గ్రామాల్లో తాగునీటి సరఫరాలో వివక్ష

Feb 27,2024 23:29

ఖాళీ బిందెలతో ధర్నా చేస్తున్న టిడిపి, జనసేన శ్రేణులు
ప్రజాశక్తి – వినుకొండ :
నీటి ఎద్దడి ఉన్న గ్రామాల్లో ప్రతి ఇంటికి తాగునీటిని సరఫరా చేయాలని టిడిపి పల్నాడు జిల్లా అధ్యక్షులు జీవీ ఆంజనేయులు డిమాండ్‌ చేశారు. నీటి సరఫరాలో అధికార పార్టీ పక్షపాతం చూపుతోందంటూ మండల కేంద్రమైన బొల్లాపల్లిలోని ఎంపిడిఒబ కార్యాలయం వద్ద ఖాళీ బిందెలతో మంగళవారం ధర్నా చేశారు. జీవీ ఆంజనేయులు, జనసేన నియోజకవర్గ సమన్వయకర్త కొనిజేటి నాగశ్రీను రాయల్‌ మాట్లాడుతూ గ్రామాల్లోని ప్రజలందరికీ తాగునీరు సరఫరా చేయడం లేదని, టిడిపికి చెందినవారున్న ్లబజార్లకు ట్యాంకర్లను నిలిపివేయడం దుర్మార్గమని అన్నారు. నియోజకవర్గంలో ఇంటింటికీ తాగునీటి కుళాయి వేసి బుగ్గ వాగు రిజర్వాయర్‌ నుండి తాగునీరు సరఫరాకు టిడిపి హయాంలో రూ.640 కోట్లు విధులను వాటర్‌ గ్రిడ్‌ పథకం ద్వారా తీసుకువస్తే పథకాన్ని పూర్తి చేయలేని అసమర్ధ ప్రభుత్వమని విమర్శించారు. ఈ ప్రాంతా నీటి అవసరాలు తీర్చే వరికపూడిశెల నిర్మాణంపై వైసిపికి చిత్తశుద్ధి లేదన్నారు. ఏడాది క్రితం వినుకొండలో జరిగిన సభలో సీఎం జగన్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ బొల్లాపల్లి చెరువుకు మూగచింతలపాలెం డీప్‌ కట్‌ నుంచి పైపులైను వేయించి సాగర్‌ జలాలను నింపి సమస్య పరిష్కారానికి రూ.12 కోట్లు కేటాయిస్తున్నానని హామీ ఇచ్చి మోసం చేశారని అన్నారు. తాగునీరు లేక బొల్లాపల్లి మండలంలో ప్రజలు వలసలు పోయే పరిస్థితి నెలకొందన్నారు. వాటర్‌ గ్రిడ్‌ను నిర్మించి ఉంటే ఈ సమస్య ఉండేది కాదన్నారు. ఎమ్మెల్యే కొల్లా బ్రహ్మనా యుడు కమీషన్లకు కక్కుర్తి పడి వాటర్‌ గ్రేడ్‌ పథకాన్ని అడ్డుకున్నారని ఆరోపించారు. తాగునీటి సరఫరాలో అధికార పార్టీ పక్షపాతం, వివక్షతను విడాలని, అటువంటి వ్యక్తులపై అధికారులు కఠిన చర్యలు తీసుకొని ఇంటింటికీ నీరందించకుంటే జిల్లా కలెక్టర్‌ కార్యాలయాన్ని ముట్టడి స్తామని హెచ్చరించారు. అనంతరం ఇన్‌ఛార్జి ఎంపీడీవోకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు జె.గోవిందు నాయక్‌, పి.నాగేశ్వరరావు, హనుమ నాయక్‌, కోట నాయక్‌, వెంకటేశ్వర్రెడ్డి, మన్నయ్య పాల్గొన్నారు.

➡️