌

Feb 20,2024 22:29

బహిరంగ సభలో మాట్లాడుతున్న అనిల్‌కుమార్‌ యాదవ్‌
ప్రజాశక్తి – వినుకొండ :
సిఎం జగన్‌ మోహన్‌రెడ్డిపైకి కట్టకట్టుకుని వస్తున్న వారికి జనం తగిన విధంగా బుద్ధి చెప్పాలని వైసిపి నరసరావుపేట పార్లమెంట్‌ నియోజకవర్గ ఇన్‌ఛార్జి అనిల్‌కుమార్‌ అన్నారు. ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పుట్టినరోజు సందర్భంగా స్థానిక పల్నాడు రోడ్డులో రాష్ట్ర రహదారిపై మంగళవారం బహిరంగ సభ నిర్వహించారు. తొలుత వినుకొండ మండలం విఠంరాజుపల్లి నుండి వైసిపి శ్రేణులతో భారీ ర్యాలీగా సభ వద్దకు చేరుకున్నారు. అనంతరం సభలో అనిల్‌కుమార్‌ మాట్లాడుతూ గతంలో నరసరావుపేట నుంచి నెల్లూరుకు చెందిన నేదురుపల్లి జనార్దన్‌రెడ్డి, మేకపాటి రాజమోహన్‌రెడ్డిని ఎంపీలుగా ఎన్నుకుని పల్నాడు ప్రజలు ఆశీర్వదించారని, తననూ అదేవిధంగా ఆశీర్వదించాలని కోరారు. ఎంపీగా గెలిచిన వెంటనే పార్లమెంట్‌ పరిధిలో సొంత ఇల్లు నిర్మించుకొని ప్రజలకు అందుబాటులో ఉంటానన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిమ్‌ మైనార్టీలకు గత ప్రభుత్వం తీరని అన్యాయం చేసిందని, వైసిపి ప్రభుత్వం మాత్రం పెద్దపీట వేసిందని అన్నారు. నరసరావుపేట పార్లమెంటు నుంచి తొలిసారి బీసీలకు జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన అవకాశాన్ని ప్రజల స్వాగతించి ఆదరించాలని కోరారు. ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ గతంలో తాను 40 వేల ఓట్ల మెజార్టీతో గెలిచానని, ఈ సారి 60 వేల మోట్ల మెజార్టీతో గెలుస్తానని అన్నారు. వరికపూడిశల ప్రాజెక్ట్‌ అనిల్‌ కుమార్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో పూర్తవుతుందని చెప్పారు. నరసరావుపేట ఎంపీగా లావు శ్రీకృష్ణదేవరాయలను గెలిపించి ఢిల్లీకి పంపితే ఆయన గల్లీకే పరిమితమయ్యాడని ఎద్దేవ చేశారు. ఐదేళ్లలో వినుకొండ నియోజకవర్గం కేవలం రూ.60 లక్షల మాత్రమే నిధులు ఇచ్చారని అన్నారు. అనంతరం మార్కాపురం రోడ్డులోని చెక్‌పోస్ట్‌ వద్ద జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి విగ్రహాన్ని అనిల్‌ కుమార్‌ ఆవిష్కరించారు.

➡️