గెలుపోటములు సహజం

Dec 28,2023 21:21

ప్రజాశక్తి-పాచిపెంట : క్రీడల్లో గెలుపోటములు సహజమని, ప్రతిఒక్కరూ క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలని డిప్యూటీ సిఎం పీడిక రాజన్నదొర కోరారు. మండలంలోని పి.కోనవలస క్రీడా మైదానంలో మూడు రోజుల పాటు జరిగే రాష్ట్రస్థాయి గురుకులాల క్రీడా పోటీలను గురువారం డిప్యూటీ సిఎం రాజన్నదొర క్రీడా జ్యోతిని ప్రారంభించారు. ఈ పోటీలకు అండర్‌-17, 19 విభాగాల్లో రాష్ట్ర వ్యాప్తంగా 40 జట్లు హాజరయ్యాయి. క్రీడల ప్రారంభం అనంతరం రాజన్నదొర మాట్లాడుతూ గిరిజన విద్యార్థులు చదువుతోపాటు అన్ని రంగాల్లో రాణించాలని కోరారు. ముఖ్యంగా గిరిజన విద్యార్థుల్లోని క్రీడా నైపుణ్యాన్ని వెలికితీయడానికే రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలను సిఎం జగన్మోహన్‌ రెడ్డి ప్రవేశపెట్టారని తెలిపారు. విద్యార్థులు ఆటల్లో ఓడిపోయామని కుంగి పోకూడదని తెలిపారు. తాను కూడా మొదటిసారి ఎమ్మెల్యేగా ఓడిపోయానని కుంగి పోకుండా, న్యాయ పోరాటం చేసి ఎమ్మెల్యేగా ఎన్నికై, వరుసగా నాలుగు సార్లు విజయం సాధించానని గుర్తుచేశారు. రాష్ట్రంలో వరుసగా నాలుగు సార్లు గెలుపొందిన గిరిజన ఎమ్మెల్యే తానేనని చెప్పారు. పి.కోనవలసకు స్పోర్ట్స్‌ పాఠశాల, డిగ్రీ కాలేజీ తీసుకురావడానికి ప్రయత్నిస్తానని తెలిపారు. అనంతరం ఎనిమిదో తరగతి విద్యార్థులకు ట్యాబులు అందజేశారు. కార్యక్రమంలో ఎంపిపి బి.ప్రమీల, వైస్‌ ఎంపిపి మీసాల నారాయణ, సర్పంచ్‌ కె.మంగమ్మ, ఎంపిటిసి సభ్యులు తోకల లక్ష్మి, ఎం.రమణమూర్తి, గురుకులాల ప్రిన్సిపల్స్‌, పలువురు ప్రజా ప్రతినిధులు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

➡️