గ్రామాల్లో తీర్థ మహోత్సవాలు

మహిళా కబడ్డీ జట్టుతో గ్రామస్తులు

ప్రజాశక్తి-చోడవరం

మండలంలో అంకుపాలెం గ్రామంలో దుర్గాంబిక అమ్మవారి తీర్థ మహోత్సవం గురువారం ప్రారంభమైంది. ఈనెల 27వ తేదీ వరకు మూడు రోజులపాటు ఈ తీర్థం జరగనున్నది. ఈ సందర్భంగా మహిళల, పురుషుల రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలను గురువారం ప్రారంభించారు. ఈ పోటీల్లో గెలుపొందిన మహిళా జట్లకు మొదటి బహుమతి రూ.50వేలు, రెండవ బహుమతి రూ.40వేలు, మూడవ బహుమతి రూ.30వేలు, నాలుగో బహుమతి రూ.20 వేలు అందించనున్నారు. పురుషుల కబడ్డీ జట్టుకు మొదటి బహుమతి రూ.30వేలు, రెండవ బహుమతి రూ.20వేలు, మూడో బహుమతి రూ.15వేలు, నాలుగో బహుమతి రూ.10వేలు ఇవ్వనున్నారు. మూడు రోజులపాటు ఎడ్ల బండి, గుర్రపు పందాలు ఏర్పాటు చేశారు. రాష్ట్రస్థాయిలో పేరొందిన కళాకారులు చే ఈవెంట్స్‌ నిర్వహించడానికి కమిటీ ఏర్పాట్లు చేసింది. కబడ్డీ పోటీలను తిలకించడానికి పెద్ద ఎత్తున ప్రజలు రానుండడంతో స్థానిక సీఐ డి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. మరిడిమాంబ తీర్థందేవరాపల్లి : మండలంలోని మామిడిపల్లి గ్రామంలో గురువారం మరిడిమాంబ అమ్మవారి తీర్థ మహౌత్సవం అత్యంత వైభవంగా జరిగింది. అమ్మవారికి ధూప దీప నైవేద్యాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎడ్ల పరుగు పందెం నిర్వహించారు. ఈ ప్రదర్శనలో 15 ఎడ్ల బళ్ళు పాల్గొనగా అందులో మొదటి బహుమతి చుక్కపల్లికి చెందిన అడ్డిపల్లి పాలవెల్లికి రూ.10వేలు, రెండవ బహుమతి చుక్కపల్లికి చెందిన మురుకుతి హరికృష్ణ రూ.8000, మూడో బహుమతి నరసయ్యపేటకి చెందిన ముమ్మిడి రామకృష్ణ రూ.6000, నాలుగో బహుమతి కేజే పురంకు రెందిన కొయిలాడ మోహన్‌ రూ.4000, ఐదువ బహుమతి దేవరపల్లికి చెందిన వారధి భరద్వాజ్‌ రూ.2000, ఆరో బహుమతి దామనపల్లికి చెందిన కుర్రు జగదీష్‌ రూ.1000 చొప్పున అందజేశారు. ఈ బహుమతులను జడ్పిటిసి కర్రీ సత్యం, వైసిపి మండల అధ్యక్షులు బూరె బాబురావు, మండల యూత్‌ అధ్యక్షులు కర్రి సూర్య నాయుడు, ఎంపీటీసీ పంచాడ సింహాచలం నాయుడు గ్రామ పెద్దలు చేతుల మీదుగా అందజేశారు. పండుగ సందర్భంగా గ్రామంలో అమ్మవారి ఊరేగింపుతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు, బాణాసంచా, డాన్స్‌ బేబీ డాన్స్‌ కార్యక్రమాలు నిర్వహించారు.

➡️